Will the Hopes Bear Fruit? ఆశలు ఫలించేనా?
ABN , Publish Date - Sep 28 , 2025 | 11:28 PM
Will the Hopes Bear Fruit? జంఝావతి ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తవుతాయా? ఒడిశాతో వివాదం కొలిక్కి వస్తుందా? ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరందుతుందా! గిరిజన ఇంజనీరింగ్ కళాశాల పనులు కూడా పూర్తవుతాయా? అంటే.. తాజా పరిణామాల నేపథ్యంలో కురుపాం నియోజకవర్గంలో ఇప్పుడవే చర్చనీయాంశాలుగా మారాయి. పై సమస్యలను ఇటీవల ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జంఝావతి ప్రాజెక్టు స్థితిగతులను తెలియజేశారు. దీంతో ఇటు రైతులు.. గిరిజన విద్యార్థుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
గిరిజన ఇంజనీరింగ్ కళాశాల పరిస్థితిని వివరించిన విప్ జగదీశ్వరి
ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం.. ఏపీలో కూటమి పాలన
ప్రాజెక్టు పనుల పూర్తికి ఇదే సరైన సమయం
ముఖ్యమంత్రి చొరవ చూపుతారని రైతుల నమ్మకం
జియ్యమ్మవలస, సెప్టెంబరు28(ఆంధ్రజ్యోతి): జంఝావతి ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తవుతాయా? ఒడిశాతో వివాదం కొలిక్కి వస్తుందా? ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరందుతుందా! గిరిజన ఇంజనీరింగ్ కళాశాల పనులు కూడా పూర్తవుతాయా? అంటే.. తాజా పరిణామాల నేపథ్యంలో కురుపాం నియోజకవర్గంలో ఇప్పుడవే చర్చనీయాంశాలుగా మారాయి. పై సమస్యలను ఇటీవల ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జంఝావతి ప్రాజెక్టు స్థితిగతులను తెలియజేశారు. దీంతో ఇటు రైతులు.. గిరిజన విద్యార్థుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఒడిశాలో బీజేపీ అధికారంలో ఉండగా, ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన కొనసాగుతున్న నేపథ్యంలో.. పై సమస్యల పరిష్కారానికి ఇదే సరైన సమయమని ఈ ప్రాంతవాసులు అభిప్రాయ పడుతున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వ జల వనరులశాఖ సమక్షంలో సమావేశమైతే కచ్చిత పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
జంఝావతి ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తయితే జిల్లాలో కొమరాడ, పార్వతీపురం, గరుగుబిల్లి, సీతానగరం, మక్కువ మండలాల పరిధిలో 75 గ్రామాల్లో 24,640 ఎకరాలకు పుష్కలంగా సాగునీరందనుంది. కానీ ఒడిశా రాష్ట్రంతో నెలకొన్న వివాదం కారణంగా ఏటా కేవలం 9 వేల ఎకరాలకే సాగునీరందుతోంది. 15,640 ఎకరాలకు సాగునీరందకపోవడంతో రైతులు వరుణుడిపై ఆధారపడి సాగు చేసుకుంటున్నారు. జంఝావతి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిర్మాణానికి ఆంధ్రా - ఒడిశా రాష్ట్రాల మధ్య ఆరు సార్లు చర్చలు జరిగాయి. ఆరు సార్లు లేఖలు రాసినా సమస్య పరిష్కారం కాలేదు.
చర్చలు.. లేఖలు
- 1975 సెప్టెంబరు 24, 1978 డిసెంబరు 12న అప్పటి ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య మొదటగా జంఝావతి నీటి పంపకాలపై చర్యలు జరిగాయి. నాలుగు టీఎంసీల చొప్పున వాడుకొనేందుకు అంగీకారం కుదిరింది.
- 1980, జూలై 27న భువనేశ్వర్‌లో ఇరు రాష్ట్రాల కార్యదర్శులు పెండింగ్ జాయింట్ సర్వేపై చర్చించారు. అయితే ఏపీ ప్రభుత్వం సర్వేకు ముందుకెళ్లింది.
- 2021, నవంబరు 9న అప్పటి సీఎంలు జగన్, నవీన్ పట్నాయక్‌ల మధ్య చర్చలు జరిగినా ఎటువంటి ఫలితం లేకపోయింది.
- 2002, జనవరి 29న సెంట్రల్ వాటర్ కమిషన్ సమక్షంలో ఇరు రాష్ట్రాల కార్యదర్శుల చర్చలు జరిగాయి. అదే ఏడాది డిసెంబరు 23న మరోసారి ముంపు గ్రామాలు, వారు కోల్పోతున్న భూములు, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీపైనా కార్యదర్శుల మధ్య చర్చలు జరిగాయి.
- 2005-06లో జంఝావతిపై రబ్బరుడ్యాం నిర్మాణం తర్వాత 2007 సెప్టెంబరు 18న గ్రామసభలు నిర్వహించరాదని ఒడిశా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ తరువాత 2009 సెప్టెంబరు 8న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను అంగీకరిస్తూ ఒడిశా లేఖ రాసింది.
- దీంతో ముందడుగు వేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2010, ఆగస్టు 18న ఒక లేఖ (నెంబరు 4974/పీడబ్ల్యూ:15/2010-4), 2011 అక్టోబరు 5న మరో లేఖ (23452/పీడబ్ల్యూఏఎస్/06) ఒడిశా జల వనరులశాఖ కార్యదర్శికి రాసింది. కానీ అటు నుంచి ఏ సమాధానం రాలేదు. 2017 జూన్ 17న మరోసారి ఒడిశా జన వనరులశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి మరోసారి లేఖ రాసింది. 2018 సెప్టెంబరు 13న మరో లేఖ రాసి దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకుందామని ఆహ్వానించినా ప్రయోజనం లేకపోయింది. ఆ తరువాత 2020 ఆగస్టు 25న మరో లేఖ రాస్తూ ఆహ్వానించినా సమాధానం రాలేదు.
ప్రాజెక్టు పూర్తికి రూ. 280 కోట్లు అవసరం
- కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం సమీపంలో ఉన్న జంఝావతి ప్రాజెక్టు పూర్తిస్థాయి నిర్మాణం, సమస్యల పరిష్కారానికి సుమారు రూ. 280 కోట్లు అవసరమని ఇప్పటికే ప్రతి పాదనలు సిద్ధం చేశారు. ప్రాజెక్టు ముంపు ప్రాంతంలో ఉన్న కంబవలస (184.31 ఎకరాలు), పిల్లిగుడ్డి (212.16 ఎకరాలు), బంజుకుప్ప (551.92 ఎకరాలు), లక్ష్మీపేట (121.61 ఎకరాలు) వాసులకు 1987లోనే ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
- ఇక ఒడిశా రాష్ట్రం వైపు ఉన్న 10 గ్రామాల్లో 1175 ఎకరాలు ముంపు ప్రాంతంలో ఉన్నాయి. నాగులవలస, జయకోట, తాడివలస , దిగుభద్రపల్లి , హటిగెడ , ఉపరభద్రపల్లి , సాంబన్నకిడి , బడబంకిడి , అంబవలస , చెక్కవలస గ్రామాల్లో 189 కుటుంబాలు ఉన్నాయి. వీరికి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ నిమిత్తం రూ. 1,627.29 లక్షలు ఇవ్వాల్సి ఉంది. ఈ పది గ్రామాల్లో గ్రామసభలు కూడా జరిగాయి. కానీ ఒడిశా రాష్ట్రం నుంచి ఎటువంటి స్పందన రాలేదు.
- భూసేకరణ విషయానికొస్తే వారి పునరావాసానికి 2245.10 ఎకరాలు అవసరం. ఇంతవరకు 1070 ఎకరాలు సేకరించారు. ఇంకా 1175.10 ఎకరాలు సేకరించాలి. అంటే కొనుగోలు చేయాల్సి ఉంది. ఒక్కో ఎకరా విలువ రూ. 15 లక్షలు కాగా ఈ 1175.10 ఎకరాల కోసం రూ. 17,626.50 లక్షలు కావాల్సి ఉంది. అంటే ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, భూసేకరణకు కలిపి రూ. 19,253.29 లక్షలు అవసరం.
- డ్యామ్ నిర్మాణం, ప్రాజెక్టు ముంపు ప్రాంతం చదును చేయడానికి మరో రూ. 90 కోట్లు వరకు అవసరం. దీనిపై ఇప్పటికే అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే ప్రస్తుత రేట్లు ప్రకారం భూవిలువ మరింత పెరగొచ్చని వారు చెబుతున్నారు. ఏదేమైనా ఒడిశా ప్రభుత్వం ఈ పది గ్రామాల విషయంలో ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, భూసేకరణ విషయంలో కచ్చితమైన రేట్లుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంది. దీని ప్రకారం అయితే మరింత ఎక్కువగా కోట్లలో వెచ్చించాల్సి ఉంది.
కాలువల నుంచి సాగునీరందక..
గరుగుబిల్లి: గత కొన్నాళ్లుగా జంఝావతి కాలువలను అభివృద్ధి చేయడం లేదు. దీంతో పిచ్చి మొక్కలతో అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. మరోవైపు గండ్లు పడుతున్నాయి. ప్రస్తుతం పైప్రాంతాల నుంచి కాలువలోకి 175 క్యూసెక్కులు వస్తుండగా.. గరుగుబిల్లి మండలంలోని శివారు ప్రాంత రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. 15 కిలో మీటరు నుంచి 21ఎల్ వరకు సాగునీటి సరఫరాకు ఆటంకం నెలకొంది. ప్రస్తుతం అడపాదడపా వర్షాలు కురుస్తున్నా వరి పంటలకు నీటి తడులు చాలని పరిస్థితి ఏర్పడింది. పంట పొలాలకు ఆనుకొని ఉన్న చెరువులు కూడా నిండలేదు. రైతులు చందాలేసుకుని కాలువలకు మరమ్మతులు చేయించుకుని.. సాగునీటిని మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉల్లిభద్ర ప్రాంతంలో ఎత్తిపోతల పథకానికి దృష్టి సారిస్తే సాగునీటి సమస్య తీరనుందని ఆయకట్టుదారులు చెబుతున్నారు. దీనిపై జంఝావతి ప్రాజెక్టు జేఈ పత్తిక పవన్‌కుమార్‌ను వివరణ కోరగా.. ‘జంఝావతి ప్రాజెక్టు పరిధిలోని కాలువకు ఆనుకుని ఉల్లిభద్ర, సీతారాంపురం ప్రాంతాల్లో ఎత్తిపోతల పథకానికి సుమారు రూ. 6 కోట్లతో , కాలువల అభివృద్ధికి రూ. 47 లక్షలతో ప్రతిపాదనలు పంపించాం. పూర్తిస్థాయిలో సాగునీటి సరఫరాకు చర్యలు చేపడుతున్నాం.’ అని తెలిపారు.
ఇంజనీరింగ్ కాలేజీ పరిస్థితి ఇదీ..
కురుపాం సమీపంలో జేఎన్‌టీయూ గిరిజన ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణం కోసం గత వైసీపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే నిధుల లేమితో 58 శాతం పనులతో ఆగిపోయింది. ఈ విషయాన్ని ఇటీవల ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లారు. నిర్మాణం పూర్తికి నిధులు మంజూరు చేసి , అడ్మిషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా ఈ కళాశాల నిర్మాణం పూర్తయితే 1800 మంది విద్యార్థులకు చదువుకునే అవకాశం, 800 మందికి హాస్టల్ సౌకర్యం కలగనుంది.