Will the sugarcane factory return to its former glory? చెరకు ఫ్యాక్టరీకి పూర్వవైభవం వచ్చేనా?
ABN , Publish Date - Jul 19 , 2025 | 12:03 AM
Will the sugarcane factory return to its former glory? జిల్లాలో చెప్పుకోదగ్గ వ్యవసాయాధారిత పరిశ్రమగా గుర్తింపు తెచ్చుకున్న లచ్చయ్యపేట ఎన్‌సీఎస్ చక్కెర కర్మాగారం నేపథ్యం ఈ నాటిది కాదు. అర్ధశతాబ్దానికి పైగా చరిత్ర ఉంది. తొలుత ప్రైవేట్ రంగంలో ఏర్పాటై ఆ తరువాత పబ్లిక్ రంగంలోకి వెళ్లి, మళ్లీ ప్రైవేటుపరమై నేడు ఖాయిలా పడ్డ పరిశ్రమల జాబితాలో చేరింది. నాటి వైభవం కనుమరుగైంది. వైసీపీ ప్రభుత్వంలో పరిశ్రమకు కోలుకోలేని దెబ్బ తగిలింది. కూటమి ప్రభుత్వం తిరిగి పరిశ్రమకు పూర్వవైభవం తీసుకురావాలని, తెరిపించాలని రైతులు, కార్మికులు కోరుతున్నారు.
చెరకు ఫ్యాక్టరీకి
పూర్వవైభవం వచ్చేనా?
ఎన్‌సీఎస్‌కు కొన్నాళ్లుగా అన్నీ చేదు అనుభవాలే!
దశాబ్ద కాలం పాటు వెలుగు.. ఆపై కారుచీకట్లు
పరిశ్రమను కూటమి ప్రభుత్వం తెరిపించాలంటున్న రైతులు, కార్మికులు
జిల్లాలో చెప్పుకోదగ్గ వ్యవసాయాధారిత పరిశ్రమగా గుర్తింపు తెచ్చుకున్న లచ్చయ్యపేట ఎన్‌సీఎస్ చక్కెర కర్మాగారం నేపథ్యం ఈ నాటిది కాదు. అర్ధశతాబ్దానికి పైగా చరిత్ర ఉంది. తొలుత ప్రైవేట్ రంగంలో ఏర్పాటై ఆ తరువాత పబ్లిక్ రంగంలోకి వెళ్లి, మళ్లీ ప్రైవేటుపరమై నేడు ఖాయిలా పడ్డ పరిశ్రమల జాబితాలో చేరింది. నాటి వైభవం కనుమరుగైంది. వైసీపీ ప్రభుత్వంలో పరిశ్రమకు కోలుకోలేని దెబ్బ తగిలింది. కూటమి ప్రభుత్వం తిరిగి పరిశ్రమకు పూర్వవైభవం తీసుకురావాలని, తెరిపించాలని రైతులు, కార్మికులు కోరుతున్నారు.
బొబ్బిలి, జూలై 18 (ఆంధ్రజ్యోతి):
బొబ్బిలి పట్టణంలో ఒకటి, సీతానగరం మండలం అప్పయ్యపేట గ్రామంలో మరొక చక్కెర కర్మాగారం బొబ్బిలి రాజుల ఆధీనంలో శ్రీరామ్ షుగర్స్ పేరుతో నడిచేవి. తర్వాత జరిగిన పరిణామాలతో ఈ రెండు ఫ్యాక్టరీల స్థానంలో ఒకటి వచ్చింది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జాతీయమైన రెండు ఫ్యాక్టరీల స్థానంలో బొబ్బిలి పట్టణానికి సమీపంలో ఇప్పటి పార్వతీపురం మన్యంజిల్లా సీతానగరం మండలం లచ్చయ్యపేట వద్ద 1995-96లో ఏర్పాటైంది. సుమారు మూడువందల ఎకరాల్లో నిజాం సుగర్స్ పేరుతో రోజువారీ 2500 టన్నుల క్రషింగ్ సామర్థ్యంతో ఫ్యాక్టరీని స్థాపించారు. కొన్నాళ్లు బాగానే నడిచింది. తర్వాత రోజుల్లో రైతులకు సకాలంలో చెల్లింపులు చేయలేకపోయింది. నానాటికీ బకాయిలు పెరిగిపోయాయి. ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. 2002-03 నాటికి ఫ్యాక్టరీ నష్టాల్లో నడుస్తోందంటూ బహిరంగ వేలం వేశారు. కొనుగోలుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఎన్‌సీఎస్ సంస్థ వారు రూ.21 కోట్లకు లచ్చయ్యపేట ఫ్యాక్టరీని కొనుగోలు చేశారు. ఎన్‌ఎస్‌ఎఫ్ నుంచి ఎన్‌సీఎస్ చేతిలోకి వచ్చిన తరువాత సుమారు పదేళ్ల వరకు ఫ్యాక్టరీ ప్రగతి పథంలోనే నడిచింది. యాజమాన్యం అటు రైతులు, ఇటు కార్మికుల మన్ననలు పొందింది. ఫ్యాక్టరీని అంచెలంచెలుగా అభివృద్ధి చేసి 6500 టన్నుల క్రషింగ్ సామర్థ్యానికి పెంచడమే కాకుండా చెరకు పండించే రైతులకు ఇతోధికంగా ప్రోత్సాహకాలు, సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు ఇచ్చేది. తాగునీటి పైపులైన్లు వేసింది. పలు సేవా, ఽధార్మిక కార్యక్రమాలను నిర్వహించేది.
తిరోగమనంలోకి ఫ్యాక్టరీ
2015 నుంచి ఫ్యాక్టరీ ప్రగతి రథం మందగమనంలో పడింది. రైతులకు, కార్మికులకు బకాయిలు పేరుకుపోవడం మొదలైంది. పీకల్లోతు కష్టాల్లో యజమాన్యం కూరుకుపోయింది. దీని నుంచి గట్టెక్కే పరిస్థితి కనుచూపుమేరలో కనిపించలేదు. ఆర్‌ఆర్ యాక్టు కింద 62.47 ఎకరాలను రూ.27.49 కోట్లకు వేలం వేసి రైతుల బకాయిలను చెల్లించారు. పంచదార నిల్వలను వేలం వేయగా వచ్చిన రూ.11.5 కోట్లను కూడా రైతుల బకాయిలకే కేటాయించాల్సి వచ్చింది. ఇంకా మిగిలి ఉన్న పాతిక ఎకరాల భూములను కూడా బహిరంగ వేలం వేశారు. ఈ వెంటనే క్రషింగ్ జరపలేమని యాజమాన్యం చేతులెత్తేసింది. ఇంత జరిగినా వైసీపీ ప్రభుత్వం సహకరించలేదు. ఫ్యాక్టరీని రక్షించుకునే చర్యలు తీసుకోలేదు.
- వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫ్యాక్టరీని మళ్లీ జాతీయం చేయాలని టీడీపీ, సీపీఎం, సీపీఐ, జనసేన పార్టీలతో పాటు కార్మిక, రైతు సంఘాల నాయకులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. చెరకు రైతులకు గట్టి భరోసా ఇచ్చే ప్రయత్నమేదీ ఆ ప్రభుత్వం చేయలేదు. ఒక్కగానొక్క చెరకు పరిశ్రమ మనుగడను కాపాడాలని, ప్రత్యేక ప్యాకేజీ, రాయితీలను ప్రకటించి ఫ్యాక్టరీని తిరిగి తెరిపించాలని కూటమి ప్రభుత్వాన్ని వారంతా కోరుతున్నారు.
చెరకు విస్తీర్ణం తగ్గిపోతోంది
మర్రాపు సూర్యనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ చెరకు రైతుల సంఘం
2019లో 5.6 లక్షల హెక్టార్లలో ఉన్న చెరకు పంట సాగు దయనీయ స్థితికి చేరింది. లక్షలాది మందిరైతులు, వేలాదిమంది కార్మికులకు జీవనాధారంగా ఉండే ఈ పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రంలో కేవలం నాలుగు పరిశ్రమలు ముక్కుతూ మూలుగుతూ నడుస్తున్నాయి. సహకారరంగంలో గోవాడ ఫ్యాక్టరీ ఒక్కటే పనిచేస్తోంది. చెరకు ఫ్యాక్టరీలను ఆధునికీకరించి ఉప ఉత్పత్తుల తయారీని పెంచాలి. సహకార మిల్లుల్లో రైతులనే పాలకవర్గసభ్యులుగా నియమించాలి. రైతులకు గిట్టుబాటు ధర, 15 రోజులకోసారి బిల్లుల చెల్లింపు ప్రక్రియ సక్రమంగా నిర్వహిస్తే ఫ్యాక్టరీల మనుగడ, చెరకు పంట సాగు విస్తీర్ణానికి భరోసా ఉంటుంది.
చక్కెర కర్మాగారాలకు జవసత్వాలు కల్పించాలి
నారంశెట్టి తవిటిశెట్టి, సీనియర్ సిటిజన్, బొబ్బిలి
చక్కెర కర్మాగారాలకు జవసత్వాలు కల్పిస్తే అటు రైతాంగం, ఇటు కార్మికులు ఆర్థిక పరిపుష్టితో ఉంటారు. ఈ ఫ్యాక్టరీ మూతపడడంతో కార్మికులు, రైతుల జీవితాల్లో చీకట్లు అలముకున్నాయి. పరోక్షంగా ఉపాధి కోల్పోయిన వారు చాలా మంది వలసబాట పడుతున్నారు. ఈ సమస్య తీవ్రతను తెలియజేస్తూ ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులకు అనేకసార్లు వినతులు అందజేస్తూనే ఉన్నాము. సీఎం చంద్రబాబు దీనిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలి.