Share News

భర్త హత్య కేసులో భార్యకు జీవిత ఖైదు

ABN , Publish Date - Aug 23 , 2025 | 12:15 AM

నగరంలోని టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో 2015లో నమోదైన హత్య కేసులో నిందితురాలు విశాఖ జిల్లా భీమిలి మండలం నగరపాలెం గ్రామానికి చెందిన గారి వెంకట జ్యోతిర్మయికి జీవితఖైదు విధిస్తూ విజయనగరం ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి బి.అప్పలస్వామి తీర్పు వెల్లడించినట్టు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు.

 భర్త హత్య కేసులో  భార్యకు జీవిత ఖైదు

విజయనగరం క్రైం, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): నగరంలోని టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో 2015లో నమోదైన హత్య కేసులో నిందితురాలు విశాఖ జిల్లా భీమిలి మండలం నగరపాలెం గ్రామానికి చెందిన గారి వెంకట జ్యోతిర్మయికి జీవితఖైదు విధిస్తూ విజయనగరం ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి బి.అప్పలస్వామి తీర్పు వెల్లడించినట్టు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. అదే మండలం కాపులదిబ్బవాని పాలెంనకు చెందిన చొక్కా నరేష్‌, ఉప్పాడకు చెందిన పాడ రాజు అలియాస్‌ ముక్కు అనే ఇద్దరు నిందితులకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.500 చొప్పున జరిమానా విధించినట్టు తెలిపారు. వెంకట జ్యోతిర్మయికి రమేష్‌ అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరు ఆనందపురం మండలం బొడ్డుపాలెం గ్రామంలో నివాసం ఉండేవారు. భర్త గార రమేష్‌కు సీమేన్‌గా ఉద్యోగం రావడంతో శిక్షణ నిమిత్తం 2015లో చైన్నై వెళ్లిపోయారు. భార్య వెంకట జ్యోతిర్మయికి భీమిలి మండలం కాపుల దిబ్బవానిపాలెంనకు చెందిన రాగాతి రాముతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్త రమేష్‌ శిక్షణ పూర్తి చేసుకుని వచ్చిన తరువాత వీరి విషయాన్ని గుర్తించి, భార్యను ప్రశ్నించాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వివాదాలు జరిగేవి. దీంతో రమేష్‌ను అడ్డు తొలగించేందుకు నిందితులు ప్రణాళిక రూపొందించారు. 2015 జూలై 26న రమేష్‌ తన భార్య వెంకట జ్యోతిర్మయిని ఇదే విషయమై ప్రశ్నించగా... ఆమె ప్రియుడు రాగాతి రాముకు ఫోన్‌ చేసి రప్పించింది. తలుపు చెక్కతో భర్త రమేష్‌ తలపై కొట్టగా అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ దృశ్యాన్ని జ్యోతిర్మయి రెండో కుమార్తె సౌమ్య చూసింది. ప్రియుడు రాగాతి రాము, చొక్కా నరేష్‌, రాజులతో కలిసి రమేష్‌ మృతదేహాన్ని జ్యోతిర్మయి అర్ధరాత్రి సమయంలో భీమిలి బీచ్‌కు తీసుకువెళ్లి పెట్రోలు పోసి కాల్చేశారు. అనంతరం రెండో కుమార్తె సౌమ్యను పూల్‌బాగ్‌లోని ఓ బావిలో చంపేసి పడేశారు. ఈ విషయం టూటౌన్‌ పోలీసులకు తెలిసింది. నిందితులు నలుగురిని అప్పటి టూటౌన్‌ సీఐ అంబేడ్కర్‌ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం బాధ్యతలు చేపట్టిన సీఐలు దుర్గాప్రసాద్‌, విజయానంద్‌, రామారావులు దర్యాప్తు చేపట్టి నిందితులపై అభియోగ పత్రాలు దాఖలు చేశారు. దీంతో ప్రస్తుత సీఐ టి.శ్రీనివాసరావు న్యాయస్థానంలో సాక్ష్యాలను ప్రవేశపెట్టడంతో నిందితులకు శిక్ష ఖరారు చేసినట్టు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. మరో నిందితుడు రాగాతి రాము విచారణ సమయంలోనే రోడ్డు ప్రమాదంలో మరణించాడని తెలిపారు. ఈ కేసులో క్రియాశీలకంగా వ్యవహరించిన సీఐ శ్రీనివాసరావు, కోర్టు కానిస్టేబుల్‌ లక్ష్మి, ఏఎస్‌ఐ మల్లేశ్వరరావులను ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అభినందించారు.

Updated Date - Aug 23 , 2025 | 12:15 AM