Share News

Will the package arrive? ప్యాకేజీ అందేనా?

ABN , Publish Date - Apr 10 , 2025 | 12:02 AM

Will the package arrive? తారకరామ తీర్థసాగర్‌ రిజర్వాయర్‌ కోసం భూములు కోల్పోయిన సారిపల్లి గ్రామస్థులు పునరావాస (ఆర్‌అండ్‌ఆర్‌) ప్యాకేజీ కోసం ఎదురు చూస్తున్నారు. తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునరావాస ప్యాకేజీ వరింపజేయాలని ఏడేళ్లుగా కోరుతున్నారు.

Will the package arrive? ప్యాకేజీ అందేనా?

ప్యాకేజీ అందేనా?

ఏడేళ్లుగా సారిపల్లి గ్రామస్థుల ఎదురుచూపు

తారకరామ తీర్థసాగర్‌లో భూములు కోల్పోయిన వైనం

నిర్వాసితులను పట్టించుకోని గత వైసీపీ సర్కారు

ప్రస్తుత ప్రభుత్వంపైనే ఆశలు

నెల్లిమర్ల, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి):తారకరామ తీర్థసాగర్‌ రిజర్వాయర్‌ కోసం భూములు కోల్పోయిన సారిపల్లి గ్రామస్థులు పునరావాస (ఆర్‌అండ్‌ఆర్‌) ప్యాకేజీ కోసం ఎదురు చూస్తున్నారు. తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునరావాస ప్యాకేజీ వరింపజేయాలని ఏడేళ్లుగా కోరుతున్నారు. అయినా ఫలితం ఉండడం లేదు. కనీసం పీఏఎఫ్‌ ప్యాకేజీ అయినా ఇవ్వాలని విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో పాలకులపై ఎన్నిసార్లు ఒత్తిడి తెచ్చినా ప్రయోజనం లేకపోయింది. జిల్లా నుంచి ఢిల్లీ వరకూ ప్రజాప్రతినిధులందరికీ తమ డిమాండ్‌పై లిఖిత పూర్వక వినతిపత్రా లు ఇచ్చినా పట్టించుకోలేదు.

సమస్య మొదలైందిలా..

జిల్లా కేంద్రం విజయనగరానికి సుమారు 16 కిలోమీటర్ల దూరంలో, మండల కేంద్రం నెల్లిమర్లకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న సారిపల్లిలో సుమారు 1,200 కుటుంబాలు జీవిస్తున్నాయి. దాదాపు 5 వేల మంది జనాభా ఉన్న ఈ గ్రామానికి దశాబ్దాలుగా గ్రామంలో ఉన్న సాగు భూములే దిక్కు. ఏడు సంవత్సరాల కిందట గ్రామ పరిధిలోని కుమిలి చెరువు వద్ద తారకరామతీర్థసాగర్‌ రిజర్వాయర్‌ నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనికోసం సారిపల్లికి చెందిన సుమారు వెయ్యి ఎకరాల సాగుభూమితోపాటు ఏటీ అగ్రహారం, కోరాడపేట, సీతారామునిపేటలోని పంట భూములను స్వాధీనం చేసుకుంది. అయితే రిజర్వాయర్‌ పరిధిలో సాగు భూములతోపాటు ఏటీ అగ్రహారం, కోరాడపేట ఊర్లు కూడా ముంపునకు గురికానున్నా యని భావించిన అధికారులు ఈ రెండింటిని ముంపు గ్రామాలుగా ప్రకటించి వారికి పునరావాస ప్యాకేజీ అమలు చేశారు. మొత్తంసాగు భూములన్నీ పోయిన సారిపల్లిని మాత్రం అధికారులు ముంపు గ్రామంగా ప్రకటించలేదు. గ్రామంలోని ఇళ్లకు రిజర్వాయర్‌ ప్రభావం లేదని అధికారులు చెప్పడంతో సారిపల్లి గ్రామస్థులు ఖంగుతిన్నారు.

భూములు తీసుకుని మమ్మల్ని వదిలేస్తారా?

సారిపల్లి గ్రామస్థులకు ప్రధాన జీవనాధారం సాగు భూములే. వాటిని రిజర్వాయర్‌ కోసం తీసుకున్నప్పుడు తాము ఈ గ్రామంలో ఉండి ఏం ప్రయోజనం అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామాన్ని ఇప్పటికైనా ముంపు గ్రామంగా ప్రకటించి, తమకు వేరే చోట నిర్వాసిత కాలనీ నిర్మించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటిస్తే నిర్వాసిత కాలనీ నిర్మాణంతో పాటు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద ప్రతీ కుటుంబంలోని 18 ఏళ్లు నిండిన వ్యక్తులకు ఆర్థిక సాయం సమకూరుతుంది. దీనిపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ క్రమంలో గతంలో గ్రామానికి చెందిన సర్పంచ్‌ రాయి విభూషణరావుతోపాటు ఇతర నాయకులు కొద్ది రోజులు రిలే దీక్షలు కూడా చేశారు. తమకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అమలు సాధ్యం కాకపోతే కనీసం ప్రాజెక్టు ఎఫెక్ట్‌డ్‌ ఫ్యామిలీస్‌ (పీఏఎఫ్‌) ప్యాకేజీ అయినా అమలు చేయాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం పీఏఎఫ్‌ ప్యాకేజీ అమలు చేస్తామని చివరి వరకు ఊరించి ఉస్సూరుమనిపించింది. పీఏఎఫ్‌ ప్యాకేజీ కోసం సర్వే చేసిన అధికారులు 1,293 పేర్లతో జాబితాను కూడా పునరావాస పునర్నిర్మాణ శాఖ అధికారులకు పంపించారు. అయినా ఎటువంటి కదలిలేక లేదు. కూటమి ప్రభుత్వమైనా స్పందించి ఆర్‌ఆర్‌ ప్యాకేజీ లేదా పీఏఎఫ్‌ ప్యాకేజీ అమలు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Apr 10 , 2025 | 12:02 AM