will be go vepada చలో వేపాడ
ABN , Publish Date - Aug 24 , 2025 | 11:47 PM
will be go vepada ఒకప్పుడు వేపాడ మండలం పేరు చెబితే అధికారులు అమ్మో అనేవారు. ఈ మండలంలో విధులు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు. దీంతో ఉన్నతాధికారులు తప్పులు చేసే అధికారులకు శిక్షగా ఇక్కడకు బదిలీ చేసేవారు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు అధికారులే డబ్బులు ఇచ్చిమరీ పోస్టింగ్ కోసం పోటీపడుతున్నారు. ప్రజాప్రతినిధులు, నాయకుల ప్రాపకంతో కుర్చీని పదిలం చేసుకుంటున్నారు. వేపాడ మండలం ఆదాయ వనరుగా మారడమే ఈ మార్పునకు కారణంగా కనిపిస్తోంది.
చలో వేపాడ
ఒకప్పుడు వద్దన్నారు.. ఇప్పుడు కావాలంటున్నారు
అప్పట్లో తప్పుచేసే అధికారులకు శిక్షగా ఈ మండలానికి బదిలీ
నేడు డబ్బులిచ్చి మరీ పోస్టింగ్ కోసం పోటీ
తరచూ ఏసీబీ వలకు చిక్కుతున్న రెవెన్యూ సిబ్బంది
అయినా తగ్గని వసూళ్లు
ఒకప్పుడు వేపాడ మండలం పేరు చెబితే అధికారులు అమ్మో అనేవారు. ఈ మండలంలో విధులు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు. దీంతో ఉన్నతాధికారులు తప్పులు చేసే అధికారులకు శిక్షగా ఇక్కడకు బదిలీ చేసేవారు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు అధికారులే డబ్బులు ఇచ్చిమరీ పోస్టింగ్ కోసం పోటీపడుతున్నారు. ప్రజాప్రతినిధులు, నాయకుల ప్రాపకంతో కుర్చీని పదిలం చేసుకుంటున్నారు. వేపాడ మండలం ఆదాయ వనరుగా మారడమే ఈ మార్పునకు కారణంగా కనిపిస్తోంది.
శృంగవరపుకోట, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి):
వేపాడ మండల పరిధిలోని ఓ సచివాలయ రెవెన్యూ అధికారి రూ.లక్షతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు ఇటీవల చిక్కడంతో ఈ మండలం మరోసారి జిల్లా వ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కింది. మొదట్లో ఈ మండలమంటే అసక్తి చూపని అధికారులు రానురాను ఇక్కడ పనిచేసేందుకు అత్యుత్సాహం చూపుతుండడం ఇందుకేనా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ మండల కేంద్రం జిల్లాకు మారుమూలన ఉంటుంది. రవాణా సదుపాయం తక్కువ. ఇటు విశాఖ-అరకు రోడ్డులోని సోంపురం కూడలి నుంచి పది కిలోమీటర్లు, అటు కొత్తవలస-దేవరాపల్లి రోడ్డులోని అనందపురం కూడలి నుంచి పదికిలోమీటర్ల దూరంలో వున్న ఈ మండల కేంద్రానికి ఆర్టీసీ బస్సులను తిప్పడం లేదు. ఈ మండలంలో పని చేసే ఉద్యోగులకు సొంత వాహనం వుంటే తప్ప సకాలంలో విధులకు హాజరయ్యేందుకు అవకాశం లేదు. ఇలాంటి భిన్నమైన పరిస్థితులున్న ఈ మండలం రెవెన్యూ అధికారులకు కాసులు కురిపిస్తోంది. దీంతో ఇక్కడ పోస్టింగ్ కోసం అర్రులు చాస్తున్నారు. ఇప్పటికే ఉన్న వారు కుర్చీని కాపాడుకుంటున్నారు.
- వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ మండలంలో అనేక భూ అవకతవకలు జరిగాయి. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయి. చెరువు గట్లను లేఅవుట్‌లకు రహదారులుగా ప్రైవేటు భూములకు రహదారులుగా మార్చినా పట్టించుకోలేదు. కొండగంగూ బూడి పంచాయతీలో దాదాపు నాలుగు ఎకరాలకు పైబడిన ప్రభుత్వ భూమిని అమ్మకానికి పెట్టారు. లేఅవుట్‌గా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. ఎన్ని ఫిర్యాదులు వెళ్లినా రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడలేదు.
- వేపాడ మండల పరిధిలో 1433.79 ఎకరాల అసైన్డ్ భూములున్నాయి. ఇవన్నీ 22ఎ నిషేధిత జాబితాలో వున్నప్పటికీ చేతులు మారాయి. ప్రధానంగా కొండగంగుబూడి, అంకాజోస్యల పాలెం, చామలాదేవి అగ్రహారం, దబ్బిరాజుపేట, వీలుపర్తి తదితర గ్రామాల పరిధిలో అత్యధికంగా ఈ భూములు వేరొకరి చేతిలో ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వం అసైన్డ్ భూములకు చట్టబద్ధత (ఫ్రీహోల్డ్) కల్పించింది. ఇదే అప్పటి రెవెన్యూ అధికారులకు కలిసొచ్చింది. ఒక్క కేజీ పూడి గ్రామ పరిధిలో 98.32 ఎకరాలకు రిజిస్ట్రేషన్ జరిగింది. కూటమి ప్రభుత్వం చేయించిన విచారణలో ఈ విషయం బయటపడడంతో ఓ సబ్ రిజిస్ట్రార్‌పై సీసీఎల్‌ఏ చర్యలు తీసుకుంది. వేపాడ మండలంలో 200.09 ఎకరాల ఫ్రీహోల్డ్ భూముల పరిస్థితి కూడా ఇంతే.
ఏసీబీ వలలో ఎందరో..
వేపాడలో రెవెన్యూ అధికారులు అవినీతి నిరోధక శాఖ వలలో పడడం ఇదే మొదటిసారి అనుకుంటే పొరపాటే. గతంలో అవనీతి నిరోధక శాఖ తహసీల్దార్, ఉప తహసీల్దార్, సర్వేయర్‌లపై వల పన్నింది. అనుకోకుండా తహసీల్దార్, సర్వేయర్‌లు తప్పుకున్నారు. ఉప తహసీల్దార్ మాత్రం దొరికిపోయారు. ఆ తరువాత ఓ గ్రామ రెవెన్యూ అధికారి రూ.20వేలతోను, మరో గ్రామ రేవెన్యూ అధికారి రూ.5వేలతోను, ఇంకో గ్రామ రెవెన్యూ అధికారి రూ.3వేలతోనూ వేర్వేరు సందర్భాల్లో రైతుల నుంచి లంచంగా తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ పట్టుకొంది. ఇలా తరచూ ఈ మండల రెవెన్యూ అవనీతి నిరోధక శాఖ వలలో పడుతోంది. అయినా జంకడం లేదు. భూముల్లో వున్న చిన్న చిన్న లోపాలను చూపించి దండుకుంటున్నారు. సెంటుకు రూ.800ల నుంచి రూ.1000 వరకు డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వకుంటే వారి చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తున్నారు. ఒకరిద్దరు తెగించి ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. మిగిలిన వారంతా చేసేదేమీ లేక అడిగినంత ఇచ్చి పని చేయించుకుంటున్నారు. ఇలా ఈ మండలం ఆదాయ వనరుగా మారడంతో ఇక్కడ పనిచేసేందుకు రెవెన్యూ అధికారులు మొగ్గు చూపుతున్నారు. అలాగే ఇక్కడ నుంచి కదలకుండా వుండేందుకు ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీ నేతల దగ్గర చేరిపోతున్నారు.