Share News

Will there be a beautiful ‘compassion’? సుందరీ‘కరుణ’ ఉంటుందా?

ABN , Publish Date - Aug 12 , 2025 | 12:22 AM

Will there be a beautiful ‘compassion’?

Will there be a beautiful ‘compassion’? సుందరీ‘కరుణ’ ఉంటుందా?
భైరిసాగరం చెరువు

సుందరీ‘కరుణ’ ఉంటుందా?

రూ.1.10 కోట్లతో భైరిసాగరం పనులు

గట్టు గట్టి చేసి మిన్నకుండిపోయిన వైనం

మిగిలిన పనుల సంగతేంటో!

బొబ్బిలి, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి):

పాతబొబ్బిలికి చెందిన భైరిసాగరం చెరువు సుందరీకరణ పనుల కోసం రూ.1.10 కోట్లతో చేపట్టిన పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. శంకుస్ధాపన జరిగిన తరువాత కొద్దిరోజులు పనులు చేసి ఆపేశారు. ఆ తర్వాత నేటికీ కదలిక లేదు. 2023 ఆగస్టులో అప్పటి ఎమ్మెల్యే శంబంగి ఈ పనులకు శంకుస్థాపన చేశారు. వైసీపీ హయాంలోనే పనులు నిలిచిపోయాయి. పైగా బుడా నుంచి నిధులను మంజూరు చేయించారు. కాగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెరువు పనులు మొదలవుతాయని అనుకుంటున్నారు. కానీ ఆ దిశగా అడుగు పడడం లేదు. అప్పట్లో 40 లక్షల రూపాయలతో పర్యాటక ప్రాంతాభివృద్ధి కింద యుద్ధస్తంభాన్ని ఆధునికీకరించారు. 700 ఎకరాల విస్తీర్ణం కలిగిన చెరువు ఆక్రమణలకు గురైనట్లు గుర్తించామని ప్రకటించారు కాని ఆ ఆక్రమణలను తొలగించేందుకు తీసుకున్న చర్యలు మాత్రం శూన్యం.

ఫ సుందరీకరణ పనుల్లో భాగంగా చెరువు చుట్టూ గట్టును పటిష్టం చేయడం, నీటిని శుద్ధి చేయడం, చెరువుగట్టు పొడవునా పాతబొబ్బిలి వరకు ట్రాక్‌ను ఏర్పాటు చేయడం వంటి పనులను ప్రతిపాదించారు. ఈ పనుల్లో ఒక్కటైనా ముందుకు సాగలేదు.

ఫ భైరిసాగరం ఆధునికీకరిస్తే అదో పర్యాటక ప్రాంతంగా మారడం ఖాయం. ఆ చెరువు ఒడ్డున బొబ్బిలి యుద్ధస్మాకరస్తంభం ఉన్నందున దానిని చూసేందుకు పర్యాటకులు రావడం పరిపాటి. గతంలో ఈ చెరువులో పర్యాటకశాఖ ఆధ్వర్యంలో బోటు షికారును ఏర్పాటు చేస్తామన్నారు. అది బుట్టదాఖలైపోయింది. యుద్ధస్తంబం ఆవరణలో గ్రీనరీ ఏర్పాటు చేసి అక్కడ ఓ క్యాంటీన్‌ పెట్టారు. అది నామమాత్రంగానే ఉండిపోయింది.

సుందరీకరణ పనులు నిలిచిపోయాయి

లాలం రామలక్ష్మి, మున్సిపల్‌ కమిషనరు, బొబ్బిలి

భైరిసాగరం చెరువు సుందరీకరణ పనులను ఏపీ గ్రీనరీ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో చేపట్టారు. చెరువు గట్టు పటిష్టత పనులు కొంతమేర జరిగాయి. మిగిలిన పనులకు పలురకాల ఆటంకాలు ఏర్పడడంతో నిలిచిపోయాయి. కాంట్రాక్ట్‌ ఏజన్సీ వారు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. మున్సిపాలిటీ పరంగా ఎటువంటి బిల్లుల చెల్లింపునకు ప్రతిపాదనలు పంపలేదు. ప్రభుత్వం ఎలా ఆదేశిస్తే అలా చర్యలు తీసుకుంటాం.

Updated Date - Aug 12 , 2025 | 12:22 AM