Three Months? మరో మూడు నెలల్లో పూర్తయ్యేనా?
ABN , Publish Date - Sep 19 , 2025 | 11:41 PM
Will It Be Completed in Another Three Months? జిల్లాలో పీఎం జన్‌మన్ పథకం కింద మంజూ రైన గృహాల నిర్మాణాలు మరో మూడు నెలల్లో పూర్తికావాలని ఉన్నతాధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ క్షేత్రస్థాయిలో భిన్న పరిస్థితి నెలకొంది. 1,249 ఇళ్ల పనులు ఇంకా ప్రారంభం కాలేదు. వివిధ నిర్మాణ దశల్లో 3,920 వరకు గృహాలున్నాయి.
గిరిజన లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్న వైనం
క్షేత్రస్థాయిలో భిన్న పరిస్థితి..
మంజూరు 5,169.. ఇంకా ప్రారంభం కానివి 1,249
వివిధ నిర్మాణ దశల్లో ఉన్న ఇళ్లు 3,920
జియ్యమ్మవలస, సెప్టెంబరు19(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పీఎం జన్‌మన్ పథకం కింద మంజూ రైన గృహాల నిర్మాణాలు మరో మూడు నెలల్లో పూర్తికావాలని ఉన్నతాధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ క్షేత్రస్థాయిలో భిన్న పరిస్థితి నెలకొంది. 1,249 ఇళ్ల పనులు ఇంకా ప్రారంభం కాలేదు. వివిధ నిర్మాణ దశల్లో 3,920 వరకు గృహాలున్నాయి. జిల్లాలోని రెండు డివిజన్లలో అత్యధికంగా సవర, గదబ తెగలకు పీఎం జన్‌మన్ పథకం కింద ఇళ్లు మంజూరయ్యాయి. అన్నింటా వెనుకబడిన వారికి గృహ నిర్మాణంపై అంతగా అవగాహన లేదు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు గిరిజన లబ్ధిదారులను చైతన్యపరుస్తున్నా.. మూడు నెలల్లో ఇళ్ల నిర్మా ణాలు పూర్తి చేయడం సాధ్యమేనా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఇదీ పరిస్థితి
వాస్తవానికి 2023, నవంబరు 12లో ప్రధానమంత్రి మోదీ పీఎం జన్‌మన్ పథకం ప్రారం భించారు. గిరిజన తెగలు(పీవీటీజీలు) సవర, గదబ జాతులకు చెందిన వారికి ఈ పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించారు. వారికి గృహాలు, తాగునీరు, విద్య, వైద్యం, మెరుగైన పారిశుధ్యం, జీవనోపాధి అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా పథకాన్ని అమలు చేశారు. అయితే మొదటిగా గృహ నిర్మాణాల విషయానికొస్తే.. అదే ఏడాదిలో పాలకొండ డివిజన్ పరిధిలో కొన్ని పంచాయతీలకు, 2024లో పార్వతీపురం డివిజన్‌లో మరికొన్ని పంచాయతీలకు ఇళ్లు మంజూర య్యాయి. కాగా గత వైసీపీ ప్రభుత్వం వాటిపై దృష్టి సారించ లేదు. దీంతో గృహ నిర్మాణాలు నత్తనడకనే సాగాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిర్మాణాలు ఊపంద కున్నాయి. గృహ నిర్మాణశాఖ ఏఈలు లబ్ధిదారులతో మాట్లాడి వారిని చైతన్యపర్చడంలో సఫలీకృతులవుతున్నారు. పార్వతీపురం, పాలకొండ డివిజన్లలో గరుగుబిల్లి, సీతానగరం మండలాలు మినహా మిగిలిన 13 మండలాల్లో పీఎం జన్‌మన్ పథకం కింద పీవీటీజీలకు 5,169 ఇళ్లు మంజూరు కాగా, 3,920 వరకు నిర్మాణాలు జరుగుతున్నాయి. 1,249 ఇళ్ల పనులు ఇంకా ప్రారంభం కాలేదు. బిలో బేస్‌మెంట్ లెవెల్ (బీబీఎల్), బేస్‌మెంట్ లెవెల్ (బీఎల్)లో 1,842, రూఫ్ లెవెల్ (ఆర్‌ఎల్)లో 1,100, రూఫ్ కంప్లీటెడ్ (ఆర్‌సీ) లెవెల్‌లో 593 ఇళ్లు ఉన్నాయి. 385 గృహ నిర్మాణాలు పూర్తయ్యాయి. అత్యధికంగా కురుపాం మండలానికి 2,004 ఇళ్లు మంజూరైతే 1,394 ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. సీతంపేటకు 1,749 ఇళ్లు మంజూరవగా.. 1,357 గృహ నిర్మాణాలు జరుగుతున్నాయి. అత్యల్పంగా బలిజిపేట మండలానికి మంజూరైన రెండు ఇళ్లు నిర్మాణాలు పూర్తయ్యాయి. గుమ్మలక్ష్మీపురంలో 555 ఇళ్లకు గాను 406 , భామినిలో 285కు గాను 177 ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. జియ్యమ్మవలసలో 204కు 163, వీరఘట్టానికి 147 మం జూరైతే 109 , సాలూరులో 81కి 57 , పాచిపెంటలో 46కు 31, పాలకొండలో 38కి13, మక్కు వలో 29కి 22 , పార్వతీపురంలో 15కి 14, కొమరాడ మండలంలో 11కి 9 ఇళ్ల చొప్పున నిర్మాణాలు జరుగుతున్నాయి. ఏదేమైనా 2025 డిసెంబరులోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడం సాధ్యపడదని, మరికొంత గడువు కావాలని గిరిజనులు కోరుతున్నారు.
బిల్లుల మంజూరు ఇలా..
ప్రధానమంత్రి జన్‌మన్ పథకంలో ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 2.39 లక్షలు మంజూరైంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ. 1.20 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 80 వేలు అందిస్తోంది. ఇతర సౌకర్యాలు, ఉపాధి కోసం రూ. 39 వేలు ఇస్తున్నారు. ఇంటి నిర్మాణం బేస్‌మెంట్ లెవెల్‌లో ఉంటే రూ.70వేలు, రూఫ్ లెవెల్‌లో రూ.90 వేలు, రూఫ్ కంప్లీటెడ్ లెవెల్‌లో రూ.40 వేలు చెల్లిస్తున్నారు. ఇది కాకుండా మరుగుదొడ్ల నిర్మాణానికి రూ. 12 వేలు, 90 రోజుల పనిదినాలకు గాను వేతనదారులకు రూ. 27 వేల చొప్పున బిల్లులు మంజూరు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2026, మార్చి నాటికి ఈ గృహ నిర్మాణాలన్నీ పూర్తి చేయాల్సి ఉంది.
నిర్మాణాలు వేగవంతమవ్వాలి
పీఎం జన్‌మన్ పథకంలో మంజూరైన ఇళ్ల నిర్మాణాలు మరింత వేగవంతంగా జరగాలి. దీనిపై గృహ నిర్మాణశాఖ ఇంజనీర్లందరూ దృష్టి సారించాల్సిందే. లబ్ధిదారులు ఎంత త్వరగా గృహ నిర్మాణాలు చేస్తే అంత త్వరగా బిల్లులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాం.
- పి.ధర్మచంద్రారెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, పార్వతీపురం మన్యం జిల్లా