Surya Ghar సూర్యఘర్‌పై విస్తృత అవగాహన
ABN , Publish Date - Jun 06 , 2025 | 11:54 PM
Widespread Awareness on Surya Ghar పీఎం సూర్యఘర్ యూనిట్ల ఏర్పాటుపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీవోలతో మాట్లాడారు.
పార్వతీపురం, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): పీఎం సూర్యఘర్ యూనిట్ల ఏర్పాటుపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీవోలతో మాట్లాడారు. సూర్యఘర్ ప్రయోజనాలు తెలియజేసి, పథకంపై ఆసక్తి చూపుతున్న వ్యక్తుల పేర్లు నమోదు చేయాలన్నారు. 3 కేవీ యూనిట్ ఏర్పాటు వల్ల ఎక్కువ లోడ్ వినియోగించవచ్చునని తెలిపారు. రూ.1.20 లక్షలు చెల్లించిన వెంటనే సంబంధిత ఏజెన్సీ సౌర విద్యుత్ ఏర్పాటు చేస్తుందన్నారు. రూ.80 వేల వరకు రాయితీ వస్తుందని చెప్పారు. లబ్ధిదారులకు రుణ సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి సౌర విద్యుత్‌ను వినియోగించాలని సూచించారు. పార్వతీపురం డివిజన్‌లో ఇప్పటివరకు 147 యూనిట్లు మాత్రమే ఏర్పాటు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత పార్వతీపురం పట్టణంలో ఎస్‌ఎన్‌ఎం కాలనీలో చేపట్టిన పీఎం సూర్యఘర్ లబ్ధిదారుల నమోదు కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. పట్టణంలో ఈ యూనిట్ల ఏర్పాటుకు మరికొంతమంది ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చేప పిల్లల ఉత్సాదకత పెంచాలి
- పార్వతీపురం(కొమరాడ): జిల్లాలో చేప పిల్లల ఉత్పాదకతను పెంచాలని కలెక్టర్ ఆదేశించారు. కొమరాడ మండలం కోటిపాం గ్రామంలో చేపపిల్లల పెంపకానికి ఉపయోగపడే (కాపిటివ్ సీడ్ నర్సరీ) చెరువు పనులను ప్రారంభించారు. స్టాకింగ్ సైజ్ చేప పిల్లలను ఉత్పత్తి చేసుకొని విక్రయించుకోవచ్చని తెలిపారు.
- కొమరాడ మండలం చినఖేర్జల పంచాయతీ పరిధి బంజుకుప్ప గ్రామంలో వీధిలైట్లను కలెక్టర్ ప్రారంభించారు. స్వచ్ఛంద సేవా సంస్థ జేకేఎస్ ఆధ్వర్యంలో సిగ్నపై ఇన్నోవేషన్ ఇండియా సహకారంతో నాలుగు మండలాల్లో సుమారు 230 గ్రామాలకు వీధిలైట్లు అమర్చారని ఆయన వెల్లడించారు.