Share News

Will there ever be 'growth'? ఇకనైనా ‘గ్రోత్‌’ ఉంటుందా?

ABN , Publish Date - Sep 28 , 2025 | 12:03 AM

Will there ever be 'growth'? గ్రోత్‌ సెంటర్‌ వస్తే తమ జీవితాల్లోనూ ‘గ్రోత్‌’ ఉంటుందని రైతులు ఆశించారు. పిల్లలకు ఉపాధి దొరుకుతుందని సంబరపడ్డారు. ఏపీఐఐసీ అడిగిందే తడవుగా భూములు ఇచ్చేందుకు అంగీకరించారు. ఇతర వర్గాలు కూడా తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భావించారు. వారి అంచనాలకు తగ్గుట్టుగానే ప్రారంభంలో గ్రోత్‌ సెంటర్‌లో 203 పరిశ్రమలు వచ్చాయి. ఇదే దారిలో మరిన్ని వస్తాయనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా ఉన్నవి మూసేశారు. కొత్త పరిశ్రమల రాక కలగా మిగిలింది. దశాబ్దాలుగా పాలకులు, ఉన్నతాధికారుల నిర్లక్ష్యానికి గురవుతోంది.

Will there ever be 'growth'? ఇకనైనా ‘గ్రోత్‌’ ఉంటుందా?

ఇకనైనా ‘గ్రోత్‌’ ఉంటుందా?

గ్రోత్‌సెంటర్‌పై జిల్లాలో చర్చ

దశాబ్దాలుగా కొనసాగుతున్న లోపాలు

ఎందుకీ నిర్లక్ష్యమంటున్న బొబ్బిలి ప్రజలు

అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే బేబీనాయన

గ్రోత్‌ సెంటర్‌ వస్తే తమ జీవితాల్లోనూ ‘గ్రోత్‌’ ఉంటుందని రైతులు ఆశించారు. పిల్లలకు ఉపాధి దొరుకుతుందని సంబరపడ్డారు. ఏపీఐఐసీ అడిగిందే తడవుగా భూములు ఇచ్చేందుకు అంగీకరించారు. ఇతర వర్గాలు కూడా తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భావించారు. వారి అంచనాలకు తగ్గుట్టుగానే ప్రారంభంలో గ్రోత్‌ సెంటర్‌లో 203 పరిశ్రమలు వచ్చాయి. ఇదే దారిలో మరిన్ని వస్తాయనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా ఉన్నవి మూసేశారు. కొత్త పరిశ్రమల రాక కలగా మిగిలింది. దశాబ్దాలుగా పాలకులు, ఉన్నతాధికారుల నిర్లక్ష్యానికి గురవుతోంది. తాజాగా గ్రోత్‌సెంటర్‌ దుస్థితిపై అసెంబ్లీలో ఎమ్మెల్యే బేబీనాయన సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. దీనిపై స్పీకర్‌, మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ పరిణామాలను గమనిస్తున్న జిల్లా ప్రజలు ఇప్పుడైనా గ్రోత్‌ సెంటర్‌ దశ మారుతుందేమోనని ఆశ పడుతున్నారు.

బొబ్బిలి, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి):

బొబ్బిలి చుట్టుపక్కల ప్రాంతాల్లో యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని చెబుతూ ప్రభుత్వం బొబ్బిలి పట్టణ సమీపంలో మెట్టవలస, నారాయణప్పవలస గ్రామాలకు చెందిన రైతుల నుంచి భూములు సేకరించి 1995లో గ్రోత్‌ సెంటర్‌ ఏర్పాటు చేసింది. భూములిచ్చిన రైతులు తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఎంతగానో ఆశించారు. కానీ అలా జరగలేదు సరికదా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని భూములు తీసుకున్న వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు కూడా ముఖం చాటేశారు. నేడు గ్రోత్‌ సెంటర్‌లో అభివృద్ధి పూర్తిగా పడకేసింది. గత ఏడాది ఎమ్మెల్యే బేబీనాయన అసెంబ్లీలో గ్రోత్‌ సెంటర్‌ గురించి లేవనెత్తినప్పటికీ ఎటువంటి ప్రగతి కనిపించలేదు. తాజాగా రెండోసారి సమస్యలను ఏకరువు పెట్టారు. సమస్యల విషయానికొస్తే గ్రోత్‌సెంటర్‌లో రోడ్లన్నీ సర్వనాశనం అయ్యాయి. చీకటిపడితే లోపలికి అడుగుపెట్టడానికి బెంబేలెత్తుతున్నారు. వీధిదీపాలు లేక పాముల సంచారం పెరిగింది. విద్యుత్‌ టారిఫ్‌ ఎక్కువగా ఉండడంతో కొత్తవారు ఆసక్తి చూపడం లేదు. పరిశ్రమల ఏర్పాటు కోసం స్థలాలు తీసుకున్న వారు వృథాగా వదిలేయడంతో వాటిల్లో పెద్దపెద్ద గుంతలు ఏర్పడి భయపడేలా చేస్తున్నాయి.

ఐలా కార్యకలాపాలేవీ?

పారిశ్రామిక భవన యజమానుల నుంచి వసూలు చేసిన ఆస్తిపన్ను రుసుం ఐలా(ఇండస్ర్టియల్‌ ఏరియా లోకల్‌ అథారిటీ) అకౌంట్‌కు జమ కావాల్సి ఉంది. అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించిన తరువాత గ్రోత్‌సెంటరులోని స్థలాలు పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి అప్పగిస్తారు. అలా అప్పగించిన తరువాత పరిశ్రమల యజమానులు నిర్మించే భవనాలపై ఆస్తిపన్ను వసూలు చేస్తారు. ఐలాకు కమిషనర్‌ స్థాయి అధికారి ఉండాలి. ఈ పోస్టు ఖాళీగా ఉండడంతో ఐలా కార్యకలాపాలు సన్నగిల్లాయి. అధికారులెవరూ అందుబాటులో ఉండడం లేదు. కాగా ఐలాకు రావాల్సిన బకాయిలన్నింటినీ ఆ అకౌంట్‌లో జమచేయడమే తప్ప అందులోనుంచి ఒక్క రూపాయి తీసుకునే వెసులుబాటు స్థానిక ఏపీఐఐసీ అధికారులకు లేకపోవడం గమనార్హం.

ఇంకా 94 పరిశ్రమలే

గ్రోత్‌సెంటరులో 320 యూనిట్లు ఏర్పాటైనప్పటికీ ప్రస్తుతం 94 పరిశ్రమలే పనిచేస్తున్నాయి. అందులో బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో 22 పరిశ్రమలుండగా, మిగిలినవన్నీ నారాయణప్పవలస, మెట్టవలస తదితర పంచాయతీల పరిధిలో ఉన్నాయి.

భారంగా రిజిస్ట్రేషన్‌ ఫీజు

గ్రోత్‌సెంటరులో ప్లాట్లు పొంది తిరిగి వాపసు చేయాలనుకునేవారు రిజిస్ర్టేషన్‌ రద్దు ఫీజు రూపేణా గతంలో రూ.1100 చెల్లిస్తే సరిపోయేది. ఇప్పుడా ఫీజును ప్లాటు విలువలో 4 శాతానికి పెంచడంతో ఈ ప్రక్రియలో స్థలాలు పొందేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఫలితంగా ఆ స్థలాలన్నీ ఖాళీగా ఉండిపోతున్నాయి. కొత్తగా దరఖాస్తు చేసుకునేవారికి స్థలాల కేటాయింపు సాధ్యం కావడం లేదు.

సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ..

వైసీపీ హయాంలో ఆ పార్టీ కీలక నేతకు ఇక్కడ 30 ఎకరాలను ఎకరం రూ.10 లక్షల చొప్పున కేటాయిస్తూ వేగావతి నదీజలాల వినియోగం కోసం ప్రత్యేక జీవో ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అప్పటి అడ్డదారి కేటాయింపులపై పెద్దదుమారం రేగడంతో వాటిని రద్దు చేసినట్లు చెబుతున్నారు. ఇదే మార్గంలో సుమారు 350 ఎకరాల పైగా భూములు ఖాళీగా ఉన్నాయి. కొంతమంది ఇతరులకు ఆ స్థలాలను సబ్‌ లీజులకు ఇచ్చుకుంటున్నారు.

నోటీసులు ఇచ్చి మమ..

స్థలాలు పొందినవారు పరిశ్రమలను ఏర్పాటు చేయకపోతే ఆ కేటాయింపులను రద్దు చేసే అధికారం ఏపీఐఐసీకి ఉంది. అలా స్థలాలు పొందినవారికి నోటీసులు ఇచ్చాక అధికారులు మిన్నకుండిపోతున్నారు. నోటీసులు జారీ చేస్తే అనేకమంది పారిశ్రామిక వేత్తలు వాటికి స్పందించడం లేదు. ఇంకొంతమంది పైరవీలు చేసి తప్పించుకుంటున్నారు. కాగా 30సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్న భూములలో కొందరు రైతులు పండించుకుంటున్నారు. గతంలో ఇలా వ్యవసాయం చేసుకుంటున్న వారిపై అధికారులు ప్రతాపం చూపారు.

-- గతంలో మోయర్స్‌ అనే సంస్థ సుమారు 200 ఎకరాల్లో విశాఖ స్టీల్స్‌కు అనుబంధంగా పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ఉపక్రమించింది. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంకుస్ధాపన చేశారు. ఆ తరువాత పనులు నిలిచిపోయి ప్రాజెక్టు పూర్తిగా రద్దయిపోయింది.

ప్రభుత్వానికి ఎన్నో వినతులిచ్చాం

బీవీఏ రావు, పరిశ్రమల నిర్వాహకుల సంక్షేమ సంఘం ప్రతినిధి

రోడ్లు, విద్యుత్‌ సౌకర్యాల కల్పనలో నాణ్యత పెంచాలి. విద్యుత్‌ టారిఫ్‌ను సవరించాలి. గుంతలు, మురుగునీటితో నిండి ఉన్న ప్లాట్లను గ్రీనరీ కోసం కేటాయించాలి. రాత్రివేళల్లో చాలా భయంగా గడపాల్సి వస్తోంది. చినుకుపడినా, గాలివీచినా విద్యుత్‌ సరఫరా నిలిచిపోతోంది. విద్యుత్‌ సిబ్బంది సైతం నానా ఇక్కట్లు పడుతున్నారు. ఆసక్తికరమైన పారిశ్రామిక పాలసీని ఏర్పాటు చేయాలి. పరిశ్రమ యూనిట్లు ఏర్పాటు చేసిన తరువాత స్థలాల రిజిస్ర్టేషన్ల కోసం చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఆస్తిపన్ను రేటు చాలా ఎక్కువగా ఉంటోంది. ఐలా కార్యకలాపాలను పారదర్శకంగా పునరుద్ధరించాలి.

కాలుష్యం మాకు....ఉద్యోగాలు వారికా?

పువ్వల మాధవరావు, సర్పంచ్‌, మెట్టవలస

గ్రోత్‌సెంటరులో పరిశ్రమలు వస్తాయని చెప్పగానే మెట్టవలస, ఎం.బూర్జివలస, పెంట, నారాయణప్పవలస, గొర్లెసీతారాంపురం గ్రామాలకు చెందిన భూములను కారుచౌకగా ప్రభుత్వానికి ఇచ్చాం. అప్పట్లో మాకు ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో ఎకరా రూ.30 వేలు లోపు ధరకు ఇచ్చేసాం. ఇప్పుడేమో మా గ్రామాల కుర్రాళ్లకు ఉద్యోగాలు రావడం లేదు. ఒడిశా, బీహార్‌, జార్ఖండ్‌ ప్రాంతాల నుంచి కార్మికులను తెప్పించుకొని పనులు చేయించుకుంటున్నారు. కాలుష్యం, రోగాలు మాకు అంటగట్టారు. స్థానికులకు ఉపాధి కల్పించాలి.

Updated Date - Sep 28 , 2025 | 12:03 AM