‘కడుపు కోత’ ఆగేనా?
ABN , Publish Date - Sep 25 , 2025 | 11:52 PM
: ప్రసవాల కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్న గర్భిణులకు కడుపు కోత తప్పడం లేదు.
- ప్రైవేట్ ఆస్పత్రుల్లో కానరాని సాధారణ ప్రసవాలు
- జిల్లాలో 90 శాతం సిజేరియన్లే
- కాసుల కోసం ఇష్టారాజ్యంగా ఆపరేషన్లు
- సీఎం చంద్రబాబు హెచ్చరికతోనైనా మార్పు వస్తుందా?
- రాష్ట్రంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే సిజేరియన్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. భగవంతుడు ఇచ్చిన సహజ సిద్ధమైన శరీరాన్ని కోతకు గురిచేయడం సరికాదు. డెలివరీ డేట్ నెల ముందే చెబుతున్నారు. ముహూర్తం పెడుతున్నారు.. ఇది చాలా తప్పు. ప్రమాదకర ధోరణి. డాక్టర్లు డబ్బుల కోసం సిజేరియన్‌ను ప్రోత్సహిస్తున్నారు. ఈ పరిస్థితి ఇకపై ఉండకూడదు.
-ఈ నెల 21న అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
పార్వతీపురం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ప్రసవాల కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్న గర్భిణులకు కడుపు కోత తప్పడం లేదు. సాధారణ ప్రసవానికి వీలున్నప్పటికీ కాసుల కోసం జిల్లాలోని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు గర్భిణులకు ఆపరేషన్లు చేసి డెలివరీ చేస్తున్నాయి. ఉమ్మనీరు తక్కువగా ఉందని, బిడ్డ అడ్డంగా తిరిగిందని, గుండె వేగంగా కొట్టుకొట్టోందని గర్భిణులను, వారి కుటుంబ సభ్యులను వైద్యులు భయపెట్టి ఆపరేషన్లకు అంగీకరించేలా చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కొందరు తల్లిదండ్రులు మాత్రం మంచి ముహూర్తాలు చూసుకుని కోరుండి సిజేరియన్ చేయాలని వైద్యులపై ఒత్తిడి తెస్తున్నారు. జిల్లా కేంద్రం పార్వతీపురంతో పాటు పాలకొండ, సాలూరు తదితర మండలాల్లోని ప్రైవేట్ ఆసుపత్రులు ఆపరేషన్ల కోసం అత్యధిక సొమ్ము డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంచుమించుగా సగానికి సగం ప్రసవాలు సాధారణంగానే జరుగుతున్నాయి. అయినా సరే అధిక శాతం గర్భిణులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. దీనికి ప్రభుత్వ ఆసుపత్రుల సేవలపై నమ్మకం లేకపోవడమే కారణం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోయినా చాలామంది ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్న పరిస్థితి జిల్లాలో ఉంది. అదేవిధంగా ఎన్టీఆర్ వైద్య సేవా పథకం పొందలేని వారు సిజేరియన్లకు పెద్ద ఎత్తున నగదు చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి వారి ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా తల్లి, బిడ్డ ప్రాణాల కోసం అప్పులు చేసి మరీ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆపరేషన్లు చేయించుకుంటున్న పరిస్థితి నెలకొంది. కొందరు ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, ఆర్‌ఎంపీలు కమీషన్లకు ఆశ పడి గర్భిణులను ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకువెళుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఎక్కువ ప్రసవాలు సిజేరియన్ పద్ధతిలోనే జరుగుతున్నాయి. ప్రధానంగా ఒడిశా రాష్ట్రం రాయఘడ తదితర ప్రాంతాల నుంచి డెలివరీల కోసం జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులకు గర్భిణులు వస్తున్నారు. వీరి నుంచి అధికంగా నగదు వసూలు చేసి ఆపరేషన్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల నేపథ్యంలో ఇప్పటికైనా ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
90 శాతంపైనే సిజేరియన్లు
జిల్లాలో 90 శాతం పైబడి సిజేరియన్లు జరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబరు 20 వరకు 20 మంది గర్భిణులు ప్రసవాలకు వెళ్లగా అందులో 17 సిజేరియన్లు జరిగాయి. మరొక ఆసుపత్రికి 15 మంది గర్భిణులు వెళ్లగా 11 ఆపరేషన్లు జరిగాయి. ఇంకొక ఆసుపత్రిలో 21 మంది గర్భిణులు కాన్పు కోసం వెళ్లగా అందులో 17 మందికి వైద్యులు ఆపరేషన్లు చేసి శిశువులను తీశారు.