‘బెల్టు’కు అడ్డుకట్ట పడేనా?
ABN , Publish Date - Oct 19 , 2025 | 12:11 AM
మద్యం బెల్టుషాపుల నిర్వాహకులపై పీడీ యాక్ట్ తెరవాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి ఆదేశించారు.
- బెల్టుషాపులపై కఠినచర్యలకు సీఎం ఆదేశం
- నిర్వాహకులపై పీడీ యాక్ట్ నమోదు
- సన్నద్ధమవుతున్న యంత్రాంగం
- వివరాల సేకరణలో బిజీ
మెంటాడ, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): మద్యం బెల్టుషాపుల నిర్వాహకులపై పీడీ యాక్ట్ తెరవాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి ఆదేశించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ రామసుందర్‌రెడ్డి ఎక్సైజ్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. దీంతో ఎక్సైజ్ యంత్రాంగం చర్యలకు సన్నద్ధమవుతోంది. గ్రామాలవారీ గొలుసు దుకాణాల వివరాల సేకరణకు సమాయత్తమవుతోంది. ముందస్తుగా బెల్టు నిర్వాహకులకు హెచ్చరికలు జారీచేస్తారు. అప్పటికీ మొండిగా ముందుకువెళ్తే వారిపై పీడీ యాక్ట్ తెరవనున్నారు. బెల్టుషాపుల నిర్వాహకులపై కేసులు నమోదు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ఆదేశాలు జారీచేశారు. కానీ అమలు చేయడంలో ఎక్సైజ్ అధికారులు నిర్లక్ష్యం చేశారనే విమర్శలు ఉన్నాయి. తాజా ఆదేశాలతోనైనా బెల్టుపై చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి.
మద్యం వ్యాపారుల సిండికేట్..
జిల్లాలో ఎక్కడికక్కడే బెల్టు షాపులు దర్శనమిస్తున్నాయి. కొందరు మద్యం వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి దందా కొనసాగిస్తున్నారు. పల్లె, పట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా బెల్టు షాపులు నిర్వహిస్తూ మందుబాబుల జేబులను గుల్ల చేస్తున్నారు. గ్రామాల్లో బెల్టు దుకాణాల ద్వారానే మద్యం విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కొన్నిచోట్ల పోటాపోటీగా ఆ షాపులను ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గ కేంద్రాలతో పాటు ప్రధాన గ్రామాల్లో ఎక్కడికక్కడే బెల్ట్ షాపులు కనిపిస్తున్నాయి. సిండికేట్‌లు ఒక్కో బాటిల్‌పై రూ.ఐదు నుంచి రూ.పది అదనంగా ఇచ్చి మద్యం కొనుగోలు చేసుకుంటున్నారు. గ్రామాల్లో ఒక బాటిల్‌పై అదనంగా రూ.20 నుంచి రూ.30 పెంచి అమ్మకాలు చేపడుతున్నారు. కొన్నిసార్లు డిమాండ్‌ను బట్టి రూ.50 అదనంగా వసూలు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఏ సమయంలోనైనా మద్యం దొరుకుతుంది. బెల్ట్ నిర్వాహకులు లైసెన్స్ దుకాణాల్లో మద్యం సీసాలను కొనుగోలు చేసి ద్విచక్ర వాహనాలపై గ్రామీణ ప్రాంతాలకు తీసుకొని వచ్చి విక్రయాలు చేపడుతున్నారు. కొన్ని గ్రామాల్లో రెండు నుంచి మూడు వరకు మద్యం బెల్టు దుకాణాలు ఉన్నాయి. వీటికోసం బహిరంగ వేలంపాటలు కూడా జరుగుతున్నాయి. మొదట్లో కాస్త హడావుడి చేసిన ఎక్సైజ్ యంత్రాంగం క్రమంగా పట్టించుకోవడం మానేసింది. ప్రభుత్వం మద్యం వ్యాపారులకు టార్గెట్‌లు విధించడం, అవసరం లేకున్నా పర్మిట్ రూమ్‌లను బలవంతంగా ఏర్పాటు చేయిస్తుండడంతో ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్లు సర్దుకుపోతున్నారు. దీంతో పాత వాటికి తోడుగా కొత్తగా ఎక్కడికక్కడ పుట్టగొడుగుల్లా బెల్టు దుకాణాలు పుట్టుకొస్తున్నాయి. వైన్ షాపుల యజమానులు అమ్మకాలు పెంచుకోడానికి ప్రత్యేక ఏర్పాట్లతో బెల్టుషాపులకు డోర్ డెలవరీ కూడా చేస్తున్నారు.
నకిలీ మద్యంతో గుబులు
రాష్ట్రంలో కొన్నిచోట్ల నకిలీ మద్యం బాగోతాలు బయటపడడం మందుబాబుల్లో గుబులు పుట్టిస్తోంది. అదే సమయంలో నకిలీ నిర్మూలనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కొంత ఉపశమనం కలిగిస్తున్నాయి. వైన్ షాపులవద్దే సులువుగా అసలు, నకిలీ నిగ్గుతేల్చే ఏర్పాట్లు చేయడంతో మద్యం ప్రియులు రిలాక్స్ అవుతున్నారు. ఇంకోవైపు ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారులు కూడా నకిలీ గుర్తింపునకు చేపడుతున్న విస్తృత చర్యలపై ప్రజల్లో మంచి అభిప్రాయం ఏర్పడింది. నకిలీ మద్యాన్ని తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి చంద్రబాబు బెల్టుషాపుల నిర్వాహకులపై పీడీ యాక్ట్ తెరవడంతోపాటు నకిలీ మద్యం నిర్మూలనకు కఠిన ఆదేశాలను జారీచేశారు. వీటిలో మిగిలనవాటి విషయంలో యంత్రాంగం రాజీపడనప్పటికీ, గొలుసు దుకాణాల విషయంలో ఎంతమేర సక్సెస్ అవుతారనేది చూడాలి.