ITDA ఐటీడీఏ.. గాడిన పడేనా?
ABN , Publish Date - Dec 23 , 2025 | 11:29 PM
Will ITDA Get Back on Track? సీతంపేట ఐటీడీఏను అధికారుల కొరత వేధిస్తోంది. కొన్నాళ్లుగా కీలక శాఖలకు పూర్తిస్థాయి అధికారులు లేరు. ఇన్‌చార్జిలతోనే నెట్టుకొ స్తున్నారు. దీంతో గిరిజనాభివృద్థి ప్రశ్నార్థకంగా మారింది.
ఇన్‌చార్జిలతో నెట్టుకొస్తున్న వైనం
ఒక్కొక్కటిగా తరలిపోతున్న కీలకశాఖలు
గిరిజనులకు పూర్తిస్థాయిలో అందని సేవలు
సీతంపేట రూరల్, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఐటీడీఏను అధికారుల కొరత వేధిస్తోంది. కొన్నాళ్లుగా కీలక శాఖలకు పూర్తిస్థాయి అధికారులు లేరు. ఇన్‌చార్జిలతోనే నెట్టుకొ స్తున్నారు. దీంతో గిరిజనాభివృద్థి ప్రశ్నార్థకంగా మారింది. కొంతకాలంగా గిరిజనసంక్షేమ ఇంజనీరింగ్, విద్య, హార్టికల్చర్, అగ్రికల్చర్, జీసీసీ, పీఎంఆర్‌సీ, ఐసీడీఎస్, పశు సంవర్థకశాఖలతో పాటు మరికొన్ని విభాగాలకు రెగ్యులర్ అధికారులు లేరు. దీంతో ఈ శాఖల్లో ఇన్‌చార్జిల పాలన కొనసాగుతోంది. మరోవైపు బదిలీలు, ఉద్యోగ విరమణలతో ఖాళీ అవుతున్న పోస్టులను భర్తీ చేయడం లేదు. ఉన్న అధికారులకే అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో వారు ఏశాఖకు న్యాయం చేయలేని పరిస్థితి నెలకొంది. హడావుడిగా జిల్లాల విభజన చేసిన గత వైసీపీ ప్రభుత్వం పోస్టుల భర్తీ, అధికారుల నియామకంపై మాత్రం దృష్టి సారించలేదు. ఈ కారణంగా ఐటీడీఏలో పాలనపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఇదీ పరిస్థితి..
సీతంపేట ఐటీడీఏలోని కీలకశాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో అధికారులను భర్తీచేయకపోగా ఉన్న శాఖలను ఒక్కొక్కటిగా అటు పార్వతీపురం ఇటు శ్రీకాకుళం తరలించేందుకు రంగం సిద్ధమ వుతోంది. ఇప్పటికే సీతంపేట ఐటీడీఏ పరిధిలోని టీపీఎంయూ(ట్రైబర్ ప్రాజెక్ట్ మోనటరింగ్ యూనిట్)ను డీఆర్‌డీఏలో విలీనం చేశారు. ఆ యూనిట్‌లో పనిచేసిన వెలుగు ఏపీడీ, డీపీఎం, ఏపీఎంలతో పాటు అడ్మిన్ అసిస్టెంట్ల సేవలను పార్వతీపురం, శ్రీకాకుళంలోని డీఆర్‌డీఏ కార్యాల యాల్లో వినియోగించుకుంటున్నారు.
- సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఎన్నో ఏళ్లుగా సేవలందించిన గిరిజనసంక్షేమశాఖ(డీడి కార్యాలయం)కూడా వచ్చే ఏడాది ఉగాది నాటికి శ్రీకాకుళం కలెక్టరేట్‌కు తరలిపోనుంది. డీడీ కార్యాలయ సిబ్బందికి కేటాయించాల్సిన గదులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈవిధంగా ఒక్కో కీలక శాఖ సీతంపేట ఐటీడీఏ నుంచి తరలిపోతుండడంతో గిరిజనులు, ప్రజా సంఘాల నాయకులు మండిపడుతున్నారు.
ఖాళీలు ఇలా..
- సీతంపేట ఐటీడీఏకు గడిచిన ఏడాదిన్నర కాలంగా రెగ్యులర్ పీవో లేరు. పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్‌కు ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో బాధ్యతలను అప్పగించారు. ప్రాజెక్ట్ అగ్రికల్చర్ అధికారి(పీఏవో)పోస్టు కూడా కొంతకాలంగా ఖాళీగానే ఉంది. పీహెచ్‌వో(ప్రాజెక్ట్ హార్టికల్చర్) అధికారి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఐటీడీఏలో మేనేజర్ పోస్టు కూడా కొన్నేళ్లుగా ఖాళీగానే ఉండగా.. ఏవో సునీల్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
- సీతంపేట, మెళియాపుట్టి క్లస్టర్ పరిధిలోని సహాయ గిరిజనసంక్షేమశాఖాధికారులు (ఏటీడబ్ల్యూవో) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటికి సంబంధించి డీడీ అన్నాదొర, లాబర ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం పి.సూర్యనారాయణ ఇన్‌చార్జిలుగా ఉన్నారు. దీంతో గిరిజనసంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, పోస్టుమెట్రిక్ వసతిగృహాలు, గురుకుల పాఠశాలలపై పర్యవేక్షణ కొరవడింది. గిరిజన విద్యాభివృద్థి కుంటుపడుతోంది.
- జీసీసీ జోనల్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న సంధ్యారాణి సీతంపేట డివిజనల్ మేనేజర్(డీఎం)గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో గిరిజన ప్రాంతాల్లో జీసీసీ ద్వారా జరిగే డీఆర్‌డిపోల నిర్వహణ, సంస్థ కార్యకలాపాలపై పూర్తిస్థాయిలో పర్యవేక్షించలేకపోతున్నారు. టెండర్‌ల నిర్వహణ సమయంలో మాత్రమే ఆమె సీతంపేట ఐటీడీఏకు వస్తారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
- పీఎంఆర్‌సీ విభాగంలో ఏఎంవో పోస్టు ఇటీవలే ఖాళీ అయింది. జీసీడీవో రాములమ్మకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
- సీతంపేట గిరిజనసంక్షేమ ఇంజనీరింగ్ శాఖను కొన్నేళ్లుగా సిబ్బంది కొరత వేధిస్తోంది. డీఈ పోస్టు ఖాళీగా ఉండడంతో ఏఈ నాగభూషణం ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 11మంది ఏఈలకు 3గురు మాత్రమే ఉన్నారు. రెండు జేటీవో, ఎనిమిది అటెండర్ల పోస్టులు కూడా భర్తీ చేయడం లేదు.
- ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో తొమ్మిడి సూపర్‌వైజర్ పోస్టులకు గాను ఐదుగురు మాత్రమే ఉన్నారు. ఇక సీతంపేట, భామిని, బత్తిలి, దోనుబాయి, పొల్ల పశు వైద్య కేంద్రాలకు వైద్యాధికారుల కొరత వేధిస్తోంది. ఇలా అనేక కీలకశాఖల్లో రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో పాలన గాడితప్పుతోంది. ఇకనైనా కూటమి ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు.
- ఈ అంశంపై ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్‌ను వివరణ కోరగా.. ‘అధికారులు, సిబ్బంది కొరత ఉన్నా.. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నాం. ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేశాం.’ అని తెలిపారు.
- సీతంపేట ఐటీడీఏలోని కీలకశాఖల్లో పోస్టుల భర్తీ విషయాన్ని అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ చెప్పారు.