Share News

ట్రాఫిక్‌ కష్టాలు తీరేనా?

ABN , Publish Date - Nov 28 , 2025 | 11:18 PM

Will the Traffic Troubles End? జిల్లా కేంద్రం పార్వతీపురంలో రోజు రోజుకూ ట్రాఫిక్‌ సమస్య తీవ్రమవుతోంది. ప్రధాన రహదారితో పాటు కూడళ్ల వద్ద రాకపోకలు సాగించలేని పరిస్థితి ఏర్పడుతోంది. పట్టణం మధ్య నుంచి బైపాస్‌ రహదారి ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్‌ కష్టాలు రెట్టింపవుతున్నాయి.

 ట్రాఫిక్‌ కష్టాలు తీరేనా?
పట్టణంలో భారీ వాహనాలు వెళ్లే సమయంలో వాహనదారుల పరిస్థితి ఇదీ..

  • ప్రధాన రహదారిలో రాకపోకలకు అవస్థలు

  • దీర్ఘకాలంగా వేధిస్తున్నా.. స్పందించే వారేరీ?

పార్వతీపురం టౌన్‌, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం పార్వతీపురంలో రోజు రోజుకూ ట్రాఫిక్‌ సమస్య తీవ్రమవుతోంది. ప్రధాన రహదారితో పాటు కూడళ్ల వద్ద రాకపోకలు సాగించలేని పరిస్థితి ఏర్పడుతోంది. పట్టణం మధ్య నుంచి బైపాస్‌ రహదారి ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్‌ కష్టాలు రెట్టింపవుతున్నాయి. ప్రధానంగా భారీ వాహనాల రాకపోకల సమయంలో పాదచారులు, వాహన చోదకులు కష్టాలు ఆ పైవాడికే ఎరుక. తరచూ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడడంతో జిల్లాకేంద్రవాసులు నరకం చూస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

- సుమారు 30 ఏళ్ల కిందట అప్పటి జనాభా ప్రకారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి బైపాస్‌ రహదారి నిర్మించారు. అయితే భవిష్యత్‌లో వాహనాల సంఖ్య పెరిగితే పరిస్థితి ఏమిటన్నది ఇంజనీరింగ్‌ అధికారులు ఆలోచించలేదు. పక్కనే ఉన్న బొబ్బిలి, సాలూరులో పట్టణాలకు వెలుపల నుంచి బైపాస్‌ రహదారి ఉండగా పార్వతీపురంలో మాత్రం అందుకు భిన్నంగా నిర్మించారు. పట్టణం మధ్య నుంచి బైపాస్‌ రహదారి ఉండడంతో పాదచారులు, వాహన చోదకులకు ట్రాఫిక్‌ కష్టాలు తప్పడం లేదు.

- రోజూ ఉదయం 8 గంటల తరువాత పార్వతీపురం రద్దీగా మారుతుంది. చుట్టు పక్కల గ్రామాల నుంచి వేలాది మంది విద్యార్థులు బస్సులు, ప్రైవేట్‌ వాహనాలపై పాఠశాలలు, కళాశాలలను వస్తుంటారు. అదే సమయంలో పట్టణంలోని ప్రధాన, బైపాస్‌ రహదారి గుండా ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు భారీ వాహనాలు వెళ్తుంటాయి. దీంతో మిగతా వాహనదారులు, ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో చిక్కుకుపోవాల్సి వస్తోంది.

- జిల్లా కేంద్రలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌, సౌందర్య ఽథియేటర్‌ రోడ్డు, నాలుగు రోడ్లు పాతబస్టాండ్‌ కూడళ్ల మీదుగా భారీ వాహనాలు రాకపోకలు సాగించే సమయంలోనే ట్రాఫిక్‌ సమస్య జటిల మవుతోంది. పాతబస్టాండ్‌ నుంచి బైపాస్‌ రహదారి మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్‌ వరకు భారీ వాహనాలను మళ్లిస్తున్నా.. ప్రయోజనం ఉండడం లేదు. ఒక్కోసారి సిగ్నిల్‌ పాయింట్ల వద్ద సాంకేతిక సమస్యలు తలెత్తితే ఇక అంతే సంగతి. ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోవాల్సిందే. ఈ సమయంలో ట్రాఫిక్‌ క్లియర్‌ చేసేందుకు పోలీసులు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించాల్సి ఉంది. పక్కా ప్రణాళికతో ముందుకెళ్తేనే జిల్లా కేంద్రవాసులు ట్రాఫిక్‌ సమస్య నుంచి గట్టెక్కే అవకాశం ఉంది. భవిష్యత్‌లో పట్టణ వెలుపల నుంచి బైపాస్‌ రహదారిని ఏర్పాటు చేయకపోతే పాదచారులు, వాహనచోదకులు మరిన్ని కష్టాలు పడక తప్పదనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

ప్రణాళికలను సిద్ధం చేశాం..

జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశాం. భారీ వాహనాలు వెళ్లే సమయంలోనూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు చేపట్టాం.

- మురళీధర్‌, సీఐ, పార్వతీపురం టౌన్‌

Updated Date - Nov 28 , 2025 | 11:18 PM