This Time? ఈసారైనా వస్తారా?
ABN , Publish Date - Nov 21 , 2025 | 12:23 AM
Will They Come This Time? పార్వతీపురం మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లో పదకొండు దుకాణాల పరిస్థితేమిటో అర్థం కావడం లేదు. వాటిని అద్దె ప్రాతిపదికన కేటా యించేందుకు గత మూడేళ్లుగా సుమారు 20 సార్లు అధికారులు బహిరంగ వేలం పాట నిర్వ హించారు. అయినా ఎవరూ ముందుకు రాకపోవడం వెనుక అనేక సందేహాలు వ్యక్తమవు తున్నాయి.
గత మూడేళ్లలో ఇరవై సార్లు నిర్వహణ
అద్దె ప్రాతిపదికన కేటాయించేందుకు చర్యలు
అయినా ముందుకు రాని పాటదారులు
పార్వతీపురం టౌన్, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లో పదకొండు దుకాణాల పరిస్థితేమిటో అర్థం కావడం లేదు. వాటిని అద్దె ప్రాతిపదికన కేటా యించేందుకు గత మూడేళ్లుగా సుమారు 20 సార్లు అధికారులు బహిరంగ వేలం పాట నిర్వ హించారు. అయినా ఎవరూ ముందుకు రాకపోవడం వెనుక అనేక సందేహాలు వ్యక్తమవు తున్నాయి. వాస్తవంగా 2008లో 50 షాపులతో మున్సిపల్ కాంప్లెక్స్‌ను నిర్మించారు. అందులో ఒకటి మున్సిపల్ ప్రజారోగ్యశాఖ అధికారులు వినియోగిస్తున్నారు. మిగతా దుకాణాలను లీజు, అద్దె ప్రాతిపదికన పాటదారులకు కేటాయించారు. అయితే షాపింగ్ కాంప్లెక్స్‌లో 22, 23, 30, 32, 34, 35, 36, 40, 44, 46, 48 దుకాణాలకు సంబంధించి గత మూడేళ్లుగా బహిరంగ వేలంపాట నిర్వహిస్తున్నా ఎవరూ ముందుకు రావడం లేదు. 2022 నుంచి ఇప్పటి వరకు ఆయా షాపులు ఖాళీగా ఉన్నాయా..లేవా..? అన్నది రెవెన్యూ అధికారులకే ఎరుక. గత వైసీపీ ప్రభుత్వంలో 11 షాపుల్లో కొన్నింటిని అప్పటి ప్రజాప్రతినిధులు తమ అనుయాయులకే ఇచ్చినట్లు సమాచారం. అక్కడ వరకు బాగానే ఉందనుకుంటే ఖాళీగా ఉన్నాయని చూపిస్తున్న షాపులను కొంతమంది తమ సొంత వ్యాపారాలకు గోడౌన్‌లుగా వాడుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏదేమైనా గత మూడేళ్లుగా పదకొండు షాపుల నుంచి మున్సిపాల్టీకి రావాల్సిన ఆదాయానికి గండి పడింది. దీనికి కారకులు ఎవరనేది? అధికారులు, పాలకవర్గమే గుర్తించాల్సి ఉంది. కాగా షాపింగ్ కాంప్లెక్స్ చుట్టూ ఆక్రమణలు పెరిగిపోవడం, పారిశుధ్యం క్షీణించడం, నిత్యం దుర్వాసన వెలువడడం తదితర కారణాల వల్లే ఆ షాపుల వేలంపాటకు ఎవరూ ముందుకు రావడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోవైపు షాపుల నిర్వహణ అటకెక్కింది. పెచ్చులు ఊడిపోయి దుకాణాలు అధ్వాన స్థితికి చేరడం కూడా మరో కారణంగా తెలుస్తోంది. షాపింగ్ కాంప్లెక్స్ మరమ్మతులకు రూ.20 లక్షలు వెచ్చించాలని రెండు నెలల కిందట జరిగిన కౌన్సిల్ సమావేశంలో తీర్మానించారు. కానీ ఇప్పటివరకు పనులు ప్రారంభించలేదు.
25న నిర్వహణకు సన్నద్ధం
షాపింగ్ కాంప్లెక్స్‌లో పదకొండు దుకాణాలకు సంబంధించి ఈనెల 25న బహిరంగ వేలం పాట నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. మరి ఈసారైనా పాటదారులు ముందుకొస్తారా? లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. దీనిపై మున్సిపల్ రెవెన్యూ అధికారి రూబేనూను వివరణ కోరగా.. ‘ మున్సిపల్ కాంప్లెక్స్‌లోని షాపుల నుంచి ఆదాయాన్ని తెచ్చేందుకు కృషి చేస్తున్నాం. అయితే పదకొండు షాపులకు సంబంధించి పాటదారులు ఎందుకు రావడం లేదనేది? అర్థం కావడం లేదు. షాపింగ్ కాంప్లెక్స్ చుట్టూ ఉన్న ఆక్రమణలు తొలగించాలని, పారి శుధ్యం మెరుగుపర్చాలని, రూ.20 లక్షలతో దుకాణాలకు మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులకు లిఖిత పూర్వకంగా కోరాం. అయినా ఆయా శాఖలు స్పందించకపోవడం బాధాకరం.’ అని తెలిపారు.