Share News

Jaljeevan Mission work: జలజీవన్‌మిషన్‌ పనులు పూర్తయ్యేనా?

ABN , Publish Date - May 24 , 2025 | 12:22 AM

Jaljeevan Mission work: ప్రతి ఇంటికీ తాగునీటిని అందించాలనే లక్ష్యంతో చేపడుతున్న జలజీవన్‌మిషన్‌ పనులు భామిని మండలంలో నత్తనడకన సాగుతున్నాయి.

Jaljeevan Mission work: జలజీవన్‌మిషన్‌ పనులు పూర్తయ్యేనా?
సింగిడి వద్ద వంశధార నదీ గర్భంలో యంత్రాలతో చేపడుతున్న పనులు

- ముంచుకొస్తున్న గడువు

- ఇప్పటికీ పూర్తికాని ట్యాంకుల నిర్మాణం

- వంశధారలో ఊటబావుల తవ్వకానికి ఆటంకాలు

భామిని, మే 23 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఇంటికీ తాగునీటిని అందించాలనే లక్ష్యంతో చేపడుతున్న జలజీవన్‌మిషన్‌ పనులు భామిని మండలంలో నత్తనడకన సాగుతున్నాయి. ఈ పనుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు సమకూరుస్తున్నాయి. చేసిన పనులకు సకాలంలో బిల్లులు కూడా అందిస్తున్నాయి. అయినా, పనులు మాత్రం వేగవంతంగా జరగడం లేదు. మండలంలో అన్ని గ్రామాలకు జల్‌జీవన్‌ పథకం ద్వారా తాగునీటిని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది రూ.60 కోట్లు మంజూరు చేసింది. ఈ ఏడాది జూన్‌ 15లోగా పనులు పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గత ఫిబ్రవరిలో పనులు ప్రారంభించారు.


మండల వ్యాప్తంగా 72 కిలోమీటర్ల మేర పైపులైన్లు వేయాల్సి ఉంది. 54 గ్రామాలకు సంబంధించి 45 వాటర్‌ ట్యాంక్‌లను నిర్మించి, వాటి ద్వారా నీటిని సరఫరా చేయాల్సి ఉంది. సింగిడి గ్రామ సమీపంలో వంశధార నది వద్ద పసుకుడి కొండపైన 90 టన్నుల లీటర్ల సామర్థ్యం గల రిజర్వాయర్‌ ట్యాంక్‌ ఏర్పాటు చేసి బత్తిలి నుంచి కొరమ వరకు పైపులైన్‌ ద్వారా తాగునీటిని అందించాల్సి ఉంది. అయితే, కాంట్రాక్టర్‌ అలసత్వంతో ఈ పనులు గడువులోగా పూర్తికాని పరిస్థితి నెలకొంది. గత ఏడాది వర్షాకాలంలో పైపులైన్ల పనులు ముందుగా ప్రారంభించి కొంతమేర చేపట్టారు.

20-bhm-2.gif పసుకుడి కొండపైన నత్తనడకన ట్యాంక్‌ పనులు


వంశధార నదీ గర్భంలో రెండు బావులు, నదీ తీరాన 9 మీటర్ల వెడల్పు, 15 మీటర్లు లోతున ఓ బావి పనులు ప్రారంభించారు. ఈ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. నదీ గర్భంలో ఆరుమీటర్ల వెడల్పు, 9 మీటర్ల లోతుగా రెండు బావుల ఏర్పాటుకు పనులు చేపడుతున్నారు. ఈ పనుల్లో లోతుకు వెళ్లేసరికి నదీ గర్భంలో నీటి ప్రవాహం కొనసాగుతుంది. దీనిని అడ్డుకోవడం కష్టతరంగా మారింది.

20-bhm-3.gifసింగిడి వద్ద బావి పనులు ఇలా..


దీనివల్ల ఒక బావి నుంచి మరో బావి లోపల వైపు నుంచి పైపులైన్‌ అనుసంధానం చేసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ వర్షాకాలానికి ముందే బావి పనులు పూర్తికాకపోతే ఈ ఏడాది పథకం లక్ష్యం చేరుకోవడం గగనమే అవుతుంది. ఇప్పటికే నదిలో బావుల తవ్వకాలు పూర్తి చేసి ఉంటే బాగుండేది. ఒడిశాలో వర్షాలు కురిస్తే నదిలో నీటి ప్రవాహం పెరుగుతుంది. తద్వారా ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోనున్నాయి. పసుకుడి కొండ మీద ఏర్పాటు చేస్తున్న వాటర్‌ ట్యాంక్‌ పనులు సైతం నత్తనడకన సాగుతున్నాయి. 45 వాటర్‌ ట్యాంక్‌లు నిర్మించాల్సి ఉండగా ఆ పనుల్లో కూడా పురోగతి లేదు. భామిని, ఇసుకగూడ గ్రామాల్లో కేవలం పైపులైన్లు మాత్రమే వేశారు. ఇప్పటికైనా పనులను పూర్తిచేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

20-bhm-4.gifభామినిలో బేస్‌మెంట్‌ స్థాయిలో నిలిచిన ట్యాంక్‌ పనులు


పనుల పూర్తికి చర్యలు

వంశధారలో వరదలు రాకముందే నదీ గర్భంలో బావులు, పైపులైన్ల పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మండలంలోని 45 వాటర్‌ ట్యాంకులు నిర్మించాల్సి ఉండగా, 28 ట్యాంకుల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ పనులు పూర్తయ్యాక సింగిడి వద్ద 95 హెచ్‌పీతో కూడిన రెండు మోటార్లను ఏర్పాటు చేసి పసుకుడి కొండపై ఉన్న ట్యాంక్‌కు నీటిని పంపించేందుకు చర్యలు తీసుకుంటాం.

-ఎ.సందీప్‌కుమార్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, ఏఈ

Updated Date - May 24 , 2025 | 12:22 AM