Share News

Will the Mess Be Resolved? జంఝాటం తేలేనా?

ABN , Publish Date - May 05 , 2025 | 11:42 PM

Will the Mess Be Resolved? జిల్లాలో కీలకమైన ప్రాజెక్టుల్లో ఒకటి జంఝావతి. ఒడిశా రాష్ట్రంతో నెలకొన్న వివాదం వల్ల ఏళ్లు గడుస్తున్నా.. దీని పనులు పూర్తి కావడం లేదు. దీంతో పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరు చేరడం లేదు.

Will the Mess Be Resolved?  జంఝాటం తేలేనా?
జంఝావతి ప్రాజెక్టు

  • 47 ఏళ్లుగా కొనసాగుతున్న సమస్య

  • పూర్తికాని జంఝావతి ప్రాజెక్టు పనులు

  • పలుమార్లు ఇరు రాష్ట్రాల సీఎంలు,ఉన్నత స్థాయి కార్యదర్శుల సమావేశాలు

  • అయినా ఫలితం శూన్యం

  • సాగునీటికి రైతులు కటకట

  • ప్రస్తుతం ఏపీ-ఒడిశాలో అనుకూల పరిస్థితులు

  • ఇదే సరైన సమయమని భావిస్తున్న జిల్లా రైతులు

  • ముఖ్యమంత్రి చంద్రబాబుపైనే ఆశలు

జియ్యమ్మవలస, మే 5(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కీలకమైన ప్రాజెక్టుల్లో ఒకటి జంఝావతి. ఒడిశా రాష్ట్రంతో నెలకొన్న వివాదం వల్ల ఏళ్లు గడుస్తున్నా.. దీని పనులు పూర్తి కావడం లేదు. దీంతో పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరు చేరడం లేదు. ఏటా రైతులు వరుణుడిపైనే ఆధారపడి సాగు చేసుకోవాల్సిన దుస్థితి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు చర్చలు జరిపినా.. ఎటువంటి ఫలితం లేకపోయింది. తాజాగా ఏపీ-ఒడిశాలో అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఎన్డీయే ప్రభుత్వాలే కొలువుదీరిన నేపథ్యంలో జంఝావతి సమస్య పరిష్కారానికి ఇదే మంచి తరుణమని జిల్లా రైతులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపైనే కొండంత ఆశలు పెట్టుకున్నారు. కేంద్ర పెద్దలు, ఒడిశా ప్రభుత్వంతో చర్చలు జరిపి ప్రాజెక్టు పూర్తికి కృషి చేస్తారని, 47 ఏళ్ల నుంచి కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరిస్తారని భావిస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురానికి సమీపంలో ఉంది జంఝావతి ప్రాజెక్టు. 1978లో అప్పటి ప్రభుత్వం దీని నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే కొమరాడ, పార్వతీపురం, గరుగుబిల్లి, సీతానగరం, మక్కువ మండల పరిధిలోని 75 గ్రామాల్లో 24,640 ఎకరాలకు పుష్కలంగా సాగునీరందనుంది. కానీ ఒడిశా రాష్ట్రంతో ఉన్న వివాదం కొలిక్కి రాకపోవడం వల్ల 47 ఏళ్ల నుంచి ఈ ప్రాజెక్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఏటా కేవలం తొమ్మిది వేల ఎకరాలకు మాత్రమే సాగునీరందుతుంది. దీంతో కొందరు రైతులు వరుణుడిపై ఆధారపడి సాగు చేస్తున్నారు. మిగిలిన వారు వలస బాట పడుతున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా.. దీనిపై స్పందించేవారే కరువయ్యారు. ఒడిశా ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేలా చొరవ చూపకపోవడంపై అన్నదాతలు పెదవి విరుస్తున్నారు.

ముంపు గ్రామాలు ఇవే..

కొమరాడ మండలం కంబవలసలో 184.31 ఎకరాలు, పిల్లిగుడ్డిలో 212.16 ఎకరాలు, బంజుకుప్పలో 551.92 ఎకరాలు, లక్ష్మీపేటలో 121.61 ఎకరాలు కలిపి మొత్తం 1070 ఎకరాలు ముంపునకు గురవుతాయని అప్పటి ఏపీ ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు 1987లో భూసేకరణ పూర్తి చేసి వారికి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కూడా ఇచ్చేసింది.

- ఒడిశా రాష్ట్రం కొరాపుట్‌ జిల్లా పరిధిలో ఉన్న పది ముంపు గిరిజన గ్రామాల్లో సోషియో ఎకనామిక్‌ సర్వేకు ఆయా గ్రామస్థులు అంగీకరిం చడం లేదు. వారు అంగీకరించి రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తి కావాలంటే ఖచ్చితంగా ఒడిశా ప్రభుత్వ సహాయ సహకారాలు కావాల్సిందే. కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏపీకి సహకరించడం లేదు.

ఒడిశాలో పది గ్రామాలే అడ్డంకి...

ఒడిశా రాష్ట్రం కొరాపుట్‌ జిల్లాలోని పది గ్రామాల్లో 1175.10 ఎకరాలు ప్రాజెక్టు పూర్తికి అడ్డంకిగా మారాయి. అయితే ఆయా గ్రామాల్లో సర్వే చేసి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇచ్చేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ఆ రాష్ట్ర పరిధిలోని పూర్తి ముంపు గ్రామాలుగా గుర్తించిన బడబంకిడిలో 230.63 ఎకరాలు, అంబవలసలో 223.62, దిగుబంద్రపల్లిలో 212.84, జయకోటలో 170.88 చొప్పున ఎకరాలు ఉన్నాయి. పాక్షిక ముంపు గ్రామాలైన నాగులవలసలో 96.68 ఎకరాలు, ఉపరభద్రపల్లిలో 94.83 , సాంబన్నకిడిలో 53.76 , హటిగెడలో 37.55 , చక్కవలసలో 30, తాడివలసలో 24.31 చొప్పున ఎకరాలు ఉన్నాయి.

విఫలమైన చర్చలు

- జంఝావతి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి విషయంలో ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్య కార్యదర్శుల మధ్య పలు దఫాలు చర్చలు జరిగాయి. కానీ ఏం ప్రయోజనం లేకపోయింది.

- ఒడిశా రాష్ట్రం కొరాపుట్‌ జిల్లాలో ఉన్న తూర్పు కనుమల నుంచి నీరు ప్రవహిస్తూ కొండలపై నుంచి 60 కిలో మీటర్లు ప్రవహించి జంఝావతిలో కలుస్తుంది. ఈ మేరకు 1975 సెప్టెంబరు 24న, 1978 డిసెంబరు 15న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. ప్రవహిస్తున్న నీరు 8 టీఎంసీలుగా లెక్కించారు. ఇరు రాష్ట్రాలు 4 టీఎంసీల చొప్పున నీటిని వినియోగించుకోవాలని అంగీకరించారు.

- ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన 4 టీఎంసీలతో పార్వతీపురం, కొమరాడ, గరుగుబిల్లి, సీతానగరం, మక్కువ మండలాల పరిధిలో 75 గ్రామాల్లో దాదాపు 24,640 ఎకరాలకు సాగునీరందించేందుకు ప్రణాళికలు రూపొందించారు.

- 1980, జూలై 27న ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లో ఇరు రాష్ట్రాల కార్యదర్శులు సమావేశమై పెండింగ్‌లో ఉన్న ముంపు ప్రాంతంలో జాయింట్‌ సర్వే చేయాలని నిర్ణయించారు.

- 2002, జనవరి 29న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బ్యాక్‌ వాటర్‌ ఎఫెక్ట్‌ అండ్‌ సబ్‌మెర్జిన్స్‌ ఎప్రూవ్డ్‌ ఇరు రాష్ట్రాల కార్యదర్శులు అంగీకరించారు. ఆ తరువాత అదే సంవత్సరం డిసెంబరు 23న భువనేశ్వర్‌లో సమావేశం నిర్వహించారు. ముంపు ప్రాంతం, బ్యాక్‌ వాటర్‌ ఏరియా కలిపి 1175.10 ఎకరాలుగా గుర్తించారు. ఇందులో 848.76 ఎకరాలు ప్రభుత్వ భూమిగా, మిగిలిన 323.34 ఎకరాలు ప్రైవేటు భూమిగా నిర్ధారించారు.

- ఇదే సమావేశంలో గ్రామసభలు నిర్వహించారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఫైనలైజ్‌ చేశారు. ఆ జాబితాను ఏపీ ప్రభుత్వానికి పంపించారు. ఆ మొత్తం డిపాజిట్‌ చేస్తే అప్పుడు ప్రాజెక్టు పూర్తి నిర్మాణానికి క్లియరెన్స్‌ ఇస్తామని ఒడిశా చెప్పింది.

- ఈలోగా 2005-06లో జంఝావతి స్పిల్‌వే వద్ద ఏపీ ప్రభుత్వం రబ్బరు డ్యాంను నిర్మించింది. 24,640 ఎకరాలకు తాత్కాలికంగా నీరందిం చేందుకు చర్యలు తీసుకుంది.

- 2007, సెప్టెంబరు 18న ఒడిశా రాష్ట్రం కొరాపుట్‌ జిల్లా కలెక్టర్‌ ద్వారా ఒడిశా ప్రభుత్వం ప్రతిపాదనలన్నీ తిరస్కరించింది. ఇక కొరాపుట్‌ రీజియన్‌లో గిరిజనుల సోషియో ఎకనామిక్‌ సర్వే పేరుతో గ్రామసభలు నిలిపివేయాలని ఆదేశించింది.

- ప్రాజెక్టు పూర్తికి సహకరించాలని 2008, ఆగస్టు 1న ఏపీ ప్రభుత్వం ఒడిశాకు లేఖ రాసినా స్పందన లేకపోయింది.

- 2009 ఆగస్టు 12న కేంద్ర జల వనరులశాఖ, అటవీ పర్యావరణ శాఖకు ఇదే విషయంపై ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది.

- 2021, నవంబరు 9న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, ఒడిశా సీఎం నవీన్‌పట్నాయక్‌ చర్చించారు. అయినా ఫలితం లేకపోయింది.

============================

ప్రభుత్వానికి నివేదించాం

జంఝావతి ప్రాజెక్టు సమస్యపై గత నెల 22న విజయనగరం వచ్చిన నీటి పారుదలశాఖ మంత్రి రామానాయుడుకు నివేదిక అందించాం. ప్రభుత్వ విప్‌, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరికి కూడా తెలియజేశాం. సమస్య పరిష్కారమవుతుందని ఆశిస్తున్నాం.

- బి.సంతోష్‌కుమార్‌, డీఈ, జంఝావతి ప్రాజెక్టు

============================

అసెంబ్లీలోనే ప్రస్తావించా

జంఝావతి ప్రాజెక్టు సమస్యను అసెంబ్లీలోనే ప్రస్తావించా. కచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవతో ఒడిశాతో ఉన్న వివాదం పరిష్కారమవుతుంది.

- తోయక జగదీశ్వరి, ప్రభుత్వ విప్‌, కురుపాం

Updated Date - May 05 , 2025 | 11:42 PM