why not respond in andra lands ఆండ్ర భూముల ఆక్రమణలపై అలసత్వం ఎందుకో?
ABN , Publish Date - Aug 19 , 2025 | 11:50 PM
why not respond in andra lands ఆక్రమణకు గురైన ఆండ్ర రిజర్వాయర్ భూముల లెక్క తేల్చాలని ఇరిగేషన్ అధికారులకు స్వయంగా తహసీల్దార్ లేఖ రాసి రెండువారాలు దాటినా అట్నుంచి కనీస స్పందన లేకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తమ పరిధిలోని భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన అధికారుల్లో తహసీల్దార్ లేఖ రాసాకైనా కదలిక రాకపోవడం విమర్శలకు ఆస్కారమిస్తోంది. భూముల కబ్జా నిగ్గుతేల్చని పక్షంలో మరిన్ని భూములను చెరబట్టే ప్రమాదం ఉందని రిజర్వాయర్ దిగువ ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఆండ్ర భూముల ఆక్రమణలపై
అలసత్వం ఎందుకో?
తహసీల్దార్ లేఖపై ఇరిగేషన్‌శాఖ తాత్సారం
రెండువారాలు దాటినా కదలిక లేని వైనం
చెలరేగిపోతున్న కబ్జారాయుళ్లు
ముంపు భయంతో వణుకుతున్న దిగువ గ్రామాలు
సాగునీటిపై నిరాశలో రైతులు
ఆక్రమణకు గురైన ఆండ్ర రిజర్వాయర్ భూముల లెక్క తేల్చాలని ఇరిగేషన్ అధికారులకు స్వయంగా తహసీల్దార్ లేఖ రాసి రెండువారాలు దాటినా అట్నుంచి కనీస స్పందన లేకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తమ పరిధిలోని భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన అధికారుల్లో తహసీల్దార్ లేఖ రాసాకైనా కదలిక రాకపోవడం విమర్శలకు ఆస్కారమిస్తోంది. భూముల కబ్జా నిగ్గుతేల్చని పక్షంలో మరిన్ని భూములను చెరబట్టే ప్రమాదం ఉందని రిజర్వాయర్ దిగువ ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు.
మెంటాడ, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి):
మెంటాడ, గజపతినగరం, బొండపల్లి మండలాలకు చెందిన సుమారు తొమ్మిది వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు లక్ష్యంగా ఆండ్ర రిజర్వాయర్ నిర్మాణం పురుడుపోసుకున్నప్పుడు భవిష్యత్తు అవసరాలను సైతం దృష్టిలో ఉంచుకుని మొత్తం 1050 ఎకరాలను సేకరించారు. అందులో ఎగువ ప్రాంతానికి చెందిన సుమారు రూ.20 కోట్ల విలువ చేసే దాదాపు 100 ఎకరాల భూమిని కొందరు దశలవారీగా ఆక్రమించారు. రిజర్వాయర్ గర్భం కన్నా ఎత్తుచేసుకొని దీర్ఘకాల వాణిజ్య పంటలు వేశారు. ఇదే విషయాన్ని పేర్కొంటూ ఈ నెల 2న ఆంధ్రజ్యోతిలో ‘ఆండ్ర భూములు హాంఫట్’’ శీర్షికన కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. కథనంపై స్పందించిన తహసీల్దార్ అరుణకుమారి ఆండ్ర భూముల్లో ఆక్రమణల లెక్క తేల్చాలని పేర్కొంటూ ఇరిగేషన్ డీఈఈకి సూచించారు. వారివైపు నుంచి నేటివరకు కనీస కదలిక లేదు.
ఆండ్ర జలాశయం నీటినిల్వ పూర్తి సామర్థ్యం 146 మీటర్లు కాగా ప్రస్తుతం 140.20 మీటర్లకు చేరింది. ఒకట్రెండు రోజుల్లో మళ్లీ వర్షాలు కురిస్తే జలాశయం నిండుకుండను తలపిస్తుంది. అదే జరిగితే ఎగువ, దిగువ ప్రాంతాలు ఎప్పట్లాగే ముంపునకు గురయ్యే ప్రమాదముంది. దీనిపై ఆయా ప్రాంతాలవారు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా ఇరిగేషన్ అధికారుల తీరుపై ఇప్పటికే విమర్శలున్నాయి. ఆండ్ర భూముల అక్రమణపై ఇదివరకే తహసీల్దార్‌కు లేఖ రాశామని ఇరిగేషన్ డీఈ రామునాయుడు ఈనెల 1న ఆంధ్రజ్యోతికి తెలపగా అటువంటిదేదీ తమకు అందలేదని తహసీల్దార్ అరుణకుమారి తేల్చిచెప్పారు.
- రిజర్వాయర్ భూముల్లో ఆక్రమణలు క్రమంగా విస్తరిస్తున్నాయి. అధికారులు ఇటువైపు చూడనందున కబ్జారాయుళ్లు దర్జాగా చెరబడుతున్నారు. దీన్ని ఇలాగే వదిలేస్తే రిజర్వాయర్ గర్భాన్ని కూడా కొల్లగొట్టినా ఆశ్చర్యపోనవసరం లేదని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఆక్రమణలు పెరిగితే నీటినిల్వ సామర్థ్యం కుచించుకుపోయి చివరి ఆయకట్టుకు నష్టం జరుగుతుందని వాపోతున్నారు. తక్షణమే ఇరిగేషన్ అధికారులు స్పందించి అక్రమణలపై కొరడా ఝళిపించాలని రైతులు కోరుతున్నారు.
రికార్డులు పరిశీలించి చర్యలు
ఆక్రమణల అంశాన్ని ఇరిగేషన్ జేఈ కృపానంద్ వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా తహసీల్దార్ లేఖ నేపథ్యంలో ఆండ్ర రిజర్వాయర్ భూముల రికార్డులను పరిశీలించాలని నిర్ణయించామని, అయితే అవి తమ డివిజన్ కార్యాలయంలో అందుబాటులో లేనందున ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. త్వరలో రెవెన్యూ శాఖతో సమస్వయం చేసుకుంటూ జాయింట్ సర్వే నిర్వహిస్తామని ఆయన తెలిపారు.