Will It Be Left Like This? ఇలానే వదిలేస్తారా?
ABN , Publish Date - Sep 04 , 2025 | 12:21 AM
Will It Be Left Like This? వేసవిలో మూగజీవాలకు ఉపయోగకరంగా ఉంటా యన్న ఉద్దేశంతో జిల్లాలో ఉపాధి హామీ నిధులతో నిర్మించిన నీటి తొట్టెలు నిరుపయోగంగా మారాయి. చాలాచోట్ల అవి చెత్తాచెదారంతో నిండి అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. వాస్తవంగా 15 మండలాల్లో సుమారు 411కు పైగా నీటి తొట్టెలు నిర్మించారు.
నీరుగారిన లక్ష్యం
నిర్వహణపై అధికారుల నిర్లక్ష్యం
గరుగుబిల్లి, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): వేసవిలో మూగజీవాలకు ఉపయోగకరంగా ఉంటా యన్న ఉద్దేశంతో జిల్లాలో ఉపాధి హామీ నిధులతో నిర్మించిన నీటి తొట్టెలు నిరుపయోగంగా మారాయి. చాలాచోట్ల అవి చెత్తాచెదారంతో నిండి అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. వాస్తవంగా 15 మండలాల్లో సుమారు 411కు పైగా నీటి తొట్టెలు నిర్మించారు. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి సిబ్బంది ఆదరాబాదరాగా వాటి పనులు పూర్తి చేశారు. అయితే తొట్టెల్లో నీటిని నింపే ప్రయత్నాలు చేయలేదు. ప్రస్తుతం గ్రామాల్లో వినియోగానికి నోచుకోవడం లేదు. ప్రస్తుతం అవి వర్షపు నీటితో నిండాయి. వాటిపై సంబంధిత అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా ఒక్కో నీటి తొట్టె నిర్మాణానికి వేతనంగా రూ. 5,100, సామగ్రికి రూ. 24,100 చొప్పున వెచ్చించారు. గ్రామస్థాయిలో కొందరు కూటమి నేతలే వాటి నిర్మాణాలు చేపట్టారు. అయితే పనులు చేపట్టి ఐదు నెలలు కావస్తున్నా.. వాటి నిధులు ఇంకా మంజూరు కాలేదు. సంబంధిత నీటి తొట్టెలకు కొలతలు వేసి నిధుల కోసం ఎఫ్‌టీయూలు జనరేట్ చేశారు. అయితే అనుమతులు లభించ లేదు. వీటితో పాటు 323 ప్రహరీల నిర్మాణాలకు కూడా నిధులు మంజూరు కాలేదు.
తొట్టెల నిర్వహణ పంచాయతీలదే..
ఉపాధి హామీ నిధులతో నిర్మించిన నీటి తొట్టెల నిర్వహణ బాధ్యత పంచాయతీలదే. తొట్టెల్లో నీరు నింపడం, తదితర నిర్వహణ బాధ్యతలు ఉపాధి క్షేత్ర సహాయకులు, పంచాయతీ సిబ్బందికి అప్పగించాం. వాటిపై దృష్టి సారించాలని ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేశాం. నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తప్పవు. తొట్టెలతో పాటు ప్రహరీలకు సంబంధించి నిధుల విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించాం.
- జి.శ్రీహరిరావు, ఉపాధి అడిషనల్ ప్రాజెక్టు అధికారి, సీతంపేట క్లస్టర్