Share News

Will the control కట్టడి చేస్తారా?

ABN , Publish Date - Nov 17 , 2025 | 11:48 PM

Will the control జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో కుక్కల స్వైరవిహారం ఆగడం లేదు. వీధి కుక్కలు బెంబేలెత్తిస్తున్నాయి. గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

Will the control కట్టడి చేస్తారా?
రాజాం పట్టణంలో కుక్కల స్వైరవిహారం

కట్టడి చేస్తారా?

జిల్లాలో కుక్కల స్వైరవిహారం

ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం

నెలలు గడుస్తున్నా కానరాని చర్యలు

తాజాగా మునిసిపల్‌ శాఖ కీలక ఆదేశాలు

- పట్టణాల్లో కుక్కల నియంత్రణపై ప్రత్యేకంగా దృష్టిపెట్టండి. స్టెరిలైజేషన్‌, యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌ను ఇవ్వండి. రేబిస్‌ సోకిన కుక్కలను గుర్తించి వెంటనే ప్రత్యేక షెల్టర్లకు తరలించండి. ముఖ్యంగా పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, క్రీడా మైదానాల వద్ద కుక్కలు సంచరించకుండా చర్యలు తీసుకోవాలి. వాటికి బహిరంగ ప్రదేశాల్లో ఆహారం పెట్టకుండా ప్రత్యేక శిబిరాల వద్దకు తీసుకెళ్లి ఆహారం అందించాలి.

- ఈ నెల 16న రాష్ట్ర పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌కుమార్‌ ఇచ్చిన ఆదేశాలివి.

- రాజాం ప్రాంతీయ ఆస్పత్రికి రోజుకు 15 నుంచి 20 మంది కుక్కకాటు బాధితులు వస్తున్నారు. నియోజకవర్గంలోని 4 మండలాల్లో పీహెచ్‌సీలకు ప్రతినెలా 30 మంది వరకూ కుక్కకాటు బాధితులు నమోదవుతున్నారు. గడిచిన ఆరు నెలల వ్యవధిలో రాజాం నియోజకవర్గంలో 4,711 కుక్కకాటు బాధితులను ఆస్పత్రులను ఆశ్రయించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

రాజాం/ బొబ్బిలి, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో కుక్కల స్వైరవిహారం ఆగడం లేదు. వీధి కుక్కలు బెంబేలెత్తిస్తున్నాయి. గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. రోజుకు సగటును 30 మంది వరకూ కుక్కకాటుకు గురవుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అయితే వీటి నియంత్రణకు కఠిన చర్యలు చేపడుతున్న దాఖలాలు లేవు. ప్రధాన రహదారుల్లో, కూడళ్లలో కుక్కలు కనిపించకుండా సంరక్షణా కేంద్రాలకు తరలించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. రేబిస్‌ మరణాల పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని నిర్దేశించింది. ఇది జరిగి నెలలు దాటుతున్నా అటువంటి చర్యలేవీ విజయనగరం కార్పొరేషన్‌తో పాటు మునిసిపాల్టీల్లో కనిపించడంలేదు. తాజాగా మునిసిపల్‌ శాఖ కార్యదర్శి ఆదేశాలతోనైనా కదులుతారా? లేరా? అన్నది చూడాలి.

ఏటా తప్పని మరణాలు..

గత ఏడాది జిల్లాలో 12,767 మందిని కుక్కలు కాటేశాయి. నలుగురు మృతిచెందారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ 8 వేల మంది కుక్కకాటు బారిన పడ్డారు. ఆరుగురు మృతిచెందారు. విజయనగరం కార్పొరేషన్‌ పరిధిలో 13 వేల కుక్కలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. గత ఏడాది కాలంలో 6,500 కుక్కలకు యాంటీ రేబిస్‌ ఇంజక్షన్లు, ఆపరేషన్లు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం అటువంటి పరిస్థితి కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు. అప్పట్లో రోజుకు 25 కుక్కలకు సంతానోత్పత్తి నియంత్రణ చికిత్సలు చేయాలని నిర్ణయించారు. ఇందుకుగాను ఓ సంస్థకు బాధ్యతలు అప్పగించారు. ఒక్కో కుక్కకు రూ.1500 చెల్లించేందుకు నిర్ణయించారు కానీ అనుకున్న స్థాయిలో ఇది ముందుకు సాగలేదు.

రాజాం మునిసిపాల్టీలో..

రాజాం మునిసిపాల్టీలో కుక్కల తాకిడి అధికం. సమీప గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కుక్కలు వచ్చి చేరుతున్నాయి. మునిసిపాల్టీ పరిధిలో 5 వేల కుక్కలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. కానీ ఎటువంటి నియంత్రణ చర్యలు చేపట్టడంలేదు. ప్రస్తుతం మునిసిపాల్టీకి పాలకవర్గం లేదు. ఆపై యంత్రాంగం సైతం సరిగ్గా స్పందించడం లేదు. ముఖ్యంగా పట్టణంలోని శివారు ప్రాంతాల్లో వాటి విహారం రోజురోజుకూ అధికమవుతోంది.

ఆ రెండుచోట్ల సైతం..

బొబ్బిలి మునిసిపాల్టీలో సైతం కుక్కల నియంత్రణ చర్యలు కానరావడం లేదు. పట్టణంలో 3 వేల వరకూ కుక్కలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. గతంలో కుక్కల నియంత్రణకుగాను చర్యలు ఉండేవి. విజయనగరంతో పాటు బొబ్బిలిలో కుక్కల సంతానోత్పత్తి నియంత్రణకుగాను ఆపరేషన్లు నిర్వహించేందుకు ప్రత్యేక భవనాలు నిర్మించారు. ప్రత్యేక గదులను ఏర్పాటుచేశారు. ఆపరేషన్లు చేసేందుకుగాను పరికరాలు, యంత్రాలను సైతం అందుబాటులోకి తెచ్చారు. పశుసంవర్థక వైద్యులతో పాటు సిబ్బందిని నియమించారు. ఎందుకో ఆ తరువాత వీటి గురించి పట్టించుకునే వారు కరువయ్యారు. దీంతో ఈ భవనాలు వృథాగా ఉన్నాయి. నెల్లిమర్ల నగర పంచాయతీలో సైతం ఇదే పరిస్థితి ఉంది. తాజాగా మునిసిపల్‌ శాఖ సీరియస్‌గా దృష్టిపెట్టడంతో ఇకనైనా కుక్కలకు అడ్డుకట్ట పడుతుందా? లేదా? అన్నది చూడాలి.

ఏర్పాట్లు చేస్తున్నాం

కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఉత్తర్వులు వచ్చిన మాట వాస్తవమే. కుక్కలను తరలించి యాంటీ రేబిస్‌ ఇంజక్షన్లు, సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తాం. అలాగే వీధి కుక్కల సంరక్షణకు సంబంధించి ప్రత్యేక కేంద్రాలను సైతం ఏర్పాటుచేస్తాం.

- కె.రామచంద్రరావు, కమిషనర్‌, రాజాం మునిసిపాల్టీ

Updated Date - Nov 17 , 2025 | 11:48 PM