Will make a ‘connectivity with reivers ‘అనుసంధానం’ చేస్తారా?
ABN , Publish Date - Sep 04 , 2025 | 12:12 AM
Will make a ‘connectivity with reivers నదుల అనుసంధాన ప్రక్రియ జిల్లాలో పడకేసింది. ఎక్కడికక్కడ అసంపూర్తి పనులతో ఆగిపోయింది. ‘వంశధార-నాగావళి’ పనులు టీడీపీ హయాంలో 60 శాతం కాగా వైసీపీ హయాంలో 20 శాతమే జరిగాయి. ఇక నాగావళి- చంపావతి అనుసంధాన పనులకు కదలికే లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం వీటిపై ఇంకా దృష్టిసారించలేదు. ప్రస్తుతం వర్షాలు విరివిగా కురుస్తున్నప్పటికీ వర్షాభావ పరిస్థితులు వచ్చేటప్పుడు రైతులు అయోమయంలో పడుతున్నారు. నదుల అనుసంధానం పూర్తయితే రైతులు ధీమాగా సాగు పనులు చేసుకునే అవకాశం ఉంటుంది.
‘అనుసంధానం’ చేస్తారా?
అసంపూర్తిగా ‘వంశధార-నాగావళి’ పనులు
టీడీపీ హయాంలో 60 శాతం.. వైసీపీ హయాంలో 20 శాతం
కదలిక లేని నాగావళి-చంపావతి అనుసంధాన పనులు
ఇంకా దృష్టిసారించని ప్రభుత్వం
రాజాం, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): నదుల అనుసంధాన ప్రక్రియ జిల్లాలో పడకేసింది. ఎక్కడికక్కడ అసంపూర్తి పనులతో ఆగిపోయింది. ‘వంశధార-నాగావళి’ పనులు టీడీపీ హయాంలో 60 శాతం కాగా వైసీపీ హయాంలో 20 శాతమే జరిగాయి. ఇక నాగావళి- చంపావతి అనుసంధాన పనులకు కదలికే లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం వీటిపై ఇంకా దృష్టిసారించలేదు. ప్రస్తుతం వర్షాలు విరివిగా కురుస్తున్నప్పటికీ వర్షాభావ పరిస్థితులు వచ్చేటప్పుడు రైతులు అయోమయంలో పడుతున్నారు. నదుల అనుసంధానం పూర్తయితే రైతులు ధీమాగా సాగు పనులు చేసుకునే అవకాశం ఉంటుంది.
అపార సాగునీటి వనరులు జిల్లా సొంతం. కానీ ఆ వనరులు జిల్లాకు ఎంతమాత్రం అక్కరకు రావడం లేదు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు నదులు, కాలువల్లో నీటి లభ్యత అంతగా లేకుండా పోతోంది. నదుల అనుసంధానంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించవచ్చునని 2014లో టీడీపీ ప్రభుత్వం సంకల్పించింది. వంశధార-నాగావళి, తోటపల్లి-గడిగెడ్డ-చంపావతి ఇలా చాలా సాగునీటి వనరుల అనుసంధాన ప్రక్రియ ప్రారంభమైంది. కానీ వాటిని ముందుకు తీసుకెళ్లడంలో వైసీపీ సర్కారు పూర్తిగా విఫలమైంది.
వంశధార-నాగావళి నదుల అనుసంధాన ప్రక్రియ ద్వారా 50 వేల ఎకరాలకు సాగునీరు, ఏడు మండలాల ప్రజలకు తాగునీరు అందించాలని నాడు చంద్రబాబు సంకల్పించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ప్రయోజనాలకుగాను 2017లో సీఎం చంద్రబాబు నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టారు. అప్పట్లో రూ.89.90 కోట్లు కేటాయించారు. శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని వంశధార ఫేజ్-2 రిజర్వాయర్ నుంచి ఓ కాలువ ద్వారా సంతకవిటి మండలం నారాయణపురం ఆనకట్ట వద్ద అనుసంధానం చేయాలన్నది ప్రణాళిక. ఏడు మండలాలు, 92 గ్రామాల మీదుగా 33.5 కిలోమీటర్ల పొడవునా కాలువ ఏర్పాటుకు నిర్ణయించారు. 66 చోట్ల కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టాలి. అయితే టీడీపీ హయాంలో 60 శాతం పనులు పూర్తయ్యాయి. వైసీపీ ఐదేళ్ల పాలనలో కేవలం 20 శాతం పనులు మాత్రమే పూర్తిచేసింది. అది కూడా 2021లో నిర్మాణ వ్యయాన్ని రూ.145 కోట్లకు పెంచారు. అయినా పనులు మధ్యలో విడిచిపెట్టారు. వాస్తవానికి 2023 నాటికి ఈ పనులు పూర్తవ్వాల్సి ఉంది. వైసీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోడంతో కాంట్రాక్టర్లు పనులను అర్ధాంతరంగా నిలిపివేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అధికారులు నదుల అనుసంధానంపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. పనులు ఎప్పటికి పూర్తి చేస్తారో స్పష్టత లేదు.
టీడీపీ మొదలుపెట్టినా..
నాగావళి-చంపావతి నదుల అనుసంధాన ప్రక్రియదీ అదే పరిస్థితి. తోటపల్లి జలాశయం ద్వారా నాగావళి నీటిని గుర్ల మండలంలో ఉన్న గడిగెడ్డకు మళ్లించేందుకు కుడి ప్రధాన కాలువను కలపాలి. గడిగెడ్డ ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 0.11 టీఎంసీలు. నాగావళి నీరు వస్తే 0.25 టీఎంసీలకు పెరుగుతుంది. ఇందులో 10 ఎంఎల్‌డీలను నెల్లిమర్ల వద్ద ఉన్న చంపావతి నదిలో విడిచిపెట్టి ఊటబావులకు నీరు అందించగలిగితే విజయనగరం నగరానికి తాగునీరు పుష్కలంగా అందించవచ్చు. 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం రెండు ప్యాకేజీల్లో పనులు చేపట్టేందుకు ఆమోదించింది. ఇందు కోసం రూ.24.80 కోట్లు కేటాయించింది. రూ.13.92 కోట్లతో గడిగెడ్డను ఆధునికీకరించాలని భావించారు. ఇందుకు సంబంధించి టెండర్లు కూడా అప్పట్లో పూర్తయ్యాయి. రూ.2.49 కోట్లతో 22 శాతం పనులు కూడా జరిగాయి. ప్యాకేజీ-2 కింద ప్రధాన కాలువ పనులు పూర్తిచేసేందుకు రూ.1.39 కోట్లతో కాంట్రాక్టర్ టెండర్లు దక్కించుకున్నాడు. 12 శాతం పనులు కూడా పూర్తిచేశారు. అయితే టీడీపీ ప్రభుత్వం చేపట్టిన 25 శాతంలోపు పనులు జరిగిన వాటిని జగన్ సర్కారు రద్దు చేసింది. అలాగని వాటి జోలికి పోలేదు. దీంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. జలవనరుల శాఖ అధికారులు మాత్రం పాత ధరల ప్రకారం కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వంపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు.
ప్రభుత్వానికి నివేదించాం
వంశధార-నాగావళి నదుల అనుసంధానానికి సంబంధించి పరిస్థితిని ప్రభుత్వానికి నివేదించాం. గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్‌కు బిల్లులు పెండింగ్‌లో ఉండిపోయాయి. పాత అంచనా ప్రకారం పనులు చేసేందుకు కాంట్రాక్టర్ ముందుకు రావడం లేదు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదించాం.
- కేఎన్‌వీ స్వర్ణకుమార్, ఎస్‌ఈ, వంశధార ప్రాజెక్టు
--------------------------------