Share News

లక్ష్యం చేరుకునేనా?

ABN , Publish Date - Apr 15 , 2025 | 10:57 PM

గ్రేడ్‌ -1 మునిసిపాలిటీ అయిన పార్వతీపురంలో ఆస్తి పన్ను వసూలుకు సంబంధిత అధికారులు, సిబ్బంది అష్టకష్టాలు పడుతున్నారు.

 లక్ష్యం చేరుకునేనా?
పార్వతీపురం మునిసిపల్‌ కార్యాలయం

- పార్వతీపురం మునిసిపాలిటీలో పన్నుల వసూళ్లు అంతంత మాత్రమే

- 50శాతంపై చెల్లింపునకు మరో 15 రోజులే గడువు

- 93 శాతానికి చేరుకుంటేనే 15వ ఆర్థిక సంఘం నిధులు

- తీవ్రంగా శ్రమిస్తున్న అధికారులు

పార్వతీపురంటౌన్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): గ్రేడ్‌ -1 మునిసిపాలిటీ అయిన పార్వతీపురంలో ఆస్తి పన్ను వసూలుకు సంబంధిత అధికారులు, సిబ్బంది అష్టకష్టాలు పడుతున్నారు. పన్ను వసూళ్లు 93 శాతానికి చేరుకోకపోతే 15వ ఆర్థిక సంఘం నిధులు ప్రపంచ బ్యాంకు విడుదల చేయదని రాష్ట్ర పురపాలక శాఖ సంచాలకులు హెచ్చరికలు జారీ చేయడంతో పార్వతీపురం మునిసిపల్‌ రెవెన్యూ అధికారులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. దీంతో పన్నుల వసూళ్లకు తీవ్రంగా శ్రమిస్తోన్నారు. 2024-25కిగాను గతనెల 31 నాటికి ఇంటి పన్ను వసూళ్ల గడువు ముగిసింది. పన్ను తక్కువగా వసూలు కావడంతో ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. 50 శాతం వడ్డీ రాయితీతో ఈ నెల 30 వరకు పన్నులు చెల్లించుకోవచ్చని చెప్పింది. ఈ అవకాశాన్ని ఎంతమంది వినియోగించుకుంటారో? లేదో త్వరలో తెలియనుంది.

ఇదీ పరిస్థితి..

గ్రేడ్‌-1 మునిసిపాల్టీ పార్వతీపురంలో 13,550 నివాస, ఇతర వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి 122 భవనాలు ఉన్నాయి. వీటి నుంచి పన్నులు వసూలు చేసి లక్ష్యాన్ని చేరుకునేందుకు మునిసిపల్‌ రెవెన్యూ అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. రెవెన్యూ అధికారి రూబేను పర్యవేక్షణలో ఆర్‌ఐలు ఈశ్వరరావు, వినయ్‌, మునిసిపల్‌ సిబ్బందితో పాటు సచివాలయాల అధికారులు పన్నులు వసూలు చేసేందుకు నిత్యం కష్టపడుతున్నప్పటికీ ఫలితం అంతతమాత్రంగానే కనిపిస్తోంది. 2024-25కి గాను ప్రైవేట్‌, ప్రభుత్వ ఆస్తుల నుంచి రూ.991.81 కోట్లు పన్ను వసూలు చేయాల్సి ఉండగా, గత నెల 31 నాటికి కేవలం రూ.4.87 కోట్లు మాత్రమే వసూలు చేశారు. ఇంకా రూ.504.79 కోట్లు రావాల్సి ఉంది. నివాసాలు, ప్రైవేట్‌ భవనాలకు సంబంధించి రూ.5.49 కోట్లుకు గాను రూ.4.43 కోట్లు వసూలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ భవనాలకు సంబంధించి సుమారు రూ.4.50 కోట్లు వరకు రావాల్సి ఉంది. జిల్లా ఏరియా ఆసుపత్రే రూ.3.15 కోట్లు పన్ను బకాయి పడింది. వడ్డీతో కలిపి రూ.5కోట్లు రావాల్సి ఉంది. దీంతో పాటు రూ.36లక్షల ఇంటి పన్నుకు సంబంధించిన కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల భవనాల నుంచి పన్నులు వసూళ్లు అయ్యే దాఖలాలు కనిపించడం లేదు. నీటి చార్జీలు రూ.3.25 కోట్లుకు రూ.66 లక్షలు మాత్రమే వసూలు జరిగింది. ఇంకా రూ.2.61 కోట్లు రావాల్సి ఉంది. 93 శాతం పన్నుల లక్ష్యాలను చేరుకోకపోతే 15వ ఆర్థిక సంఘ నిధులను ప్రపంచ బ్యాంకు విడుదల చేయదని, రాష్ట్ర పురపాలనశాఖ కార్యాలయ సంచాకులు ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో పన్నులను వసూలు చేసేందుకు పార్వతీపురం మునిసిపల్‌ అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. 50 శాతం వడ్డీపై పన్నుల చెల్లించేందుకు ఇంకా 15 రోజులే గడువు ఉండడంతో లక్ష్యం నెరవేరుతుందో? లేదో చూడాలి.

కృషి చేస్తున్నాం

పన్ను వసూలు లక్ష్యాన్ని చేరుకునేందుకు శ్రమిస్తున్నాం. 2025- 26కి గాను రూ.10.74 కోట్లు ప్రైవేట్‌, ప్రభుత్వ భవనాల నుంచి పన్ను వసూలు చేసేందుకు ఇప్పటి నుంచే ప్రత్యేక కార్యాచరణను రూపొందించాం. 15వ ఆర్థిక సంఘ నిధులు పార్వతీపురం మునిసిపాల్టీకి మంజూరయ్యేలా కృషి చేస్తున్నాం.

-డి.రూబేను, మునిసిపల్‌ రెవిన్యూ అధికారి, పార్వతీపురం మునిసిపాల్టీ

Updated Date - Apr 15 , 2025 | 10:57 PM