Why Gram Sabha? ఎందుకీ గ్రామసభ?
ABN , Publish Date - Sep 04 , 2025 | 12:14 AM
Why Gram Sabha? జిందాల్ భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం శృంగవరపుకోట మండలం మూలబొడ్డవర గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన గ్రామ సభ పస లేకుండా సాగింది. వినతుల స్వీకరణకే పరిమితమయ్యారు. జిందాల్ యాజమాన్యం నుంచి వచ్చిన ఇద్దరు ప్రతినిధులు దరఖాస్తులను నమోదు చేసుకోవడమే తమ పని అన్నవిధంగా మౌనం వహించారు.
ఎందుకీ గ్రామసభ?
భూ నిర్వాసితుల నుంచి దరఖాస్తుల స్వీకరణతో సరి
దరఖాస్తుల నమోదుకే పరిమితమైన జిందాల్ ప్రతినిధులు
ప్రభుత్వ చర్యలపై స్పష్టత కరవు
శృంగవరపుకోట, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి):
జిందాల్ భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం శృంగవరపుకోట మండలం మూలబొడ్డవర గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన గ్రామ సభ పస లేకుండా సాగింది. వినతుల స్వీకరణకే పరిమితమయ్యారు. జిందాల్ యాజమాన్యం నుంచి వచ్చిన ఇద్దరు ప్రతినిధులు దరఖాస్తులను నమోదు చేసుకోవడమే తమ పని అన్నవిధంగా మౌనం వహించారు. దీంతో ఈ సభ భూ నిర్వాసితులకు నిరాశ కలిగించింది. నిర్వాసిత రైతుల మనోభావాలను ప్రభుత్వం ముందు ఉంచుతానని విచారణ అధికారి మురళీ ప్రకటించారు.
భూమిని కోల్పోయిన ప్రతి రైతుకు ఆ భూమికి సమాన విలువ కలిగిన షేర్లు ఇస్తామన్న జిందాల్ యాజమాన్యం మోసం చేసిందని, పరిశ్రమను నిర్మించి ఉద్యోగ, ఉపాధి కల్పిస్తామని ఇచ్చిన మాట తప్పిందని పేర్కొంటూ తమ భూములను తిరిగి ఇచ్చేయాలన్న డిమాండ్‌తో కొంతకాలంగా భూ నిర్వాసిత రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ భూ నిర్వాసితులకు న్యాయం చేసేందుకు గ్రామ సభ ఏర్పాటు చేయించారు. వీరి సమస్యల పరిష్కారానికి కేఆర్‌సీసీ ప్రత్యేక ఉప కలెక్టర్ ఇ.మురళీని బుధవారం పంపించారు. జిందాల్ పరిశ్రమ యాజమాన్యం నుంచి కూడా ఇద్దరు ప్రతినిధులను పంపించారు. దీంతో భూ నిర్వాసితులు ఇప్పటికైనా న్యాయం జరుగుతుందని ఆశించారు. తమ డిమాండ్లన్నీ పరిష్కారమవుతాయని భావించారు. కానీ ఇందుకు విరుద్ధంగా బుధవారం నాటి సభ సాగింది. శృంగవరపుకోట మండలం మూలబొడ్డవర గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం నిర్వాసితులకు ఏమాత్రం సంతృప్తిని ఇవ్వలేదు.
ఎస్.కోట మండల పరిధిలోని చీడిపాలెం, చినఖండేపల్లి, కిల్తంపాలెం, మూలబొడ్డవర, ముషిడిపల్లి గ్రామాల పరిధిలో ఉన్న 382 మంది రైతుల నుంచి 834.66 ఎకరాలు అసైన్డ్ భూమి, 151.04 ఎకరాల ప్రభుత్వ భూమి, 180.73 ఎకరాల జిరాయితీ భూమిని 2007లో జెఎస్‌డబ్ల్యూ అల్యూమినియం లిమిటెడ్‌కు అప్పగించారు. ఈ పరిశ్రమను నాలుగేళ్లలో నిర్మిస్తామని అప్పట్లో పరిశ్రమ యాజమాన్యం చెప్పింది. భూములిచ్చిన రైతులకు నష్టపరిహారంతో సమానంగా ఉచితంగా షేర్లు ఇస్తామంది. మామిడి, జీడి, కొబ్బరి, అరటి తోటల పెంపకంతో జీవనాధారం పొందుతున్న వారికి వీరి మాటలు రుచించలేదు. దీంతో యాజమాన్యం స్థానిక రాజకీయ పార్టీలకు చెందిన నాయకులను రంగంలోకి దించింది. ఈ రైతుల్లో ఎక్కువ మంది గిరిజనులు. వీరికి స్థానిక నాయకులు నచ్చజెప్పడంతో ఇష్టలేకపోయినా భూములను ఇచ్చారు. భూములను తీసుకున్న యాజమాన్యం ఇంతవరకు పరిశ్రమను స్థాపించలేదు.
- కూటమి ప్రభుత్వం జిందాల్ భూముల్లో ఎంఎస్‌ఎంఈ పార్కుల నిర్మాణానికి అడుగులు వేస్తున్న తరుణంలో జిందాల్ భూ నిర్వాసితుల సమస్యలను జిల్లా స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుడు ఇందుకూరి రఘురాజు తెరపైకి తీసుకొచ్చారు. వీరికి ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ కూడా సహకరిస్తున్నారు. వీరి మద్దతుతో భూ నిర్వాసితులు రోడ్డెక్కారు. ఈ పరిస్థితిలో నిర్వాసిత రైతుల సమస్యలకు పరిష్కారం చూపాలని భావించి తాజాగా మూలబొడ్డవర గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన గ్రామ సభ ఎలాంటి భరోసా ఇవ్వలేదు.