Why not take it? ఎందుకు తీసుకోనట్టు?
ABN , Publish Date - Dec 21 , 2025 | 12:16 AM
Why not take it?స్మార్ట్ కార్డు చాలా కీలకం. ప్రభుత్వం రేషన్‌కే పరిమితం కాకుండా ఏ పథకం పొందాలన్నా ఈ కార్డునే ప్రాతిపదికగా తీసుకుంటోంది. అంత ముఖ్యమైన కార్డులు జారీ చేసి నెలల గడుస్తున్నా తీసుకోవడం లేదు. జిల్లా వ్యాప్తంగా వేలల్లోనే డీలర్ల వద్ద మూలుగుతున్నాయి. ఎందుకు తీసుకోలేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. దీనిపై అధికారులు ఆరా తీస్తున్నారు.
ఎందుకు తీసుకోనట్టు?
ఇంకా అందుకోని స్మార్ట్ కార్డుల సంఖ్య 30వేలు
డీలర్ల వద్ద మూలుగుతున్న వైనం
పరిశీలిస్తున్న అధికారులు
స్మార్ట్ కార్డు చాలా కీలకం. ప్రభుత్వం రేషన్‌కే పరిమితం కాకుండా ఏ పథకం పొందాలన్నా ఈ కార్డునే ప్రాతిపదికగా తీసుకుంటోంది. అంత ముఖ్యమైన కార్డులు జారీ చేసి నెలల గడుస్తున్నా తీసుకోవడం లేదు. జిల్లా వ్యాప్తంగా వేలల్లోనే డీలర్ల వద్ద మూలుగుతున్నాయి. ఎందుకు తీసుకోలేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. దీనిపై అధికారులు ఆరా తీస్తున్నారు.
రాజాం రూరల్, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి):
రేషన్‌కార్డు కోసం అధికారులు, కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే పరిస్థితి నుంచి రేషన్‌కార్డులు వచ్చినా తీసుకోని పరిస్థితి నేడు జిల్లాలో కనిపిస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పౌరసరఫరాల ప్రక్రియపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. గత ప్రభుత్వంలో జరిగినట్లు అక్రమాలకు తావివ్వకుండా, కార్డుదారులకు న్యాయం జరిగేలా పాత రేషన్‌కార్డులకు మంగళం పలికి క్యూఆర్ కోడ్‌తో ఏటీఎం కార్డును పోలినట్లు కొత్తకార్డులను తయారు చేయించి జారీ చేశారు. పంపిణీ బాధ్యతను రేషన్‌డీలర్లు, గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి అప్పగించారు. అక్టోబర్ 31లోగా కార్డులు పంపిణీ పూర్తికావాలని గడువు విధించారు. ఆ గడువు ముగిసి రెండు నెలలు కావస్తున్నా జిల్లాలో సుమారు 30 వేల మంది కుటుంబాలు స్మార్ట్‌కార్డులు తీసుకునేందుకు ముందుకు రాలేదు. దీంతో కార్డులు రేషన్‌డీలర్ల వద్ద మూలుగుతున్నాయి. వీటి కథాకమామీషుపై పౌరసరఫరాలశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు.
ఆచూకీ లేని కుటుంబాలు..
జిల్లాకు 5,68,311 స్మార్ట్‌కార్డులు మంజూరయ్యాయి. వీటిలో ప్రభుత్వం విధించిన గడువులోగా 5,37,688 మంది కార్డులు తీసుకున్నారు. ఇంకా 30,628 మంది కార్డుదారుల జాడ కనిపించడం లేదు. అంతమంది ఎందుకు కార్డులు తీసుకోలేదు.. గత ప్రభుత్వ హయాంలో తమ అనుకూలురు, పార్టీ కార్యకర్తలు, చోటామోటా నాయకులకు రేషన్‌కార్డులు అందించారా అనే సందేహాలు అధికారుల్లో వ్యక్తమవుతున్నాయి. అలాగే ఇప్పటివరకూ కార్డులు తీసుకోని వారు వలసవెళ్లారా, మృతి చెందారా, బోగస్‌వా అనే కోణంలో కూడా అధికారులు కసరత్తు ప్రారంభించారు.
సంపూర్ణ సమాచారంతో..
కూటమి ప్రభుత్వం అందజేసిన స్మార్ట్‌రేషన్‌కార్డులో సంపూర్ణ సమాచారాన్ని పొందుపరిచి ఆధునికంగా తీర్చిదిద్దారు. కార్డుపై క్యూఆర్ కోడ్ ముద్రించారు. దీన్ని స్కాన్ చేస్తే కార్డునెంబర్, పుట్టినతేదీ, కుటుంబ సభ్యుల వివరాలు, రేషన్‌షాపు వివరాలు, లబ్ధిదారుడి అడ్రస్, తహసీల్దార్ కార్యాలయం, టోల్‌ఫ్రీ నెంబర్ కూడా తెలుసుకునేలా ముద్రించారు.
ఎక్కడెక్కడ.. ఎన్నెన్ని..
విజయనగరంలో 9686, బొబ్బిలిలో 2022, వంగరలో 1468, రాజాంలో 1230, ఎస్.కోటలో 1185, కొత్తవలసలో 1173, రేగిడిలో 1146, సంతకవిటిలో 1021, వేపాడలో 915, చీపురుపల్లిలో 905, రామభద్రపురంలో 837, భోగాపురంలో 777, తెర్లాంలో 766, మెరకముడిదాంలో 717 రేషన్‌కార్డులు డీలర్ల వద్ద మూలుగుతున్నాయి.
కార్డుల్ని తీసుకోవాలి
ఏ కారణం చేతనైనా ఇప్పటివరకూ స్మార్ట్‌కార్డులు తీసుకోనివారు డీలర్ల వద్దకు వెళ్లి కార్డులు తీసుకోవాలి. ప్రభుత్వం నిర్దేశించిన గడువు ముగిసింది. ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేలోగా వీటిని తీసుకోకపోతే తిరిగి ఉన్నతాధికారులకు పంపిస్తాం. అక్కడి నుంచి రాష్ట్రకార్యాలయానికి వెళ్లిపోవచ్చు. రాజాం ప్రాంతంలో 1230 స్మార్ట్‌కార్డులు పంపిణీ కాలేదు.
- రాజశేఖర్, తహసీల్దార్, రాజాం
-------------------