Share News

అక్రమ కుళాయి కనెక్షన్లపై చర్యలుంటాయా?

ABN , Publish Date - Oct 11 , 2025 | 12:18 AM

మునిసిపాలిటీలో అక్రమ కుళాయి కనెక్షన్ల భాగోతం మళ్లీ తెరపైకి వచ్చింది. వీటిని తొలగించాలని కౌన్సిలర్లు డిమాండ్‌ చేస్తున్నారు.

   అక్రమ కుళాయి కనెక్షన్లపై చర్యలుంటాయా?
బొబ్బిలి మునిసిపల్‌ కార్యాలయం

- బొబ్బిలి మునిసిపాలిటీలో 300లకు పైగా గుర్తింపు

- యథేచ్ఛగా నీటి చౌర్యం

- గత పదిహేనేళ్లుగా పట్టించుకోని అధికారులు

-మళ్లీ తెరపైకి వీటి ప్రస్తావన

- తొలగించాలంటున్న కౌన్సిలర్లు

బొబ్బిలి, అక్టోబరు 10 (ఆంరఽధజ్యోతి): మునిసిపాలిటీలో అక్రమ కుళాయి కనెక్షన్ల భాగోతం మళ్లీ తెరపైకి వచ్చింది. వీటిని తొలగించాలని కౌన్సిలర్లు డిమాండ్‌ చేస్తున్నారు. వాస్తవానికి ఇలాంటి అక్రమ కుళాయి కనెక్షన్లపై కఠిన చర్యలు తీసుకుంటామని గడిచిన మూడు, నాలుగు పాలకవర్గాల హయాం నుంచి అధికారులు బీరాలు పలుకుతున్నారే తప్ప ముందుడగు వేసి దాఖలాలు లేవు. ఈసారైనా చర్యలు తీసుకుంటారో? లేదో? వేచిచూడాలి.

ఇదీ పరిస్థితి..

మునిసిపాలిటీలోని 31 వార్డుల్లో 300కి పైగా అక్రమ కుళాయి కనెక్షన్లు ఉన్నట్లు సచివాలయ సిబ్బంది చేపట్టిన సర్వేలో తేలింది. వార్డుకు సగటున పది చొప్పున అక్రమ కుళాయి కనెక్షన్లు ఉన్నట్లు గుర్తించారు. మల్లమ్మపేట, గొల్లవీధి, గొల్లపల్లి తదితర వీధుల్లో 60 వరకు అక్రమ కనెక్షన్లు ఉన్నట్లు బయటపడింది. వీటి ద్వారా మునిసిపాలిటీకి ఒక్క రూపాయి ఆదాయం రావడం లేదు సరికదా తిరిగి ఆర్థిక భారాన్ని భరించాల్సి వస్తోంది. అధికారిక కుళాయి కనెక్షన్లు ఉన్న వారు నెలకు రూ.90 చొప్పున మునిసిపాలిటీకి పన్ను చెల్లిస్తున్నారు. కానీ, అక్రమ కుళాయి కనెక్షన్లు ఉన్నవారు మాత్రం రూపాయి కూడా చెల్లించడం లేదు. కొందరు కుళాయిలకు విద్యుత్‌ మోటార్లను అమర్చి యథేచ్ఛగా నీటి చౌర్యానికి పాల్పడుతున్నారు. కుళాయిలకు నీటిని వదిలినప్పుడు ఆయా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాను నిలిపివేయించాలని గతంలో పాలకులు తీర్మానం చేశారు. కానీ, అది ఆచరణలో సాఽధ్యం కాలేదు. ఫలితంగా నీటి చౌర్యం యథేచ్ఛగా కొనసాగుతోంది. దీనిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

అప్పుడు డిమాండ్‌ చేసి.. ఇప్పుడు వద్దని

ఇటీవల రెండు ప్రధాన పార్టీలకు చెందిన కౌన్సిలర్లు ఏకాభిప్రాయంతో ముందుకొచ్చి అక్రమ కుళాయి కనెక్షన్లను ప్రభుత్వ నిబంధన ప్రకారం క్రమబద్ధీకరించి, వాటికి అసెస్‌మెంట్‌ నెంబర్లను కేటాయించాలని, తద్వారా నెలవారీ కుళాయి పన్నులు వసూలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోబోమని, కుళాయిల రెగ్యులైజేషన్‌ ప్రక్రియను నిబంధనల ప్రకారం నిర్వహించాలని కోరారు. అయితే, ఇప్పుడు కొంతమంది కౌన్సిలర్లు ఈ వ్యవహారంపై సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించి కుళాయి రెగ్యులరైజేషన్‌ ఫీజును రూ.12 వేలు కాకుండా అందులో సగం లేదా రూ.7వేలు చొప్పున వసూలు చేయాలని పట్టుబడుతున్నారు. మరో మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నిక నగారా మోగుతుందన్న వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో కౌన్సిలర్లు తమ స్వరాన్ని మార్చినట్లు విమర్శలు వస్తున్నాయి. అనధికార కుళాయిలపై చర్యలు తీసుకుంటే అలాంటి వారి ఓట్లు పోతాయేమోనన్న భయం వారికి పట్టుకుంది. పట్టణంలోని 300 అక్రమ కుళాయిలను రెగ్యులరైజేషన్‌ చేసేందుకు రూ.12 వేలు చొప్పున వసూలు చేస్తే ఒకేసారి మునిసిపాలిటీకి రూ.36 లక్షల మేర ఆదాయం సమకూరే అవకాశం ఉంది. అలాగే నెలవారీ ఆదాయం కూడా పెరుగుతుంది. మరి మునిసిపల్‌ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

జీవోకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోలేం

అక్రమ కుళాయిల కనెక్షన్ల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం ఇచ్చిన జీవోకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేము. ఒక్కో కనెక్షన్‌ క్రమబద్ధీకరణకు రూ.12 వేలు వసూలు చేయాలని జీవోలో ఉంది. కొంతమంది కౌన్సిలర్లు చేసిన ప్రతిపాదన మేరకు ఆ మొత్తాన్ని తగ్గించేందుకు మాకు ఎటువంటి అధికారం లేదు. దీనిపై చైర్మన్‌, ఇతర అధికారులతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటాం.

-లాలం రామలక్ష్మి, మునిసిపల్‌ కమిషనర్‌, బొబ్బిలి

Updated Date - Oct 11 , 2025 | 12:18 AM