Why build roads? రోడ్లు వేయరెందుకో?
ABN , Publish Date - Jun 10 , 2025 | 11:45 PM
Why build roads?బొబ్బిలిలో కీలక రహదారుల రూపు మారకపోవడంపై స్థానికులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. వాటిపై నిత్యం అగచాట్లు పడుతూ నరకయాతన అనుభవిస్తున్న వారి ఆవేదనకు అంతే లేదు. కూటమి ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్న పట్టణ వాసులు ఏడాదైనా.. నిధులొచ్చినా రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు.

రోడ్లు వేయరెందుకో?
ప్రశ్నిస్తున్న బొబ్బిలి పట్టణ ప్రజలు
ఇప్పటికే అసెంబ్లీ, డీఆర్‌సీలో ఎమ్మెల్యే ప్రస్తావన
రహదారులపై నరకయాతన పడుతున్న స్థానికులు
బొబ్బిలి, జూన్ 10(ఆంధ్రజ్యోతి):
బొబ్బిలిలో కీలక రహదారుల రూపు మారకపోవడంపై స్థానికులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. వాటిపై నిత్యం అగచాట్లు పడుతూ నరకయాతన అనుభవిస్తున్న వారి ఆవేదనకు అంతే లేదు. కూటమి ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్న పట్టణ వాసులు ఏడాదైనా.. నిధులొచ్చినా రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. బొబ్బిలి-రామభద్రపురం రాష్ర్టీయ రహదారి అత్యంత దయనీయంగా, ప్రమాదకరంగా తయారైంది. తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వేలాది వాహనాలు ఈ రోడ్డుపై రాకపోకలు సాగిస్తున్నాయి. ముఖ్యంగా గొర్లె సీతారాంపురం, రామభద్రపురం, పాతబొబ్బిలి గ్రామాల సమీపాల్లో రహదారి గోతులమయమైపోయింది. ద్విచక్ర వాహనదారులూ సవ్యంగా వెళ్లలేని దుస్థితి. ఈ రోడ్డు గురించి స్ధానిక ఎమ్మెల్యే బేబీనాయన అసెంబ్లీతో పాటు డీఆర్‌సీ సమావేశంలోనూ ప్రస్తావించారు. అయినా రోడ్డు నిర్మాణానికి అడుగులు పడడం లేదు. పారాది వంతెన దెబ్బతిన్న నేపథ్యంలో ఈ రహదారిలో వెళ్లే భారీ వాహనాలన్నింటినీ దారి మళ్లించారు. ఈ కారణంగా బొబ్బిలి-తెర్లాం రోడ్డు, పినపెంకి-ఆకులకట్ట రోడ్డు చిందరవందరగా తయారయ్యాయి. అలజంగి, కారాడ సమీపంలో ఆర్‌అండ్‌బీ రోడ్డు చూస్తే రక్తకన్నీరొస్తుందని వాహనదారులు నిప్పులు చెరుగుతున్నారు.
బొబ్బిలి పట్టణ పరిధిలో ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ నుంచి కాలేజీ రోడ్డులో పూల్‌బాగ్ మీదుగా గొల్లపల్లి బైపాస్ వరకు వెళ్లే రహదారి కూడా చాలా అధ్వానంగా తయారైంది. ఈ రోడ్డుకు మరమ్మతులు చేపడ్తామని చెప్పి వైసీపీ హయాంలో లక్షలాది రూపాయలను మంజూరు చేసి పనులు చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక సుమారు కోటిరూపాయలను బుడా నుంచి మంజూరు చేశారు. ఖర్చుచేసేందుకు ప్రభుత్వం ఇంకా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదు. విద్యాసంస్థలు తెరవనుండడంతో స్కూలు బస్సులు, ఆటోల్లో వెళ్లే తమ పిల్లలకు రక్షణ ఎలా అని తల్లిదండ్రులు వాపోతున్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చినా మారలేదు
పోల జగన్, రాష్ట్ర కొప్పలవెలమ సంక్షేమసంఘం ఉపాధ్యక్షుడు, బొబ్బిలి
రోడ్ల నిర్వహణ, మరమ్మతులు, నిధుల మంజూరు విషయంలో గత వైసీపీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించడం ప్రజలకు శాపంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోడ్లు బాగవుతాయని జనం ఆశపడ్డారు. అలా జరగలేదు. ప్రజలు నరకం చవిచూస్తున్నారు. ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎక్కడ లోపమో అర్థం కావడం లేదు.
బాగు అయ్యేవరకు విశ్రమించేది లేదు
బేబీనాయన ఎమ్మెల్యే , బొబ్బిలి
బొబ్బిలి నుంచి రామభద్రపురం రహదారి కోసం రూ.4.50 కోట్లు మంజూరయ్యాయి. ఈ లోగా అత్యవసర పనులు చేపట్టేందుకు కలెక్టర్ రూ.10 లక్షలు మంజూరు చేశారు. పూల్‌బాగ్ రోడ్డుకు రూ.1.15 కోట్లను బుడా నుంచి చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు మంజూరు చేశారు. ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తాం. ఏడాదిలో ఆర్‌అండ్‌బీ రోడ్లకు రూ.15 కోట్లు మంజూరయ్యాయి. టెండరు ప్రక్రియ తదితర లాంఛనాలు పూర్తయిన వెంటనే పనులు ప్రారంభమై శరవేగంతో జరుగుతాయి. రోడ్లు బాగు అయ్యేవరకు విశ్రమించేది లేదు.