Outskirts? శివారుకు అందేనా?
ABN , Publish Date - Jul 14 , 2025 | 11:50 PM
Will It Reach the Outskirts? తోటపల్లి పాత రెగ్యులేటర్ పరిధిలోని ఎడమ ప్రధాన , కుడి ఉప కాలువల నుంచి ఈనెల 16న సాగునీరు విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఖరీఫ్ రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నారు. ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే రెగ్యులేటర్ పరిధిలోని కాలువలు అధ్వానంగా దర్శనమిస్తున్నాయి.
రేపు విడుదల చేసేందుకు సన్నాహాలు
అధ్వానంగా కాలువలు
ప్రభుత్వ చొరవతో పూడికతీత పనులు పూర్తి
గత వైసీపీ సర్కారు తీరుతో ఆధునికీకరణకు నోచని వైనం
వేధిస్తున్న లస్కర్ల కొరత.. ఇతరత్రా సమస్యలు
ఆందోళనలో రైతులు
గరుగుబిల్లి, జూలై 14 (ఆంధ్రజ్యోతి): తోటపల్లి పాత రెగ్యులేటర్ పరిధిలోని ఎడమ ప్రధాన , కుడి ఉప కాలువల నుంచి ఈనెల 16న సాగునీరు విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఖరీఫ్ రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నారు. ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే రెగ్యులేటర్ పరిధిలోని కాలువలు అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో యుద్ధప్రాతిపదికన పూడికతీత పనులు చేపట్టారు. కాగా గత వైసీపీ ప్రభుత్వ తీరుతో ఆధునికీకరణ పనులేవీ పూర్తికాలేదు. నిర్వహణ లోపం కారణంగా వాటి పరిధిలో డ్రాపులు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఎడమ ప్రధాన కాలువ ప్రారంభంలోనే సమస్యలు నెలకొన్నాయి. దీంతో పాటు రెగ్యులేటర్ కూడా మొరాయిస్తుంది. గతంలో రెండు కాలువల పరిధిలో అధికంగా గండ్లు పడ్డాయి. శివారు ప్రాంతాలకు సాగునీరు అందని పరిస్థితులు ఏర్ప డ్డాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సక్రమంగా నీరందుతుందా? లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ పరిస్థితి..
తోటపల్లి పాత రెగ్యులేటర్ నుంచి గరుగుబిల్లి, జియ్యమ్మవలస, వీరఘట్టం, పాలకొండ, బలిజిపేట, విజయనగరం జిల్లాలో వంగర, సంతకవిటి, శ్రీకాకుళం జిల్లా పరిధి బూర్జ మండలాల్లో సుమారు 63,549 ఎకరాలకు ఈ ఖరీఫ్‌లో సాగునీరందించాల్సి ఉంది. ఎడమ ప్రధాన కాలువ పరిధిలో సుమారు 81 గ్రామాలు, 31,310 ఎకరాలు , కుడి ఉప కాలువ పరిధిలో 28 గ్రామాలకు సంబంధించి 9,128 ఎకరాలున్నాయి. ఎడమ వైపు 26కు పైగా ఉన్న ఓపెన్ హెడ్ చానల్ నుంచి 12,450 ఎకరాలు, కుడి వైపునకు సంబంధించి 2,160 ఎకరాలు ఉన్నాయి. అదనపు ఆయకట్టు 8,500 ఎకరాలు ఉన్నాయి.
పాత రెగ్యులేటర్ పరిధిలో నిర్మాణాలు గత బ్రిటీష్ హయాంలో చేపట్టినవే. వాటి దుస్థితిని తెలుసుకున్న అప్పటి టీడీపీ ప్రభుత్వం 2018లో ఆధునికీకరణకు సుమారు రూ.93 కోట్లు మంజూరు చేసింది. 2019 వరకు 23 శాతం మేర పనులు నిర్వహించారు. ఆ తర్వాత అధికారం లోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ పనులపై నిర్లక్ష్యంగా వ్యవహరించింది. బిల్లులు చెల్లించక పోడంతో పనులు నిలిచిపోయాయి.
పనులు ఇలా...
ఎడమ కాలువ పరిధిలో 37.62 కిలో మీటర్లకు గాను 16 కిలో మీటర్లు, కుడి కాలువ పరిధిలో 17.616 కిలో మీటర్లకు గాను 9.37 కిలో మీటర్ల మేర లైనింగ్ పనులు నిర్వహించారు. ఎడమ కాలువ పరిధిలో 8 బ్రాంచ్‌లు, కుడి ఉప కాలువ పరిధిలో 11 బ్రాంచ్ కాలువల పనులు జరగాల్సి ఉంది. 267 వరకు ఆక్విడెక్టులు, సూపర్‌పాసేజ్‌లు, అండర్ టన్నెళ్లు, ఔట్‌లెట్లు, డ్రాపులు, యూటీ స్లూయిజ్‌లు, రైతులు పంట పొలాలకు వెళ్లేందుకు వీలుగా వంతెనలు నిర్మించాల్సి ఉంది.
సిబ్బంది కొరత..
రెండు కాలువల పరిధిలోని సాగునీటి పర్యవేక్షణకు 42 మంది లస్కర్లు ఉండాలి. ప్రస్తుతం ఐదుగురే ఉన్నారు. గతంలో సీజనల్ లస్కర్లను నియమించేవారు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విధానానికి మంగళం పాడేసింది. సిబ్బంది కొరత కారణంగా గండ్లు పడినా ఆయా ప్రాంతాల్లోని రైతులే స్వచ్ఛందంగా పూడ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
ప్రతిపాదనలు పంపించాం..
తోటపల్లి పాత రెగ్యులేటర్ పరిధిలోని రెండు కాలువల అభివృద్ధికి సుమారు రూ.1.40 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు నివేదించాం. ధులు విడుదలైన వెంటనే పనులు ప్రారంభిస్తాం. లస్కర్లు కొరత ఉంది. సీజనల్ లస్కర్లు నియామకానికి ప్రతిపాదనలు పంపించాం. సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో రెండు కాలువల పరిధిలో పూడికతీతలు, పిచ్చి మొక్కలు తొలగింపు చేపట్టాం.
- వై.గనిరాజు, డీఈఈ, జలవనరులశాఖ, పాలకొండ సబ్ డివిజన్