Share News

Problems మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి?

ABN , Publish Date - Nov 04 , 2025 | 12:23 AM

Whom Should We Tell Our Problems To? సీతంపేట ఐటీడీఏలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)కు ఇన్‌చార్జి పీవో పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ అందుబాటులో ఉండడం లేదు. దీంతో గిరిజనులు, ప్రజా సంఘాల నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నిస్తున్నారు.

  Problems   మా సమస్యలు  ఎవరికి చెప్పుకోవాలి?
సీతంపేటలోని ఐటీడీఏ కార్యాలయం

  • కలెక్టరేట్‌లో ప్రత్యేక రెవెన్యూ గ్రీవెన్స్‌కు హాజరు

  • ఆవేదనలో గిరిజనులు

సీతంపేట రూరల్‌, నవంబరు3(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఐటీడీఏలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)కు ఇన్‌చార్జి పీవో పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ అందుబాటులో ఉండడం లేదు. దీంతో గిరిజనులు, ప్రజా సంఘాల నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నిస్తున్నారు. వ్యయ ప్రయాసలకు ఓర్చి సుదూర ప్రాంతాల నుంచి సీతంపేట ఐటీడీఏకు వస్తే ఇక్కడ తమ గోడును పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా 20సబ్‌ప్లాన్‌ మండలాల్లోని గిరిజనులు ప్రతి సోమవారం సీతంపేట ఐటీడీఏలో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌కు పెద్దఎత్తున వస్తుంటారు. తమ సమస్యలకు పరిష్కారం చూపుతారనే గంపెడాశతో వినతిపత్రాలు ఇస్తుంటారు. అయితే గడిచిన నాలుగు వారాలుగా ఐటీడీఏ ఇన్‌చార్జి పీవోగా ఉన్న పవార్‌స్వప్నిల్‌ జగన్నాథ్‌ పీజీఆర్‌ఎస్‌కు హాజరుకావడం లేదు. కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా నిర్వహించే రెవెన్యూ గ్రీవెన్స్‌కు హాజరవ్వడంతో ఇక్కడకు వచ్చే గిరిజనులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా సీతం పేట ఐటీడీఏలో ఏపీవో స్థాయి అధికారి మాత్రమే అందుబాటులో ఉంటున్నారు. దీంతో అధికారుల తీరుపై గిరిపుత్రులు పెదవి విరుస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు.

ఈ వారం హాజరు..

ఇదిలా ఉండగా ఈ సోమవారం ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌కు ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్‌ జగన్నాథ్‌ హాజరయ్యారు. దీంతో వినతులు పోటెత్తాయి. గత నాలుగు వారాలు పదుల సంఖ్యలో ఆర్జీలు రాగా నేడు 123 వినతిపత్రాలు వచ్చాయి. ఈ వారం కూడా ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో కలెక్టరేట్‌ రెవెన్యు గ్రీవెన్స్‌కు హాజరుకావాల్సి ఉండగా శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం లోని అధికారిక కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. దీంతో సోమవారం ఆయన సీతంపేట ఐటీడీఏలో మధ్యాహ్నం 12గంటల వరకు అందుబాటులో ఉన్నారు.

ఇన్‌చార్జి పీవో ఏమన్నారంటే ...

సీతంపేట ఐటీడీఏలో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌కు హాజరుకాకపోవడంపై ఇన్‌చార్జి పీవో పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ను వివరణ కోరగా.. కలెక్టర్‌ ఆదేశాల మేరకు పార్వతీపురం కలెక్టరేట్‌లో రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక గ్రీవెన్స్‌ నిర్వహిస్తున్నామన్నారు. దీంతో తాను అక్కడే ఉండాల్సి వస్తోందని సమాధానమిచ్చారు.

Updated Date - Nov 04 , 2025 | 12:23 AM