Will i receive a scheme of talliki vandanam ‘తల్లికి వందనం’ అందుతుందా?
ABN , Publish Date - Jul 20 , 2025 | 11:45 PM
Will i receive a scheme of talliki vandanam ల్లా వ్యాప్తంగా చాలా మందికి నేటికీ తల్లికి వందనం పథకం అందలేదు. ఈ సమస్య ఉన్నవారంతా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. మూడేళ్లుగా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో 25 శాతం పేదలకు ఉచితంగా సీట్లు మంజూరు చేసే పథకం అమలు జరుగుతోంది.
‘తల్లికి వందనం’ అందుతుందా?
ఉచిత సీట్లు పొందిన విద్యార్థులకు మంజూరు కాని పథకం
చాలా కుటుంబాల్లో ఇద్దరు పిల్లలకీ వర్తించని వైనం
నిరాశ చెందుతున్న తల్లులు
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొర
విజయనగరం కలెక్టరేట్ జూలై 20(ఆంధ్రజ్యోతి):
- గంట్యాడ మండలం లక్కిడాం గ్రామానికి చెందిన బొడ్డు రామకృష్ణ , భారతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వారిలో గత ఏడాది చిన్న కుమార్తెకు గంట్యాడలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ప్రభుత్వం కల్పించిన ఉచిత సీటు వచ్చింది. పెద్దకుమార్తెను వేరే ప్రైవేటు పాఠశాలలో తమ సొంత డబ్బులుతో చదివించుకుంటున్నారు. అయితే ప్రభుత్వం విడుదల చేసిన తల్లికివందనం పథకం ఇద్దరు పిల్లల్లో ఎవరికీ మంజూరు కాలేదు. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే స్పష్టత ఇవ్వలేదు. ఆ దంపతులు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు.
- బొబ్బిలి మండలం మల్లంపేట గ్రామానికి చెందిన టి.రామలక్ష్మికి ఇద్దరు పిల్లలు. ఒకరు బొబ్బిలిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉచిత సీటుకు ఎంపికయ్యారు. రెండో విద్యార్థిని బొబ్బిలిలోని వేరే ప్రైవేటు పాఠశాలలో చదివించకుంటున్నారు. అయితే తమ కుమార్తెకు ఉచిత సీటు అవసరం లేదని అధికారులకు (ఆన్‌విలింగ్ లెటర్ )ఇచ్చారు. అయినా ప్రభుత్వం అందజేసిన తల్లికివందనం పథకం ఇద్దరిలో ఎవరికీ విడుదల కాలేదు. దీనిపై రామలక్ష్మి కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో విన్నవించుకున్నారు.
- విజయనగరం పట్టణంలోని కొత్తపేటకు చెందిన లీలాకు ఇద్దరు పిల్లలు. ఒకరికి పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో ఉచిత సీటు వచ్చింది. రెండో అబ్బాయికి పట్టణంలోని కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్నాడు. ఇద్దరిలో ఎవరికీ తల్లికి వందనం పథకం మంజూరు కాలేదు. ఈ సమస్యపై లీలా ఉన్నతాధికారులకు విన్నవించారు.
జిల్లా వ్యాప్తంగా చాలా మందికి నేటికీ తల్లికి వందనం పథకం అందలేదు. ఈ సమస్య ఉన్నవారంతా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. మూడేళ్లుగా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో 25 శాతం పేదలకు ఉచితంగా సీట్లు మంజూరు చేసే పథకం అమలు జరుగుతోంది. నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటున్నారు. ఎంపికైన పిల్లలకు గ్రామీణ ప్రాంతాల్లో రూ.6500, పట్టణ ప్రాంతాల్లో రూ.8000 చొప్పున ఫీజును ప్రభుత్వం నిర్దేశించింది. ఈ సీట్లకు ఎంపికైన విద్యార్థులకు ప్రభుత్వమే ఫీజు చెల్లిస్తుంది. ఇది మినహా మిగిలిన యూనిఫాం, పుస్తకాలు, బస్సు ఫీజులను తల్లిదండ్రులే చెల్లించుకోవాలి. అయితే ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు విడుదల చేయాల్సిన ఫీజు బకాయిలు మంజూరు చేయకపోవడంతో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నుంచి ఉచిత సీట్లకు ఎంపికైన చాలా మంది పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇదిలా ఉంటే ఈ ప్రభుత్వ హయంలో తల్లికివందనం పథకాన్ని ఉచిత సీట్లకు ఎంపికైన విద్యార్థులతో పాటు వారి సోదరుడు, సోదరికి కూడా ఇవ్వలేదు. దీంతో ఆయా తల్లులు నిరాశతో ఉన్నారు. ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఒకరికీ ఇవ్వకపోవడమేంటని వారంతా ప్రశ్నిస్తున్నారు. అటువంటి వారంతా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో విన్నవించుకున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలంటున్నారు.
కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లాం
జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఇటువంటి సమస్యలపై రాష్ట్ర కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లాం. మరోవైపు గ్రామ, వార్డు సచివాలయాల నుంచి కూడా ఈ సమస్యపై కమిషనర్‌కు నివేదికలు వెళ్తున్నాయి. దీనిపై ప్రభుత్వం నుంచి నిర్ణయం రావాల్సి ఉంది.
- మాణిక్యంనాయుడు, డీఈవో