Will it be included in the Scheduled Area? షెడ్యూల్డ్ ఏరియాలో కలుపుతారా?
ABN , Publish Date - Sep 25 , 2025 | 12:01 AM
Will it be included in the Scheduled Area? షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజన గ్రామాలను కలిపే ప్రతిపాదనపై శాసన సభలో జరిగిన చర్చతో జిల్లాలో ఉన్న నాన్ షెడ్యూల్డ్ ఏరియా గిరిజనుల్లో ఓ పక్క ఆశ, మరో పక్క సందేహం నెలకొంది. జిల్లాకు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) లేకపోవడమే దీనికి కారణం. గత వైసీపీ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో జిల్లాను విభజించింది.
షెడ్యూల్డ్ ఏరియాలో
కలుపుతారా?
జిల్లా గిరిజనుల్లో ఓ పక్క ఆశ.. మరో పక్క సందేహం
తాజాగా శాసన సభలో చర్చ
హామీ ఇచ్చిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
పునర్విభజనలో ఐటీడీఏను కోల్పోయిన గిరిజనం
వారి భూముల్లో అమలు కాని 1/70 యాక్ట్
విద్య, వైద్య, ఉద్యోగ, ఉపాధి, అభివృద్ధికి దూరంగా జీవనం
-- రాష్ట్రంలో 496 గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్ ప్రాంత పరిధిలోకి తెచ్చేందుకు ప్రతిపాదనలు వచ్చాయి. యాభై శాతం కంటే ఎక్కువ మంది గిరిజనులున్న గ్రామాల వివరాలను తీసుకోవాలని కలెక్టర్‌లు, ఐటీడీఏ పీవోలకు సూచించాం. వీటిపై రాష్ట్ర గిరిజన సలహా మండలి సిఫార్స్‌లతో మంత్రి వర్గ సమావేశంలో చర్చిస్తాం. నివేదికను గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపుతాం. ఇంకా ఎక్కడైనా అభివృద్ధి కాని గిరిజన గ్రామాలుంటే ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు పంపించవచ్చు.
- మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యానారాయణ మూర్తి సోమవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చెప్పిన సమాధానం.
శృంగవరపుకోట, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి):
షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజన గ్రామాలను కలిపే ప్రతిపాదనపై శాసన సభలో జరిగిన చర్చతో జిల్లాలో ఉన్న నాన్ షెడ్యూల్డ్ ఏరియా గిరిజనుల్లో ఓ పక్క ఆశ, మరో పక్క సందేహం నెలకొంది. జిల్లాకు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) లేకపోవడమే దీనికి కారణం. గత వైసీపీ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో జిల్లాను విభజించింది. అంతవరకు జిల్లా పరిధిలో వున్న పార్వతీపురం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) నూతనంగా ఏర్పడిన పార్వతీపురం మన్యం జిల్లాలో కలిసిపోయింది. జిల్లా పరిధిలోని నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో నివశిస్తున్న గిరిజనులకు ఎంతోకొంత అందే ఐటీడీఏ సేవలు నిలిచిపోయాయి.
1970 నుంచి విన్నపాలు
ఐటీడీఏలో కలిసుండే గిరిజన గ్రామాలకు వివిధ రకాలుగా మేలు కలుగుతుంటుంది. దీన్ని గుర్తించిన నాన్ షెడ్యూల్డ్ గ్రామాల గిరిజనులు 1970 నుంచి డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు శాసన సభలో తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతున్నారు. గిరిజన జనాభా అధికంగా ఉండి అభివృద్ధికి నోచుకోని గ్రామాలను షెడ్యూల్డ్ ఏరియాగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు అయితే ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రక్రియ అమలు కావడం లేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టిసారించింది. అర్హతున్న గ్రామాలను షెడ్యూల్డ్ ఏరియాలో కలిపేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు అడుగులు వేస్తోంది.
సంప్రదాయాలు ఒకేలా ఉన్నా..
జిల్లాలో 40వేల మంది వరకు గిరిజనులు నివశిస్తున్నారు. షెడ్యూల్డ్ ఏరియా పరిధిలో ఉన్న గిరిజనుల వలే భాష, సంస్కృతీసంప్రదాయాలు, జీవన విదానం ఉంది. అక్కడున్న తెగలు, సామాజిక వర్గాలు జిల్లాలోనూ ఉన్నాయి. గిరిశిఖర ప్రాంతాల్లో విసిరేసినట్లు ఉంటే నివాసాలు, రాళ్లు రప్పలతో రహదారులు, అనారోగ్యంతో బాధపడేవారిని డోలీ కట్టి తరలించడం ప్రతిరోజూ కనిపించే దృశ్యాలే.
కొండ శిఖరానే అధికం
శృంగవరపుకోట నియోజకవర్గంలో గిరిజన గూడేలకు కొదవలేదు. శృంగవరపుకోట మండలం దారపర్తి, మునపరాయి, రాయిపాలెం, చప్పన గెడ్డ, పల్లపు దుంగాడ, పోర్లు, రంగవలస, ధూళుపోర్లు, కురిడి, గూనపాడు-1, గూనపాడు-2, చిట్టింపాడు, రేగపుణ్యగిరి, గిరిలోవ గ్రామాలు పూర్తిగా కొండ శిఖరాన ఉన్నాయి. ఇదే విదంగా వేపాడ మండలం మారిక గిరిజన గ్రామం గిరిశిఖర గ్రామమే. మూలబొడ్డవర, దబ్బగుంట, మరుపల్లి, లచ్చందోరపాలెం, మెట్టపాలెం, లక్ష్మిపురం, బొడ్డపాడు, గాదిల్లోవ వంటి గ్రామాలు మైదానమా.. కొండ శిఖరమా అన్నట్లు ఉన్నాయి. ముషిడిపల్లి, కిల్తంపాలెం, మూలబొడ్డవర పంచాయతీ పరిఽధిల్లో శతశాతం, 70శాతం గిరిజనులున్న అవాసాలు ఉన్నాయి. గంట్యాడ మండలం దిగువ కొండపర్తి (డీకే పర్తి) కొండపైనే ఉంటుంది. ఇవేవీ షెడ్యూల్డ్ ఏరియాలో లేవు. దీంతో సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ అందించే ప్రయోజనాలు వీరికి దూరం.
వైద్యం దూరం
జిల్లానుంచి ఐటీడీఏ తరలిపోయినప్పటికీ కొన్ని అంశాల్లో సహకారం ఉంటోంది. ఇందుకు జిల్లాలో ప్రత్యేకంగా ఓ అధికారిని నియమించి సేవలు అందిస్తున్నారు. వైద్యం వరకు సేవలను నిలిపేసారు. గతంలో ఉత్తరాంధ్ర ఆరోగ్యప్రధాయనిగా చెప్పుకొంటున్న కింగ్ జార్జ్ హాస్పటల్ (కేజీహెచ్)లో ఉచిత వైద్యంతో పాటు మందులు అందించేవారు. ఇప్పుడు ఐటీడీఏ లేకపోవడంతో నిలిపేసారు. కొద్దిరోజుల క్రితం శృంగవరపుకోట మండలం మూలబొడ్డవర పంచాయతీ శివారు గాదెల్లోవకు చెందిన గిరిజన యువకుడు రాజేష్ బోన్ క్యాన్సర్‌తో బాధపడుతుండడంతో కేజీహెచ్‌లో చేర్చారు. మూడు, నాలుగు రోజులకు రక్తం ఎక్కించాల్సి వచ్చేది. ఐటీడీఏ అధికారుల నుంచి అనుమతి పత్రం తెస్తేనే ఇస్తామని కేజీహెచ్ అధికారులు, ఐటీడీఏ పరిధిలో మీ జిల్లా లేనందున అనుమతి ఇవ్వలేమని ఈ శాఖ అధికారులు అనడంతో ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావును కలిసారు. అతని సిఫార్స్‌తో ఓ నాలుగు సార్లు రక్తం ఇచ్చిన కేజీహెచ్ అధికారులు తరువాత నిలిపేసారు. మందులు, రక్తం ఎక్కించేందుకే ఈ గిరిజన పేద కుటుంబం రూ.1.30 లక్షలు అప్పుచేయాల్సి వచ్చింది. ఇదోక ఉదాహరణ మాత్రమే. వీరు షెడ్యూల్ పరిధిలో లేకపోవడంతో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లోను నష్టం జరుగుతోంది..
పాడేరు ఐటీడీఏ సహకారమూ లేక..
పోడు వ్యవసాయం, గిరిజన ఉత్పత్తుల విక్రయాలకు ఐటీడీఏ నుంచి గతంలో సహాయం అందేది. దీనిని కూడా కోల్పోయారు. జిల్లాలో శృంగవరపుకోట, వేపాడ, గంట్యాడ మండలాల పరిధిలో వున్న కొండ శిఖర గిరిజన గ్రామాలన్నీ అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలానికి చెందిన గిరిజన గ్రామాలను ఆనుకుని ఉన్నాయి. వీరు సాగు చేస్తున్న పోడు భూములు అక్కడ ఉండడంతో హక్కులు పొందలేకపోతున్నారు. ఆ జిల్లా పరిధిలోని పాడేరు ఐటీడీఏ అధికారులు పోడు వ్యవసాయ భూములతో పాటు రహదారుల సదుపాయానికి అనుమతులు ఇవ్వడం లేదు. జిల్లా పరిధిలో వున్న ఈగ్రామాలకు అల్లూరి జిల్లా అనంతగిరి మండల భూభాగం అక్కడక్కడ ఉంది. దీంతో ఈ చిక్కులు వస్తున్నాయి.
1/70 యాక్ట్ వర్తించక..
షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న భూములకు 1/70 యాక్డు రక్షణగా ఉంటుంది. ఈ యాక్డు వున్న ప్రాంతల్లో గిరిజనేతరులు భూములు కొనుగోలు చేసే అవకాశం లేదు. షెడ్యూల్డ్ ఏరియాలో లేని గిరిజన గ్రామాలకు ఈ యాక్టు వర్తించదు. దీంతో పట్టణాలు, నగరాల్లో నివసిస్తున్న రియల్టర్‌లు గిరిజనుల భూములపై కన్నేశారు. వీరి ఆర్థిక అవసరాలను గుర్తించి డబ్బు ఆశ చూపించి వీరు సాగు చేసుకుంటున్న భూములను తక్కువ ధరకు లాక్కుంటున్నారు. ప్రభుత్వం సాగుకు ఇచ్చిన అసైన్డ్ భూములనూ వదల్లేదు. కొంత మంది భూ యజమానులు ఎవరి వద్దయితే కొనుగోలు చేసారో వారి పొలంలోనే కూలీగా పెట్టుకున్నారు. అధికారులు ఎవరైనా వస్తే పీఓటీ యాక్డు నుంచి తప్పించుకొనేందుకు తమ అధీనంలో భూములు ఉన్నాయని చెప్పేలా ఏర్పాట్లు చేసుకున్నారు.
జిందాల్‌కు ఇచ్చేవాళ్లం కాదు
ఎస్.కోట మండలం కిల్తంపాలెం, మూలబొడ్డవర, ముషిడిపల్లి, చీడిపాలెం, చినఖండెపల్లి గ్రామాల పరిధిలో 2006లో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సేకరించి జిందాల్ యాజమాన్యానికి ఇచ్చిన 866 ఎకరాల్లో అత్యధిక శాతం గిరిజనులకు చెందినవే. ఈ గిరిజనులు షెడ్యూల్డ్ ఏరియాలో వుండుంటే వీటిని ఈ పరిశ్రమకు అప్పగించే వారే కాదని ఇక్కడి గిరిజనుల నోటి నుంచి వినిపిస్తోంది.
షెడ్యూల్డ్ ఏరియా పరిధిలో చేర్చాలి
జిల్లాలో అత్యధికంగా గిరిజన జనాభా శృంగవరపుకోట నియోజకవర్గంలో ఉంది. అలాగే గంట్యాడ, మెంటాడ, బొండపల్లి, గజపతినగరం మండలాల్లోనూ గిరిజన గ్రామాలున్నాయి. వీటన్నింటినీ షెడ్యూల్డ్ ఏరియాలో చేర్చాలని ఎప్పటి నుంచో కోరుతున్నాం. షెడ్యూల్డ్ ఏరియాలో గ్రామాలను చేర్చాలంటే ఐటీడీఏ ఉండాలి. దీన్ని శృంగవరపుకోటలో ఏర్పాటు చేయడంతో పాటు జిల్లాలోని గిరిజన గ్రామాలన్నింటినీ షెడ్యూల్డ్ ఏరియాలో చేర్చేలా మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కృషి చేయాలి.
- జె.గౌరీష్, గిరిజన సంఘ నాయకుడు