Share News

Bridge వంతెనల వెతలు తీరేనా?

ABN , Publish Date - Aug 31 , 2025 | 10:54 PM

Will the Bridge Woes End? జిల్లాలో దశాబ్దాల కిందట నిర్మించిన వంతెనలు పూర్తి శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. అవి ఏ క్షణాన కూలుతాయో తెలియని పరిస్థితి. కొన్ని ప్రమాదకరంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

  Bridge    వంతెనల వెతలు తీరేనా?
మక్కువ మండలం దుగ్గేరుకు వెళ్లే ప్రాంతంలో ఓ వంతెన ఇలా..

  • మరమ్మతులు చేపట్టాల్సినవి 113

  • ప్రభుత్వానికి ప్రతిపాదనలు

  • నిధులు మంజూరైతేనే మోక్షం

  • అప్పటివరకు మన్యం వాసులకు తప్పని కష్టాలు

పార్వతీపురం, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): జిల్లాలో దశాబ్దాల కిందట నిర్మించిన వంతెనలు పూర్తి శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. అవి ఏ క్షణాన కూలుతాయో తెలియని పరిస్థితి. కొన్ని ప్రమాదకరంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అవి ఏ మాత్రం కూలినా.. రాకపోకలు పూర్తిగా స్తంభించనున్నాయి. కొన్నిచోట్ల ప్రత్యామ్నాయ మార్గం కూడా లేదు. ఈ నేపథ్యంలో వాటిపై దృష్టి సారించి.. త్వరితగతిన పనులు చేపట్టాల్సి ఉందని జిల్లావాసులు కోరుతున్నారు. కాగా ఇప్పటికే ఆర్‌అండ్‌బీశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. నిధులు మంజూరైతే వంతెనలకు మోక్షం కలగనుంది. జిల్లాలో మొత్తంగా 869 వంతెనలు ఉన్నాయి. ఇందులో 17 ప్రమాదకర స్థితిలో ఉండగా.. మరో 133 వంతెనలకు మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. 27 వంతెనలను పునర్నిర్మాంచాల్సి ఉంది. రీ కనస్ట్రక్షన్‌తో పాటు శిథిలావస్థలో ఉన్న 17 వంతెనల నిర్మాణానికి రూ.92.75 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. 133 వంతెనల మరమ్మతులకు కూడా సంబంధిత అధికారులు రూ. 10.6 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. ఈ నిధులు మంజూరు అయితేనే పనులు జరిగే అవకాశం ఉంది.

కొన్ని వంతెనలు ఇలా..

- పాలకొండ నియోజకవర్గంలో సంకిలి వద్ద వంతెన శిథిలావస్థలో ఉంది. దీనికి సంబంధించి బేరింగ్స్‌ మార్పు చేయాల్సి ఉంది. దీనిమరమ్మతులకు రూ.కోటితో ప్రతిపాదనలు వెళ్లాయి.

- నర్సిపురం నుంచి పార్వతీపురం మధ్య రెండు శ్లాబ్‌ కల్వర్టులు నిర్మించాల్సి ఉంది.

- సాలూరు నుంచి మక్కువ మీదుగా దుగ్గేరు వెళ్లే ప్రాంతంలో వంతెనలను రీ కనస్ట్రక్షన్‌ చేయాల్సి ఉంది.

- కొమరాడ మండలంలో కోటిపాం వంతెన పరిస్థితి దారుణంగా ఉంది. దీని వల్ల ప్రమాదం పొంచి ఉండడంతో వాహనదారులు, ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగించాల్సి వస్తోంది.

ప్రతిపాదనలు పంపించాం

జిల్లాలో 17 వంతెనలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. 133 వంతెనలకు మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. మరికొన్నింటిని పునర్నిర్మాంచాల్సి ఉంది. వాటి కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తాం.

- రాధాకృష్ణ, జిల్లా ఇంజనీరింగ్‌ అధికారి, ఆర్‌అండ్‌బీ శాఖ, పార్వతీపురం మన్యం

Updated Date - Aug 31 , 2025 | 10:54 PM