గిరిజన విద్యాశాఖ గాడిలో పడేనా?
ABN , Publish Date - Oct 11 , 2025 | 11:23 PM
పార్వతీపురం ఐటీడీఏ గిరిజన విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా విజయశాంతి శనివారం బాధ్యతలు స్వీకరించారు.
- డీడీగా విజయశాంతి బాధ్యతల స్వీకరణ
- సమస్యలను దాచేస్తున్న కొందరు వార్డెన్లు
- విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం
- మెనూ సక్రమంగా అమలు చేయాలి
పార్వతీపురం, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం ఐటీడీఏ గిరిజన విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా విజయశాంతి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈమె ఎన్టీఆర్ జిల్లాలో డీటీడబ్ల్యూవోగా పనిచేస్తూ పదోన్నతిపై ఇక్కడికి వచ్చారు. గతంలో డిప్యూటీ డైరెక్టర్‌గా రుక్మండయ్య పని చేశారు. ఆయన తర్వాత పలువురు ఇన్‌చార్జి డీడీలుగా నియాకమై విఽధులు నిర్వహించారు. ఇప్పటివరకు ఇన్‌చార్జి డీడీగా కృష్ణవేణి పనిచేశారు. ఎఫ్‌ఏసీ హోదాలో డీడీగా విజయశాంతి బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆమె కురుపాం గురుకుల పాఠశాల, ఏకలవ్య మోడల్ రెసిడ్షియల్ పాఠశాలను సందర్శించారు. ఇకపై సాలూరు ఏటీడబ్ల్యూవోగా కూడా ఆమె విధులు నిర్వహించనున్నారు. డీడీ నియామకంపై గిరిజన సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కారణం ఇదేనా?
డీడీ విజయశాంతి
కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో ఇటీవల పదుల సంఖ్యలో విద్యార్థినులు పచ్చకామెర్ల బారినపడిన విషయం తెలిసిందే. మంత్రులతో పాటు ఉన్నతాధికారులు ఈ పాఠశాలను సందర్శించి విద్యార్థినుల సమస్యలను తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిపెట్టారు. రెగ్యులర్ డీడీని నియమిస్తే గిరిజన విద్యాశాఖపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టడంతో పాటు ఇటువంటి సమస్యలు భవిష్యత్‌లో పునరావృతం కాకుండా ఉంటాయని ప్రభుత్వం ఆలోచన చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి డీడీగా విజయశాంతిని నియమించిందనే ప్రచారం జరుగుతోంది.
సరిదిద్దాలి..
డీడీగా బాధ్యతలు స్వీకరించిన విజయశాంతి గిరిజన విద్యాశాఖను పూర్తిస్థాయిలో గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. గిరిజన విద్యాలయాల్లో సక్రమంగా మెనూ అమలు చేయడంతో పాటు అన్ని మౌలిక వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అనార్యోగంతో బాధపడే విద్యార్థులను ఇళ్లకు పంపించవద్దని, వారిని స్థానిక ఆస్పత్రులకు తీసుకెళ్లి చూపించాలని ప్రజాప్రతినిధులతో పాటు ఉన్నతాధికారులు ఎన్నిసార్లు చెప్పినా సంబంధిత పాఠశాలల సిబ్బంది పట్టించుకోవడం లేదు. తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని చెప్పి పిల్లలను వార్డెన్లు వారి ఇళ్లకు పంపించేస్తున్నారు. అక్కడ సరైన వైద్యం లేక మృత్యువాత పడుతున్న పరిస్థితి పార్వతీపురం ఐటీడీఏలో కొన్ని దశాబ్దాలుగా ఉంది. ఇటువంటి పరిస్థితి మార్చే విధంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డీడీ విజయశాంతి తగు చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.
సమాచార లోపం..
గిరిజన విద్యాలయాలు, వసతి గృహాల్లో ఏదైనా సంఘటన జరిగితే ఆ విషయాన్ని సంబంధిత సిబ్బంది ఉన్నతాధికారులకు చెప్పడం లేదు. అధికారులకు చెబితే ఏమవుతుందోనని భయపడి సమాచారాన్ని దాచేస్తున్నారు. విషయం పెద్దదైన తర్వాత తలలు పట్టుకొని ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు. సమస్య ఏదైనా, ఎటువంటిదైనా ముందుగా ఉన్నతాధికారులు దృష్టికి తీసుకొని వస్తే వెంటనే దానిని పరిష్కరించేందుకు వీలుంటుంది. అలా కాకుండా సమస్య జఠిలమైన తర్వాత ఉన్నతాధికారులకు చెప్పడం వల్ల ప్రయోజనం ఉండదు. ఇప్పటికైనా ఈ పరిస్థితి మారాలి.