Share News

Zilla Parishad జడ్పీ విభజన జరిగేనా?

ABN , Publish Date - Nov 06 , 2025 | 12:08 AM

Will the Zilla Parishad Be Divided? పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలకు ఉమ్మడిగా ఉన్న జిల్లా పరిషత్‌ను విభజించనున్నారా? త్వరలోనే ఈ ప్రక్రియ చేపట్టనున్నారా? అంటే అవుననే సమాధానం సర్వత్రా వినిపిస్తోంది. విజయనగరం జడ్పీని త్వరలో విభజించే అవకాశాలున్నాయని అధికారవర్గాలు భావిస్తున్నాయి.

  Zilla Parishad   జడ్పీ విభజన జరిగేనా?
విజయనగరం జిల్లా పరిషత్‌

  • ఈ లోగా ప్రక్రియ పూర్తి కానుందని అధికార వర్గాల భావన

సాలూరు రూరల్‌, న‌వంబ‌రు5 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలకు ఉమ్మడిగా ఉన్న జిల్లా పరిషత్‌ను విభజించనున్నారా? త్వరలోనే ఈ ప్రక్రియ చేపట్టనున్నారా? అంటే అవుననే సమాధానం సర్వత్రా వినిపిస్తోంది. విజయనగరం జడ్పీని త్వరలో విభజించే అవకాశాలున్నాయని అధికారవర్గాలు భావిస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబరుతో జిల్లా పరిషత్‌ పాలక వర్గానికి నాలుగేళ్లు పూర్తయ్యింది. వచ్చే ఏడాది సెప్టెంబరు వరకు పదవీ కాలముంది. అయితే వచ్చే ఏడాది ప్రథమార్థంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సూచించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడిగా ఉన్న జిల్లా పరిషత్‌ విభజించే అవకాశా లున్నట్లు తెలుస్తోంది.

ఇదీ పరిస్థితి..

- ఉమ్మడి జిల్లాలో 34 మండలాల ప్రాతిపదికన 2021 ఏప్రిల్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలు అదే ఏడాది సెప్టెంబరులో వచ్చాయి. అప్పటి నుంచి జడ్పీ నూతన పాలకవర్గం అమల్లోకి వచ్చింది. కాగా గత వైసీపీ ప్రభుత్వం పార్లమెంట్‌ నియోజకవర్గాల ప్రతిపాదికగా కొత్త జిల్లాలను 2022, ఏప్రిల్‌ 4న ఏర్పాటు చేసింది. ఈక్రమంలో విజయనగరం జిల్లాలో సాలూరు, పార్వతీపురం, కురుపాం, శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ నియోజకవర్గాలతో పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పడింది. విజయనగరం జిల్లా సైతం శ్రీకాకుళం నుంచి రాజాం (ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గం కలుపుకుని ఎస్‌.కోట, గజపతినగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, బొబ్బిలి, విజయనగరం, సాలూరు అసెంబ్లీలో మెంటాడ మండలంతో కొత్త జిల్లాగా ఏర్పడింది.

- విజయనగరం జిల్లా విభజన చేసిన తర్వాత అప్పటికే కొత్త పాలకవర్గాలతో కొలువు దీరిన జడ్పీని రెండుగా విభజించడానికి న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. దీంతో జిల్లాను విభజించినా ఉమ్మడిగా జిల్లా పరిషత్‌ను కొనసాగించారు. జడ్పీ సమావేశాలను సైతం ఉమ్మడిగానే కొన సాగిస్తున్నారు. ఉమ్మడి విజయనగరంలో 34 జడ్పీటీసీలు, 549 ఎంపీటీసీ స్థానాలు ఉండేవి. జిల్లాల విభజన తర్వాత శ్రీకాకుళం జిల్లా నుంచి పాలకొండ, భామిని, వీరఘట్టం, సీతంపేట మన్యంలో, వంగర, రేగిడి రామభద్రపురం, రాజాం, సంతకవిటి మండలాలు విజయనగరంలో కలి శాయి. శ్రీకాకుళం జడ్పీ సమావేశాలకు పాలకొండ, రాజాం అసెంబ్లీల పరిధిలో ఉన్న జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు వెళ్తున్నారు. విజయనగరం జడ్పీ సమావేశాలకు సాలూరు, కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాల పరిధిలో పరిధిలో ఉన్న జడ్పీటీసీలు, మంత్రి, ఎమ్మెల్యేలు వెళ్తున్నారు.

- పార్వతీపురం మన్యం జిల్లాలో 15 , విజయనగరం జిల్లాలో 27 మండలాలున్నాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు ఏ జిల్లా పరిధిలోకి వస్తాయనేది స్పష్టత ఉంది. జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణపై మంత్రుల ఉపసంఘం గత నెల 29న సమావేశమైంది. తాజాగా బుధవారం సచివాలయంలో ఇదే అంశంపై చర్చించారు. జిల్లాల్లో మార్పులు చేర్పులపై రెండు, మూడు రోజుల్లో వారు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం ఒకే రెవెన్యూ డివిజన్‌లో ఉండాలనే ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదిస్తే మెంటాడ మండలం మళ్లీ పార్వ తీపురం మన్యం జిల్లాలో కలవనుంది. అలా కలవకపోయినా 15 జడ్పీటీసీ స్థానాలతో కొత్తగా పార్వతీపురం మన్యం జిల్లాలో జిల్లా పరిషత్‌ ఏర్పడే అవకాశముంది. 27 లేదా 26 ( మెంటాడ మండలం పార్వతీపురం మన్యం జిల్లాలో కలిపితే ) జడ్పీటీసీ స్థానాలతో విజయనగరం జడ్పీ ఉంటుంది. ఏదేమైనా ఉమ్మడి జిల్లా పరిషత్‌ విభజనకు కార్యాచరణ చేసే అవకాశాలున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Nov 06 , 2025 | 12:08 AM