AMC ఏఎంసీలకు పూర్వ వైభవం వచ్చేనా?
ABN , Publish Date - Oct 30 , 2025 | 12:25 AM
Will the AMCs Regain Their Former Glory? జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ)లకు మంచి రోజులు రానున్నాయా? రైతులకు విశేష సేవలు అందించనున్నాయా? అంటే అవుననే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏఎంసీల ఆధునికీకరణపై కీలక ప్రకటన చేయడంతో జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రైతుల్లో చిగురిస్తున్న ఆశలు
గోడౌన్లు, కోల్ట్‌స్టోరేజ్ ఏర్పాటుపై దృష్టిసారించాలని విన్నపం
పార్వతీపురం, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ)లకు మంచి రోజులు రానున్నాయా? రైతులకు విశేష సేవలు అందించనున్నాయా? అంటే అవుననే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏఎంసీల ఆధునికీకరణపై కీలక ప్రకటన చేయడంతో జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఉపయోగపడే విధంగా మార్కెట్‌యార్డులను తీర్చిదిద్దాలని, పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని సీఎం సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో ఏఎంసీలకు పూర్వవైభవం రానుందని జిల్లా వాసులు భావిస్తున్నారు.
ఇదీ పరిస్థితి
జిల్లా కేంద్రం పార్వతీపురంలో ఉన్న వ్యవసాయ మార్కెట్‌యార్డులో సివిల్ సప్లైస్ శాఖ గోడౌన్, జీడి ప్రాసెసింగ్ యూనిట్ తదితర వాటిని నిర్వహిస్తున్నారు. ఇక ప్రతి గురువారం ఈ ప్రాంగణంలో సంత జరుగుతుంది. అయితే మార్కెట్‌యార్డులో పంటలను నిల్వ చేసేందుకు అవసరమైన గోడౌన్లతో పాటు కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని కొన్నాళ్లుగా ఈ ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయినా ఆ దిశగా ఎటువంటి చర్యల్లేవు. మార్కెట్ యార్డుల కమిటీ చైర్మన్లు ఉత్సవ విగ్రహాల్లా మారిపోయారు. రైతులకు ఉపయోగపడే అభివృద్ధి పనులు చేపట్టక పోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కురుపాం మార్కెట్ యార్డు నియోజక వర్గస్థాయి మట్టి నమూనా పరీక్షలకే పరిమితమైంది. ఇక్కడ గోడౌన్లు లేవు. ఈ ప్రాంతంలో చింతపండు నిల్వకు కోల్ట్‌స్టోరేజ్ అవసరం ఎంతో ఉన్నప్పటికీ అటువైపుగా అధికారులు, పాలకులు దృష్టి సారించడం లేదు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అదనపు భవనం నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. ఇక సాలూరు ఏఎంసీలో గోడౌన్ మొక్కజొన్న రైతులకే ఉపయో గపడుతోంది. మిగతా రైతులకు ఉపయోగపడే పనులేవీ ఇక్కడ చేపట్టడం లేదు. ఇక పాలకొండలో ఉన్న మార్కెట్ యార్డు పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ రైతులకు ఉపయోగపడే విధంగా ఎటువంటి గోడౌన్ల నిర్మాణాలు చేపట్టలేదు. సెస్ వసూళ్లు, చెక్‌పోస్టుల వరకే ఏఎంసీ సిబ్బంది పరిమితమయ్యారు. రైతులకు ఎటువంటి సేవలు అందించడం లేదు. గిట్టుబాటు ధర, మార్కెటింగ్ సదుపాయాలపై అవగాహన కల్పించడం లేదు. రైతుబంధు పథకం ద్వారా సున్నా వడ్డీతో రుణాలు అందించడం లేదు. మార్కెట్ కమిటీల ద్వారా భూసార పరీక్షలు కూడా చేపట్టడం లేదు. పాడి పశువులకు ఏడాదికి నాలుగుసార్లు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులను అందించాల్సి ఉన్నా.. జిల్లాలో అదెక్కడా కానరావడం లేదు. వాస్తవంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏఎంసీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. కనీస అభివృద్ధికి నోచుకోలేదు. తాజాగా దీనిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మార్కెట్ యార్డు చైర్మన్‌తో పాటు కమిటీ సభ్యులు ఏఎంసీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని వారు కోరుతున్నారు.
ప్రతిపాదనలు పంపించాం..
భామినిలో పత్తి కొనుగోలుకు అవసరమైన గోడౌన్ ఏర్పాటు కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదించాం. వీరఘట్టంలో మినీ రైతు బజారు ఏర్పాటుకు రూ.41 లక్షలు మంజూరయ్యాయి. దీనికి ఇంకా పరిపాలనాపరమైన ఆమోదం రాలేదు. ఇటీవల ముఖ్యమంత్రి ప్రకటించిన అంశాలపై ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు.
- సతీష్‌కుమార్, ఏఎంసీ సెక్రటరీ, పాలకొండ