Manyam’s మన్యం స్వ‘రూపం’ మారుతుందా?
ABN , Publish Date - Aug 07 , 2025 | 12:08 AM
Will Manyam’s True ‘Form’ Change పార్వతీపురం మన్యం జిల్లా స్వరూపం మారనుందా..? నియోజకవర్గాల విలీనంతో పాటు మండ లాల చేర్పులు, మార్పులకు అవకాశం ఉందా..? అంటే అవుననే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
నెలలో ఈ ప్రక్రియ పూర్తిచేయాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశం
మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు
జిల్లా రూపురేఖల మార్పుపై జోరుగా చర్చలు
పార్వతీపురం, ఆగస్టు6(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లా స్వరూపం మారనుందా..? నియోజకవర్గాల విలీనంతో పాటు మండ లాల చేర్పులు, మార్పులకు అవకాశం ఉందా..? అంటే అవుననే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. బుధవారం ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కొన్ని జిల్లాల పేర్లు మార్పు, పలు నియోజక వర్గాలు పక్క జిల్లాల్లో విలీన ప్రక్రియ ప్రతిపాదనలు నెలరోజుల్లో పూర్తికావాలని సీఎం ఆదేశించారు. దీంతో మన్యం జిల్లా రూపురేఖలు మారే అవకాశం ఉందనే చర్చలు జోరుగా సాగుతున్నాయి.
ఇదీ పరిస్థితి..
- జిల్లాల విభజనకు ముందు పార్వతీపురం డివిజన్ పరిధిలో 15 మండలాలు, సాలూరు, బొబ్బిలి మున్సిపాల్టీలు ఉండేవి. బొబ్బిలి తెర్లాం, బాడంగి మండలాలు కూడా ఈ డివిజన్‌లోనే ఉండేవి. అయితే కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత బొబ్బిలి నియోజకవర్గాన్ని విజయనగరం జిల్లాలో చేర్చారు. ఇక సాలూరు, కురుపాం, పార్వతీపురం, పాలకొండ నియోజవర్గాలతో పాటు కేవలం 15 మండలాలతోనే నాటి ప్రభుత్వం మన్యం జిల్లాను ఏర్పాటు చేసింది. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పాలకొండ నగరపంచాయతీ, భామిని, సీతంపేట, వీరఘట్టం మండలాలను మన్యం జిల్లాలో కలిపారు. - గత వైసీపీ ప్రభుత్వం హడావుడిగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే రాజకీయ ఒత్తిడి కారణంగా సాలూరు నియోజక వర్గంలోని మెంటాడ మండలాన్ని విజయనగరం జిల్లాలో చేర్పించారు. సంక్షేమ పథకాల అమలు, సరిహద్దు సమస్యలు తదితర కారణాల రీత్యా కూటమి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో మెంటాడ మండలం తిరిగి సాలూరు నియోజకవర్గంలో కలిసే అవకాశం ఉంది. అదేవిధంగా బొబ్బిలి నియోజకవర్గం తిరిగి మన్యం జిల్లాలో చేరనున్నట్లు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.