Will there be a merger?విలీనం ఉంటుందా?
ABN , Publish Date - Nov 03 , 2025 | 11:37 PM
Will there be a merger? విశాఖ జిల్లాలో ఎస్.కోట నియోజకవర్గం విలీనానికి ప్రస్తుతానికి బ్రేక్ పడింది. భవిష్యత్‌లో జరుగుతుందా? విలీనం చేయదలుచుకుంటే ఎలా చేస్తారు? ఏ పద్ధతిని పాటిస్తారు? రెండు నియోజకవర్గాల్లో ఉన్న జామి మండలంలోని గ్రామాలకు ఏ పరిష్కారం చూపుతారు? శాసన సభ నియోజకవర్గ పునర్వీభజన జరగాలేమో? అందుకు కేంద్రం అంగీకరిస్తుందా? ఇలా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు నియోజకవర్గమంతా ఒకే రెవెన్యూ డివిజన్‌లో ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతానికి ఈ అంశంపై మాత్రమే కసరత్తు జరుగుతోంది.
విలీనం ఉంటుందా?
విశాఖ జిల్లాలో ఎస్.కోట నియోజకవర్గం కలవడంపై అనుమానాలు
ఎన్నికల ప్రచార సమయంలో హామీ ఇచ్చిన చంద్రబాబు
తెరపైకి కొత్త చిక్కుముడులు
నియోజకవర్గమంతా ఒకే రెవెన్యూ డివిజన్‌లో ఉండాలంటున్న ప్రభుత్వం
కీలకంగా జామి మండలం
విశాఖ జిల్లాలో ఎస్.కోట నియోజకవర్గం విలీనానికి ప్రస్తుతానికి బ్రేక్ పడింది. భవిష్యత్‌లో జరుగుతుందా? విలీనం చేయదలుచుకుంటే ఎలా చేస్తారు? ఏ పద్ధతిని పాటిస్తారు? రెండు నియోజకవర్గాల్లో ఉన్న జామి మండలంలోని గ్రామాలకు ఏ పరిష్కారం చూపుతారు? శాసన సభ నియోజకవర్గ పునర్వీభజన జరగాలేమో? అందుకు కేంద్రం అంగీకరిస్తుందా? ఇలా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు నియోజకవర్గమంతా ఒకే రెవెన్యూ డివిజన్‌లో ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతానికి ఈ అంశంపై మాత్రమే కసరత్తు జరుగుతోంది.
శృంగవరపుకోట, నవంబరు 3(ఆంధ్రజ్యోతి):
నియోజకవర్గమంతా ఒకే రెవెన్యూ డివిజన్‌లో ఉంటాలన్న ప్రభుత్వ తాజా నిర్ణయంతో విశాఖ జిల్లాలో శృంగవరపుకోట నియోజకవర్గ విలీనంపై ఎన్నో సందేహాలు, మరెన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నియోజకవర్గం పక్క జిల్లాలో విలీనానికి జామి మండలం చిక్కుముడిలా మారింది. ఎన్నికల ప్రచార సమయంలో ప్రతిపక్షనేత హోదాలో ఎస్.కోట వచ్చిన చంద్రబాబు నాయుడు ఈ నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారు. చెప్పినట్టుగానే కూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లాల పునర్విభజనలో వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దేందుకు సిద్ధపడింది. దీంతో ఈ నియోజకవర్గ ప్రజల్లో ఆశలు రేకెత్తాయి. అయితే కొన్ని సాంకేతిక అంశాలు, ప్రభుత్వ ప్రాధాన్యాల్లో మార్పు రావడంతో ప్రస్తుతానికి విలీనానికి బ్రేక్ పడింది.
- సామాజిక, చారిత్రక, సాంస్కృతిక పరిస్థితులన్నీ విశాఖ జిల్లా ప్రజలతో అనుబంధం కలిగి ఉన్నప్పటికీ జిల్లాల కేంద్రాలకు ఈ నియోజకవర్గ మండల కేంద్రాల మధ్య దూరం విశాఖ జిల్లా కంటే విజయనగరం జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్నాయి. ఒక్క కొత్తవలస మండల కేంద్రం మాత్రమే విశాఖ జిల్లాకు దగ్గరగా కనిపిస్తోంది. ఈ అంశం ఒక్కటే విశాఖ జిల్లాలో ఎస్.కోట నియోజకవర్గ విలీనానికి అడ్డంకిగా ఉందని ఇంతవరకు అంతా భావించారు. అయితే ఇప్పుడు జిల్లాల పునర్వీభజనలో జరిగిన లోటుపాట్లను సరిదిద్దే క్రమంలో కూటమి ప్రభుత్వం శాసన సభ నియోజకవర్గమంతా ఒకే రెవెన్యూ డివిజన్‌లో ఉండేలా చూడాలనుకుంటోంది.
కీలకంగా జామి మండలం
జిల్లాలోని శృంగవరపుకోట నియోజకవర్గమంతా విజయగనగరం రెవెన్యూ డివిజన్‌లో ఉంది. శృంగవరపుకోట, వేపాడ, కొత్తవలస, లక్కవరపుకోట మండలాలతో పాటు జామి మండలంలోని 12 గ్రామాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. మిగతా 13 గ్రామాలు గజపతినగరం నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. మొదట వీటిపై స్పష్టత రావాలి. ఆ తర్వాతే విశాఖ జిల్లాలో ఎస్.కోట నియోజకవర్గం విలీనం అంశం కొలిక్కి వచ్చే అవకాశం ఉండొచ్చు.
చిక్కుముడులెన్నో..
ప్రస్తుతం విజయగనరం రెవెన్యూ డివిజన్‌లో శృంగవరపుకోట నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, జామి మండలంలోని సగం గ్రామాలతో పాటు గజపతినగరం నియోజకవర్గ పరిధిలోని మరో సగం గ్రామాలు(జామి మండలం), గంట్యాడ, నెల్లిమర్ల, డెంకాడ, భోగాపురం, పూసపాటిరేగ మండలాలు ఉన్నాయి. ఇందులో ఎస్.కోట నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాలతో పాటు జామి మండల పరిధిలోని సగం గ్రామాలు విశాఖలో విలీనం చేస్తే జిల్లాతో పాటు ఈ డివిజన్‌నుంచి తప్పుకుంటాయి. ఇదిలా ఉంటే గజపతినగరం నియోజకవర్గ పరిధిలోని గంట్యాడ, జామి మండలంలోని సగం గ్రామాలు మాత్రమే విజయనగరం డివిజన్‌లో ఉంటాయి. మిగిలిన గజపతినగరం, బొండపల్లి, దత్తిరాజేరు మండలాలు బొబ్బిలి రెవెన్యూ డివిజన్‌లో ఇప్పటికే ఉన్నాయి. నియోజకవర్గం మొత్తం ఒకే రెవెన్యూ డివిజన్‌లో ఉండాలన్న ప్రాతిపదికను అమలు పరిస్తే విజయనగరం డివిజన్‌లో ఉన్న గజపతినగరం నియోజకవర్గ పరిధిలోని ఒక్క మండలం బొబ్బిలిలో చేర్చాల్సి ఉంటుంది. అంటే జామి మండలంలోని సగం గ్రామాలు విశాఖలో విలీనం చేయడమో లేక బొబ్బిలి రెవెన్యూ డివిజన్‌లో కలపడమో చేయాలి. ఇది అంత సులువు కాదు. జామి మండలాన్ని మొత్తంగా ఒకే నియోజకవర్గంలోకి తీసుకురావాలంటే శాసన సభ నియోజకవర్గ పునర్వీభజన జరగాలి. ఈ ప్రక్రియ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. ఇదో పెద్ద ప్రహసనం కావడంతో ఇప్పట్లో జరిగే అవకాశం లేదు. ఇదంతా ఒక్క కొలిక్కి తెచ్చినప్పటికీ ఎస్.కోట నియోజకవర్గాన్ని జిల్లా నుంచి తప్పిస్తే జిల్లా స్వరూపంతో పాటు విజయనగరం రెవెన్యూ డివిజన్ చాలా చిన్నదిగా మారుతుంది. నియోజకవర్గ మంతా ఒక రెవెన్యూ డివిజన్‌లో ఉండాలన్న ప్రభుత్వ ప్రతిపాదనతో ఇన్ని ప్రతికూల పరిస్థితులు తెరపైకి వచ్చాయి. అందుకనే విశాఖ జిల్లాలో శృంగవరపుకోట నియోజకవర్గ విలీనంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అప్పట్లో పార్లమెంటరీ పరిధి
జిల్లాల పునర్వీభజనను వైసీపీ ప్రభుత్వం అప్పట్లో పార్లమెంటు ప్రాతిపదికన తీసుకున్నారు. దీంతో ఈ నియోజకవర్గం విశాఖ పార్లమెంటు పరిధిలో ఉండడంతో ఆ జిల్లాలో కలిసి పోతుందని ఆశపడ్డారు. దీనికి అనుగుణంగా అప్పటి వైసీపీ నేతలకు ఈ నియోజకవర్గ ప్రజలు విన్నవించారు. ఇవేమీ పట్టించుకోని ఆ పార్టీ పెద్దలు ఈ నియోజకవర్గాన్ని జిల్లాలోనే ఉంచేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో విలీనం అవుతుందని నియోజకవర్గ ప్రజలు భావించారు. కానీ అనేక కొత్త అంశాలు, చిక్కుముడులు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో విలీనానికి ప్రస్తుతానికి బ్రేక్ పడింది.