Will the land dispute come to a head? భూముల వివాదం కొలిక్కి వచ్చేనా?
ABN , Publish Date - Aug 01 , 2025 | 12:17 AM
Will the land dispute come to a head?
భూముల వివాదం
కొలిక్కి వచ్చేనా?
నిర్వాసిత సమస్యలకు పరిష్కారం చూపాలంటున్న ఎమ్మెల్సీ
అర్హులందరికీ న్యాయం చేస్తామంటున్న డీసీఎంఎస్ చైర్మన్
రైతుల కోసమే ఎంఎస్‌ఎంఈ పార్కులను ఆపామంటున్న మాజీ ఎమ్మెల్యే
జిందాల్‌కు అప్పగించిన భూముల చుట్టూ తిరుగుతున్న రాజకీయం
శృంగవరపుకోట, జూలై 31 (ఆంధ్రజ్యోతి):
- పరిశ్రమల నిర్మాణాన్ని వ్యతిరేకించడం లేదు. నిర్వాసిత రైతుల సమస్యలను పరిష్కరించాలని అడుగుతున్నాం. అప్పట్లో పరిశ్రమల స్థాపనకే భూములు ఇచ్చాం. వారంతా నా మాట ప్రకారం భూములు ఇచ్చారు. తీసుకున్న భూములకు కేవలం ఎకరాకు రూ.రెండు లక్షల ఐదువందలు తప్ప మిగిలిన హామీలేవీ నెరవేర్చలేదు. జిందాల్ యాజమాన్యం అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం నిర్వాసిత రైతుల సమస్యలను పరిష్కరించాలి.
- ఇందుకూరి రఘురాజు, ఎమ్మెల్సీ
- అర్హత కలిగిన ప్రతి రైతుకూ న్యాయం జరుగుతుంది. నిర్వాసిత రైతుల సమస్యలకు పరిష్కారం పేరుతో పరిశ్రమలు రాకుండా అడ్డుకోవడం సరికాదు. ఘర్షణ వాతావరణం ఉండే ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టేందుకు ఎవరూ ముందుకు రారు. భూమి కోల్పోయిన ప్రతి ఒక్కరికీ పరిహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అర్హులను గుర్తించే బాధ్యతను కేఆర్‌సీసీ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ మురళీకి అప్పగించారు.
- గొంప కృష్ణ, డీసీఎంఎస్ చైర్మన్
- ఎంఎస్‌ఎంఈ పార్కుల నిర్మాణానికి 2023లో వైసీపీ ప్రభుత్వం జీవో ఇచ్చింది. తాటిపూడి రిజర్వాయర్ నుంచి నీటి సరఫరా చేసేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే నిర్వాసిత రైతులకు న్యాయం చేసిన తరువాతే పరిశ్రమలను ఏర్పాటు చేయాలని జిల్లాకు చెందిన అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణకు చెప్పాను. ఈ విషయం అప్పటి సీఎం దృష్టిలో పెట్టడంతో ఎంఎస్‌ఎంఈ పార్కుల నిర్మాణానికి జరగాల్సిన శంకుస్థాపన అగింది.
- కడుబండి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే
శృంగవరపుకోట మండలంలోని జేఎస్‌డబ్ల్యూ (జిందాల్) అల్యూమినియం కంపెనీ వద్ద ఉన్న భూముల విషయంలో నేతలు ఒక్కొక్కరూ ఒక్కో మాట చెబుతున్నారు. ఈ భూముల చూట్టే ఇప్పుడు రాజకీయం తిరుగుతోంది. ఓ పక్క పరిశ్రమలను ఏర్పాటు చేయాలంటూనే మరో పక్క భూనిర్వాసితుల సమస్యలను పరిష్కారించాలని పెడుతున్న మెలికతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగలేకపోతోంది. విశాఖ మహానగరానికి దగ్గరగా ఉన్న ఎస్.కోటలో జిందాల్ యాజమాన్యం వద్ద ఉన్న భూముల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల నిర్మాణం ద్వారా ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం భావించింది. ఇందుకు అనుగుణంగా అడుగులు వేసే క్రమంలో భూనిర్వాసిత రైతుల సమస్యలు తెరపైకి వచ్చాయి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం తిరిగి భూములను అప్పగించాలని, యాజమాన్యం భూములు తీసుకున్న సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని నిర్వాసిత రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఇన్నాళ్లు మిన్నకున్న భూనిర్వాసితులు ప్రభుత్వం పరిశ్రమల నిర్మాణానికి ముందుకొస్తున్న సమయంలో ఆందోళన చేయడాన్ని నిరుద్యోగ యువత వ్యతిరేకిస్తోంది. నేతలు చూస్తే తలో మాట ఆడుతున్నారు. సమస్య ఎప్పటికి కొలిక్కి వస్తుందో తెలియడం లేదు.
ఉమ్మడి ఆంఽధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (కాంగ్రెస్) ఉన్నప్పుడు 2008లో జిందాల్‌కు ప్రభుత్వం భూములు అప్పగించింది. ఈ భూములన్నీ అసైన్డ్, ప్రభుత్వ భూములు. సాగులో వున్నవారిలో అత్యధిక శాతం గిరిజనులు. వ్యవసాయం జీవనాధారంగా బతుకుతున్న వీరంతా అప్పట్లో ఈ భూములు ఇచ్చేందుకు ససేమేరా అన్నారు. అసైన్డ్ భూముల చట్టం చూపించి బలవంతంగా లాక్కొన్నారు. జిందాల్ యాజమాన్యం నాలుగేళ్లలో పరిశ్రమను నిర్మించి నిర్వాసిత రైతు కుటుంబాలకు ఉద్యోగం, ఉపాధి, మౌలిక సదుపాయాలు వంటి ఎన్నో హామీలు ఇచ్చింది. ఇదంతా జరిగి 18 ఏళ్లు అయింది.
బాక్సైట్ తవ్వకాలు నిలిచిపోవడంతో కీలక మలుపు
జిందాల్ యాజమాన్యంనకు భూములు అప్పగించిన తరువాత ఆరేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కానీ పరిశ్రమ ఏర్పాటు చేయలేదు. విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఈ పరిశ్రమకు అవసరమైన బాక్సైట్ తవ్వకాలను నిషేధించింది. అరకు ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. జిందాల్ ఏర్పాటు చేసే అల్యూమినియం పరిశ్రమకు ముడిసరుకు బాక్సైటే. బాక్సైట్ తవ్వకాలను గిరిజనులు వ్యతిరేకిస్తున్న విషయం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు. అయినా 834.66 ఎకరాల అసైన్డ్, 151.04 ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పగించేసింది. వీటితో పాటు 180.73 ఎకరాల జిరాయితీ భూమిని జిందాల్ యాజమాన్యం రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఇలా ఇక్కడ 1166.64 ఎకరాల భూమి జిందాల్ చేతుల్లోకి వెళ్లింది. టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన బాక్సైట్ తవ్వకాల నిషేధాన్ని సాకుగా చూపించిన జిందాల్ యాజమాన్యం ఈ భూముల్లో పరిశ్రమను స్థాపించలేదు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ భూముల్లో ఎంఎస్‌ఎంఈ పార్కుల నిర్మాణం చేపట్టేందుకు 2023 అక్టోబర్‌లో జీవో జారీ చేసింది. తాటిపూడి రిజర్వాయర్ నుంచి ఈ పరిశ్రమకు నీటి సరఫరా చేసేందుకు అంగీకరించింది. ఇదే విషయాన్ని ఈ పార్టీ నేతలు అంగీకరిస్తున్నారు. ఉత్తర్వులు జారీ చేసిన వైసీపీ ఈ భూముల్లో కంపెనీలు నిర్మించేందుకు అవసరమైన చర్యలు తీసుకోకుండా వదిలేసింది. సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం యువత ఓట్లు పొందేందుకు ప్రధాన అస్త్రంగా వాడుకుంది.
కూటమి వచ్చాక..
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారం చేపట్టాక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఉన్న అవకాశాలను అన్వేషించింది. జిందాల్ భూముల్లో పరిశ్రమలను నిర్మించడం ద్వారా ప్రత్యక్షంగా కనీసం 50 వేల మందికి ఉద్యోగాలు కల్పించాలనుకుంటోంది. కానీ నిర్వాసిత రైతుల భూసమస్య అడ్డంకిగా మారింది. ఈ చిక్కుముడి విప్పేందుకు కలెక్టర్ అంబేడ్కర్ ప్రయత్నిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో భూ నిర్వాసితుల నుంచి వినిపిస్తున్న సమస్యలు అధికారుల వద్దకు వెళ్లేటప్పటికి న్యాయ పరంగా నిలబడడం లేదు. ఇక్కడ వీరు చెబుతున్న లెక్కకు అధికారుల వద్దకు చేరిన సమస్యల లెక్కకు సరిపోలడం లేదు. అంతే కాకుండా పీవోటీల విషయంలోనూ అధికారులు ఏ చర్యలు తీసుకోవాలో అర్థం కావడం లేదు. 18 మంది అసైన్డ్‌దారులకు చెందిన 74.15 ఎకరాలకు నష్టపరిహారం ఇచ్చేందుకు చట్టపరమైన అడ్డంకులు ఉన్నాయని అధికారులంటున్నారు. భూములు తీసుకున్న సమయంలో ఇలాంటి ఎన్నో ఎకరాల భూములకు అప్పటి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించిందని నిర్వాసితుల తరపున పోరాటం చేస్తున్నవారి నుంచి వినిపిస్తోంది. ఇలా ఒకదానితో ఒకటి ముడిపడి వున్న ఈ సమస్యను తేల్చేదెవరో!