జిల్లా పరిషత్ ఏర్పాటయ్యేనా?
ABN , Publish Date - Dec 25 , 2025 | 10:37 PM
పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పడి మూడున్నరేళ్లు దాటినా ఇంకా జిల్లా పరిషత్ ఏర్పాటు కాలేదు.
-మూడున్నరేళ్లుగా కాలయాపన
-ఇంకా ఉమ్మడి జిల్లాల్లోనే సమావేశాల నిర్వహణ
-నిధుల కోసం తప్పని కష్టాలు
పార్వతీపురం, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పడి మూడున్నరేళ్లు దాటినా ఇంకా జిల్లా పరిషత్ ఏర్పాటు కాలేదు. ఇప్పటికీ ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కేంద్రంగానే కార్యకలాపాలు జరుగుతున్నాయి. జిల్లాకు సంబంధించి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కావాలన్నా ఆ రెండు జడ్పీల దయాదాక్షిణ్యాల మీదే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత వైసీపీ ప్రభుత్వం పార్లమెంట్ నియోజకవర్గాల ప్రతిపాదికగా కొత్త జిల్లాలను 2022, ఏప్రిల్ 4న ఏర్పాటు చేసింది. దీంతో విజయనగరం జిల్లాలో ఉన్న సాలూరు, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాలతో పాటు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పాలకొండ నియోజకవర్గాన్ని కలిపి పార్వతీపురం మన్యం జిల్లాగా ఏర్పాటు చేశారు. జిల్లా పరిషత్ సమావేశాలు సంవత్సరంలో కొన్ని విజయనగరంలో, మరికొన్ని పార్వతీపురం కేంద్రంగా నిర్వహిస్తామని అప్పట్లో ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ, ఆ హామీ గాలిలోనే కలిసిపోయింది. పార్వతీపురం జిల్లా కేంద్రంగా ఒక్కసారి కూడా జడ్పీ సమావేశం నిర్వహించిన దాఖలాలు లేవు. దీంతో విజయనగరం జడ్పీ సమావేశాలకు సాలూరు, కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాల పరిధిలో ఉన్న జడ్పీటీసీలు, మంత్రి, ఎమ్మెల్యేలు, అధికారులు, శ్రీకాకుళం జడ్పీ సమావేశాలకు పాలకొండ నియోజకవర్గ పరిధిలో ఉన్న జడ్పీటీసీలు, ఎమ్మెల్యే, అధికారులు వెళ్లాల్సి వస్తోంది. జిల్లా ఏర్పడి సంవత్సరాలు దాటుతున్నా ఇంకా ఉమ్మడి జిల్లాల్లోనే జడ్పీ కార్యకలాపాలు కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
- జిల్లా పరిషత్ ఏర్పాటు వచ్చే నూతన సంవత్సరంలోనైనా జరుగుతుందా? లేదా అన్న సందేహాలు ప్రజల్లో లేకపోలేదు. దీనికి అవసరమైన చర్యలు ఎప్పటికి పూర్తిచేస్తారో తెలియని పరిస్థితి ఉంది. సొంతంగా జిల్లా పరిషత్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఎన్నికల ప్రక్రియ పార్వతీపురం జిల్లా కేంద్రంగా నిర్వహించాల్సి ఉంది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతులు కూడా మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రక్రియలు వేగవంతంగా పూర్తి చేస్తేనే పార్వతీపురం జిల్లాకు సొంతంగా జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే అధికారం ఉంటుంది.