why not to dovelop park ఆ ‘చెత్త’శుద్ధి ఏమైంది?
ABN , Publish Date - Apr 11 , 2025 | 12:02 AM
బొబ్బిలి సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ పార్కు (చెత్తశుద్ధి నిర్వహణ కేంద్రం) పేరు చెబితే ఒకప్పుడు ఆదర్శమనేవారు. సందర్శించాలని ఆసక్తి చూపేవారు. ఇతర రాష్ట్రాల నుంచి అధికారులు పరిశీలనకు వచ్చి తాము కూడా అనుసరిస్తామని ప్రకటించేవారు. జాతీయ స్థాయిలోనూ ఉత్తమ వేస్ట్ మేనేజ్‌మెంట్ పార్కుగా గుర్తింపు పొందింది. నాటి ఆ వైభవం నేడు చెదిరిపోయింది. వ్యర్థాలను ప్యాకింగ్ చేయడం లేదు. వర్మీకంపోస్టు తయారీ ఆపేశారు. బయోగ్యాస్, బయో విద్యుత్ ఉత్పత్తి నిలిపేశారు. స్వచ్ఛతా లేదు.. పార్కు గత వైభవాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన వారంతా నేటి దుస్థితిని చూసి ఆవేదన చెందుతున్నారు.

ఆ ‘చెత్త’శుద్ధి ఏమైంది?
నాడు జాతీయ స్థాయిలో గుర్తింపు
నేడు ఎవరూ కన్నెత్తి చూడని వైనం
బొబ్బిలి సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ పార్కు దుస్థితి ఇదీ
ప్రైవేటుకు అప్పగించడమే కారణమని విమర్శలు
బొబ్బిలి సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ పార్కు (చెత్తశుద్ధి నిర్వహణ కేంద్రం) పేరు చెబితే ఒకప్పుడు ఆదర్శమనేవారు. సందర్శించాలని ఆసక్తి చూపేవారు. ఇతర రాష్ట్రాల నుంచి అధికారులు పరిశీలనకు వచ్చి తాము కూడా అనుసరిస్తామని ప్రకటించేవారు. జాతీయ స్థాయిలోనూ ఉత్తమ వేస్ట్ మేనేజ్‌మెంట్ పార్కుగా గుర్తింపు పొందింది. నాటి ఆ వైభవం నేడు చెదిరిపోయింది. వ్యర్థాలను ప్యాకింగ్ చేయడం లేదు. వర్మీకంపోస్టు తయారీ ఆపేశారు. బయోగ్యాస్, బయో విద్యుత్ ఉత్పత్తి నిలిపేశారు. స్వచ్ఛతా లేదు.. పార్కు గత వైభవాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన వారంతా నేటి దుస్థితిని చూసి ఆవేదన చెందుతున్నారు.
బొబ్బిలి, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి):
బొబ్బిలి మున్సిపాలిటీలో రామన్నదొరవలస గిరిజన గ్రామానికి సమీపంలో సుమారు పదెకరాల ప్రభుత్వ స్థలంలో 12వ ఆర్థిక సంఘం నిధులు రూ.1.31 కోట్లతో 2010లో సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్ పార్కును అతి సుందరంగా ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీలో ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించి (తడి, పొడి చెత్తను వేర్వేరుగా) దానిని సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ పార్కుకు తరలించి వాటి నుంచి ఎరువులు, బయోగ్యాస్‌తో పాటు బయో విద్యుత్‌ను ఉత్పత్తి చేసేవారు. ఇది నిజమేనా? అని రాష్ట్రంలోని అనేక సంస్థలు, మున్సిపాలిటీల అధికారులు ప్రత్యేకించి బొబ్బిలి వచ్చి పరిశీలించి ఆశ్చర్యపోతుండే వారు. ఇదే మాదిరిగా తమ ప్రాంతాల్లో కూడా చేస్తామనేవారు. మిమ్స్ కళాశాల వైద్య విద్యార్థులు అనేకసార్లు ఇక్కడకు వచ్చి సాలిడ్‌వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై అధ్యయనం చేసేవారంటే అతిశయోక్తి కాదు. 2016లో సెంట్రల్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్‌ఈ) సంస్థ ప్రతినిధులు సందర్శించి ఆశ్చర్యపోయారు. మున్సిపాలిటీకి జాతీయ అవార్డు ప్రకటించారు.
చెత్తకాదు సంపద అంటూ..
అప్పట్లో కమిషనర్‌గా పనిచేసిన కరుణాకరం ప్రసాద్ స్థానిక ప్రజాప్రతినిధులు, సామాజిక సంస్థలు, పట్టణ పౌరులు, మున్సిపల్ పాలకవర్గం, సిబ్బందిని ప్రణాళికాబద్ధంగా సమన్వయం చేశారు. ప్రతీ ఇంటి నుంచి తడి చెత్తను, పొడి చెత్తను సేకరించేందుకు రెండు రకాల ప్లాస్టిక్ బుట్టలను ఉచితంగా పంపిణీ చేశారు. ముందుగా చెత్తను ఎవరూ కాలువల్లో గాని, రోడ్లపై గాని పారబోయనీయకుండా కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశారు. అందుకోసం వార్డుల్లోని ప్రజలందరికీ విస్తృతమైన అవగాహన కల్పించారు. ఇంటింటికీ కూడా వెళ్లి చెప్పారు. ఇది చెత్తకాదు దీంతో సంపద సృష్టించవచ్చు అని చెప్పి ఆకర్షనీయమైన నినాదాలతో పట్టణ ప్రజల మనసు దోచుకున్నారు. దీనికి తోడుగా బొబ్బిలి పట్టణంలో పాలిథిన్ కవర్లు, వాటర్ ప్యాకెట్లను నిషేధించారు. ఈ నిషేధాన్ని రాష్ట్రమంతా నివ్వెరపోయేలా అమలు చేశారు. కరుణాకరం ప్రసాద్ పదవీ విరమణ చేశాక ఆ తరువాత వచ్చిన వారంతా ఆ స్థాయిలో దీనిపై దృష్టి పెట్టలేదు. ప్రైవేటీకరణ నిర్ణయం చెత్తశుద్ధి పార్కునకు శాపంగా మారిందని స్థానికలంటారు.
- అట్టపెట్టెలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, వాడిపారేసిన బట్టలు ఇలా వ్యర్థాలన్నింటినీ సేకరించాక వేరు చేసి ప్యాకింగ్ చేసి విక్రయించేవారు. కూరగాయల వ్యర్థాలతో వర్మీకంపోస్టు ఎరువులు తయారు చేసేవారు. బయోగ్యాస్, బయో విద్యుత్‌ను ఉత్పత్తి చేసేవారు. పట్టణంలో సుమారు 1072 వ్యాపార సంస్థలు ఉండగా వాటి నుంచి రోజుకు 8.4 టన్నుల చెత్తను సేకరించినట్లు లెక్కలు చెబుతున్నాయి.
ప్రయివేటుకు లీజుకు ఇచ్చాకే..
2018లో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఏర్పాటై బొబ్బిలి, చీరాల, సాలూరు మాదిరిగానే రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు ఈ తరహా చెత్తశుద్ధి ప్రక్రియను అమలు చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత ప్రైవేటీకరణ తెరపైకి వచ్చింది. డిజైన్, బిల్డ్, ఆపరేషన్, ట్రాన్స్‌ఫర్ (డీబీఓటి) పద్ధతిలో సాలిడ్ పార్కులో రెండున్నర ఎకరాల స్థలాన్ని చదరపు మీటరుకు ఒక రూపాయి చొప్పున లీజుకు ఇచ్చారు. ఇలా రెండు సంస్థలకు 11 సంవత్సరాలకు, 30 సంవత్సరాలకు లీజు కట్టబెట్టారు. ప్రైవేట్ సంస్థలు శాస్ర్తీయంగా నిర్వహిస్తాయని చెప్పి మున్సిపల్ అధికారులు పూర్తిస్థాయిలో దృష్టిసారించడం మానేశారు. నేడు పార్కుకు ఆరుబయట చెత్తకుప్పలను పారబోయడమే కాక, వాటికి మంటలు పెట్టి తగులబెడుతున్నారు. చెత్తను కాల్చడం పర్యావరణపరంగా నిషేధం.
గత వైభవం తీసుకొస్తాం
లాలం రామలక్ష్మి, మున్సిపల్ కమిషనరు, బొబ్బిలి
బొబ్బిలి సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ పార్కుకు గతంలో ఉండే పేరు ప్రఖ్యాతులను తిరిగి తీసుకొచ్చేందుకు ప్రత్యేక దృష్టిసారిస్తాం. నిరంతర పర్యవేక్షణతో మరింత ఆధునిక శైలిలో ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తాను. పార్కులోని ఖాళీ స్థలాల్లో కూరగాయల పెంపకం చేపట్టాలని యోచిస్తున్నాం. చెత్తనుంచి సంపద సృష్టి కోసం అన్ని అంశాల అమలుకు కృషి చేస్తాం. సందర్శకులు వచ్చేలా సుందరీకరిస్తాం.
సాలిడ్ వేస్ట్ పార్కుపై దృష్టిసారిస్తా
బేబీనాయన, ఎమ్మెల్యే, బొబ్బిలి
సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ పార్కు బొబ్బిలికి మంచి పేరు తెచ్చింది. ఇంటింటి చెత్తసేకరణ, పాలిథిన్ నిషేధం వంటి కార్యకలాపాలకు ప్రజామద్దతును కూడగట్టడంలో గతంలో చాలా కృషి చేశాం. మంచి ఫలితాలను సాధించాం. మళ్లీ దీనిపై దృష్టిసారిస్తా. అధికారులతో సమీక్షించి పార్కు అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటాం.