కొండపైకి టీకా చేరేనా?
ABN , Publish Date - Mar 15 , 2025 | 11:55 PM
Will the vaccine reach the hill? భుజంపై చిన్నారిని ఎత్తుకొని నడుచుకుంటూ వస్తున్న ఆ గిరిజనుడు శృంగవరపుకోట మండలం దారపర్తి గిరిశిఖర పంచాయతీ వాసి. ఇరవై కిలోమీటర్ల దూరంలో వున్న ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి గత నెల 25న నడుచుకుంటూనే వెళ్లాడు.
కొండపైకి టీకా చేరేనా?
దృష్టి సారించని వైద్యులు, సిబ్బంది
రోడ్లు బాగాలేవని వెనకడుగు
మీడియాలో వార్తలొచ్చాక హడావిడి
అయోమయంలో కొండశిఖర గిరిజనులు
శృంగవరపుకోట, మార్చి 15(ఆంధ్రజ్యోతి): భుజంపై చిన్నారిని ఎత్తుకొని నడుచుకుంటూ వస్తున్న ఆ గిరిజనుడు శృంగవరపుకోట మండలం దారపర్తి గిరిశిఖర పంచాయతీ వాసి. ఇరవై కిలోమీటర్ల దూరంలో వున్న ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి గత నెల 25న నడుచుకుంటూనే వెళ్లాడు. ఇదే పంచాయతీ పరిధిలోని మరికొన్ని గ్రామాల్లోనూ పిల్లలు జ్వరాల బారిన పడిన వైనంపై ‘ఆంధ్రజ్యోతి’లో వార్త రావడంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కళ్లు తెరిచింది. తట్టువ్యాధిగా భావించి పది నెలల నుంచి ఐదు సంవత్సరాలోపు పిల్లలకు మీజల్స్ రూబెల్లా (ఎంఆర్)టీకాలను ఇచ్చింది. ఈ టీకాను ఆ పిల్లలకు సకాలంలో వేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. రోడ్డు సదుపాయం లేదు కొండెక్కి వెళ్లలేమని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు... అంత దూరం నడుచుకుని కొండ దిగి రాలేమని గిరిజన తల్లులు భావించడంతో చాలా మంది పిల్లలకు టీకాలు దక్కలేదు. దీంతో ఆ పిల్లలకు వ్యాధుల నుంచి రక్షణ కరువైంది. ఇప్పుడు తట్టు రూపంలో పంజా విసురుతోంది.
వ్యాధుల బారి నుంచి ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన వైద్య ఆరోగ్య శాఖ సకాలంలో టీకాలను వేయకపోవడంతో ఓ పక్క పిల్లలు శరీరకంగాను, మరో పక్క కుటుంబ సభ్యులు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. వాస్తవానికి మాతా, శిశు సంరక్షణకు ప్రభుత్వం రూ.కోట్లలో ఖర్చు పెడుతోంది. వారిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు జాతీయ స్థాయిలో టీకాలు వేస్తున్నారు. ఇంత ప్రాధాన్యత కలిగిన టీకా (వ్యాక్సినేషన్) కార్యక్రమాన్ని రహదారి సదుపాయం లేదన్న సాకుతో గిరి శిఖర గ్రామాల్లో ఇవ్వడం మానేయడం విస్మయం కలిగిస్తోంది. వారం, రెండు వారాలైతే ఫర్వాలేదు. ఏళ్లకు ఏళ్లు టీకాలు ఇవ్వకపోయినా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు దృష్టిసారించకపోవడం నిర్లక్ష్యానికి నిలువుటద్దం. ప్రతి బుధ, శనివారాల్లో వైద్య ఆరోగ్యశాఖ టీకాల కార్యక్రమం చేపడుతుంది. నిర్దిష్ట ఉష్ణోగ్రతతో కలిగిన బాక్స్‌లో చిన్నారులకు అవసరమైన టీకాలను భద్రపరిచి సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి గ్రామాలకు ఆరోగ్య కార్యకర్తలు (ఏఎన్‌ఎం) తీసుకెళ్తుంటారు. తల్లుల సమక్షంలో జీరో వయసు నుంచి 16 సంవత్సరాల వరకు వివిధ రకాల టీకాలను క్రమం తప్పకుండా అందిస్తారు. ఆ సమయంలో ఎంసీసీ (మాతా శిశు సంరక్షణ) కార్డులో నమోదు చేస్తారు. టీకా వేసిన తేదీ, తిరిగి ఏ టీకా ఎప్పుడు వేయాలో కూడా ఈ కార్డులో రాస్తారు. టీకాల కార్యక్రమం ముగిసిన తరువాత పిల్లలకు వేసిన టీకాల పేర్లు, ఎంత మందికి వేశారు? ఎంత మంది మిగిలారు? వీరికి తిరిగి ఎప్పుడు వేయాలన్న నివేదికను ఏఎన్‌ఎంలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆన్‌లైన్ చేయించాలి. ఇంత ప్రక్రియ ఉండే వాక్సినేషన్ గిరిశిఖర గ్రామాల్లో సరిగా జరగకపోవడం.. సంవత్సరాలుగా ఉన్నతాధికారులు గుర్తించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మాతా శిశు సంరక్షణ (ఎంసీసీ) కార్డులను గిరిజనుల నుంచి సేకరించి అప్పటికప్పుడు నింపేసే పరిస్థితి ఉండడం దారుణం. తప్పును కప్పిపుచ్చుకొనే బదులు గిరిజన చిన్నారుల ఆరోగ్యం కోసం పనిచేసి ఉంటే మంచిదని గిరిజన సంఘాలు భావిస్తున్నాయి.
మిగిలిన టీకాల మాంటేంటి?
గిరిజన పిల్లలకు వచ్చిన జ్వరం, దద్దుర్లను బట్టి మిజల్స్ రుబెల్లా (ఎంఆర్) వ్యాక్సిన్‌ను ఇస్తున్నారు. అయితే వివిధ రకాల టీకాలను పుట్టుక నుంచి 16 సంవత్సరాల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. పుట్టుక నుంచి రెండు వారాల వరకు బీసీజీ, ఓపీవీ, హెపటైటిస్-బి (క్షయ, పోలియో, పచ్చకామిర్లు రాకుండా), పది వారాలకు పెంటావాలెంట్ (ధనుర్వాతం, కంఠసర్పి, గోరింతదగ్గు, పచ్చకామిర్లు, న్యూమెనియా రాకుండా), 14వారాలకు పెంటావాలంట్, 16వారాలకు ఆర్‌వీవీ, 10వ నెలలో మిజల్స్ రుబెల్లా (తట్టు రాకుండా) ఆపై పీసీవి బూస్టర్, ఐపీవీ డోస్ (పోలియో రాకుండా) ఇవ్వాలి. 16 నెలలకు డీపీటీ ఽ(ధనుర్వాతం, కంఠ సర్పి, గోరింత దగ్గు రాకుండ) ఓపీవీ బూస్టర్ (పోలియో), మిజిల్స్ రూబెల్లా ( తట్టు రాకుండా) ఇవ్వాలి. 5 సంవత్సరాలకు డీపీటీ బూస్టర్ (ధనుర్వాతం, కంఠసర్పి, గోరింత దగ్గు) ఓపీవీ (పోలియో రాకుండా) ఇస్తారు. ఆ తర్వాత 10 సంవత్సరాలకు ఒకసారి, తిరిగి 16 సంవత్సరాలకు టీడీ (ధనుర్వాతం రాకుండా) టీకాలను వైద్యుల సూచన మేరకు క్రమం తప్పకుండా వైద్య ఆరోగ్య శాఖ వేస్తుంది. కాగా దారపర్తి గిరిశిఖర పంచాయతీ శివారు కురిడి, పోర్లు, పల్లపుదుంగాడ, రాయపాలెం, శనగపాడు తదితర గిరిజన గ్రామాల్లో అనారోగ్యం బారిన పడుతున్న చిన్నారులకు మిజిల్స్ రుబెల్లా టీకా ఇవ్వకపోవడంతో తట్టుబయపడింది. దీనికి టీకా (వ్యాక్సిన్)ను ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ ఇస్తోంది. ఈ టీకా ఒక్కటే ఇస్తుండడంతో మిగిలిన టీకాల మాటేంటని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు.