Share News

Vizianagaram: చర్యలు ఉంటాయా?

ABN , Publish Date - Jul 04 , 2025 | 12:19 AM

Will there be actions? జిల్లాలో ఎన్టీఆర్‌ వైద్య సేవ (ఆరోగ్య శ్రీ)లో ప్రక్షాళనకు రంగం సిద్ధమౌతున్నది. రెండు, మూడు రోజుల్లో ఆచరణకు దిగుతారని సమాచారం. ఈ నేపథ్యంలో ఆ విభాగానికి చెందిన కొందరు ఉద్యోగుల్లో గుబులు మొదలైంది.

Vizianagaram: చర్యలు ఉంటాయా?

  • చర్యలు ఉంటాయా?

  • ఎన్టీఆర్‌ వైద్య సేవలో ప్రక్షాళనకు శ్రీకారం

  • ఇటీవల జరిగిన అక్రమాలపై ప్రాథమిక నిర్ధారణ

  • సూత్రధారులు, పాత్రదారులపై ఆరా

మెంటాడ, జూలై3(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎన్టీఆర్‌ వైద్య సేవ (ఆరోగ్య శ్రీ)లో ప్రక్షాళనకు రంగం సిద్ధమౌతున్నది. రెండు, మూడు రోజుల్లో ఆచరణకు దిగుతారని సమాచారం. ఈ నేపథ్యంలో ఆ విభాగానికి చెందిన కొందరు ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. ఉమ్మడి జిల్లాల్లోని ఎన్టీఆర్‌ వైద్య సేవలో కొన్నేళ్లుగా మేట వేసిన అవినీతి, అక్రమాలను వరుస కథనాలతో ఆంధ్రజ్యోతి ఇటీవల వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. దీంతో స్థానికంగా రేగిన ప్రకంపనలు రాష్ట్రస్థాయికి చేరి చర్చనీయాంశంగా మారాయి. కథనాలతో కలవరపాటుకు గురైన జిల్లా ఎన్టీఆర్‌ వైద్య సేవ అధికారులు, నెట్‌వర్క్‌ ఆసుపత్రుల వర్గాలు అక్రమాల పర్వానికి సూత్రధారులుగా ప్రచారంలో ఉన్న టీం లీడర్లతో పలుమార్లు సమావేశం అయ్యారు. బయటపడేందుకు అత్యవసర సమావేశాలు కూడా నిర్వహించారు. ఇంకోవైపు ఎన్టీఆర్‌ వైద్య సేవ వ్యవహారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికార వర్గాల్లో కూడా కలకలం రేపింది. చిలికి, చిలికి గాలివానలా మారి కలెక్టర్‌ అంబేడ్కర్‌ వద్దకు చేరింది. దీనిపై సమగ్ర నివేదికకు ఆదేశాలు వచ్చినట్టు కూడా విస్తృత ప్రచారం జరిగింది. ఇంకోవైపు ఆరోగ్య మిత్రల ద్వారా సమాచారం తెలుసుకున్న సంఘ నాయకులు విషయాన్ని రాష్ట్రస్థాయి అధికారులకు తీసుకువెళ్లగా ఈ విషయం తమ దృష్టికి చేరిందని విచారణకు ఆదేశించామని తగిన సమయంలో స్పందన ఉంటుందని సమాధానంరావడంతో ఇక ప్రక్షాళనే తరువాయి అనే సంకేతాలు వెలువడ్డాయి.


ఎన్టీఆర్‌ వైద్య సేవ విభాగానికి కొద్ది రోజుల క్రితమే సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన దినేష్‌ జిల్లాల వారీగా పథకం తీరుతెన్నులపై సమీక్ష సందర్భంగా విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో వస్తున్న ఆరోపణలు ప్రస్తావనకు వచ్చాయని తెలిసింది. ఆంధ్రజ్యోతి కథనాలపై రూపొందించిన ఫైలును అందజేసినట్టు సమాచారం. వాటిని నిశితంగా పరిశీలించిన ఆయన అందులోని అంశాలను అసాంతం చదివి విస్తుపోయినట్టు తెలిసింది. బాధ్యులైన అధికారులు, సిబ్బంది, టీం లీడర్లు, ఆరోగ్యమిత్రలపై ఇంత వరకూ చర్యలు లేకపోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా విజయనగరం జిల్లా ఎన్టీఆర్‌ వైద్య సేవ కో-ఆర్డినేటర్‌ను వివరణ కోరినట్టు తెలియవచ్చింది.


అంతేకాకుండా ఉన్నచోటే దశాబ్దాల తరబడి తిష్టవేసిన టీంలీడర్లు, ఆరోగ్య మిత్రలు, సిబ్బంది, జిల్లా అధికారుల వ్యవహారాన్ని కూడా ఆయన తీవ్రంగా ఆక్షేపిస్తూ, అక్రమాలకు బాధ్యులైన వారిని విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో జిల్లా కో-ఆర్డినేటర్‌ ఓ సమావేశం ఏర్పాటు చేసి హాజరైన అధికారులు, టీం లీడర్లకు సీఈఓ ఆదేశాలను స్పష్టంచేస్తూ, బదిలీలు లేదా విధుల నుంచి శాశ్వత తొలగింపునకు సిద్ధంగా ఉండాలని సంకేతాలు ఇచ్చినట్టు తెలియవచ్చింది. తాజా పరిణామాల నేపథ్యంలో వీలైనంత త్వరలోనే ఎన్టీఆర్‌ వైద్య సేవలో ప్రక్షాళన ఖాయమని ఆ శాఖ వర్గాలు భావిస్తున్నాయి.

ఎన్టీఆర్‌ వైద్య సేవ జిల్లా కో-ఆర్డినేటర్‌ డాక్టరు సాయిరాం ఏమన్నారంటే.. ఎన్టీఆర్‌ వైద్య సేవలో జరిగిన, జరుగుతున్న అక్రమాల గురించి సీఈఓ వివరణ అడిగారని, సమగ్ర విచారణ చేపడతామని చెప్పారు. దీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్నవారిపై నిఘా వుంటుందని, టీం లీడర్లకు కూడా బదిలీలు చేపట్టే ఆలోచనలో ఉన్నామన్నారు. అక్రమాలకు చోటు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Updated Date - Jul 04 , 2025 | 08:18 AM