Who Knows What Happened? ఏమైందో ఏమో?
ABN , Publish Date - Dec 21 , 2025 | 12:28 AM
Who Knows What Happened? వారికి పెళ్లయి రెండు నెలలు కూడా కాలేదు. ఇంకా వారి కుటుంబాల్లో పెళ్లి ముచ్చట కూడా తీరలేదు. ఇంతలో ఘోరం జరిగిపోయింది. కోటి ఆశలతో నూతన జీవితంలోకి అడుగుపెట్టిన ఆ దంపతులిద్దరూ 56 రోజులకే విగతజీవులయ్యారు. రైలు నుంచి పడి గరుగుబిల్లి మండలంలోని రావుపల్లి గ్రామానికి చెందిన నవదంపతులు కోరాడ సింహాచలం (25), భవాని (19) మృతి చెందారు.
వివాహమై రెండు నెలలు కూడా కాని వైనం
తెలంగాణ రాష్ట్రం వంగపల్లి వద్ద ఘటన
స్వగ్రామం రావుపల్లిలో విషాదచాయలు
గరుగుబిల్లి, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): వారికి పెళ్లయి రెండు నెలలు కూడా కాలేదు. ఇంకా వారి కుటుంబాల్లో పెళ్లి ముచ్చట కూడా తీరలేదు. ఇంతలో ఘోరం జరిగిపోయింది. కోటి ఆశలతో నూతన జీవితంలోకి అడుగుపెట్టిన ఆ దంపతులిద్దరూ 56 రోజులకే విగతజీవులయ్యారు. రైలు నుంచి పడి గరుగుబిల్లి మండలంలోని రావుపల్లి గ్రామానికి చెందిన నవదంపతులు కోరాడ సింహాచలం (25), భవాని (19) మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. రావుపల్లికి చెందిన కోరాడ మచ్చెయ్య, గౌరమ్మ దంపతుల చిన్నకుమారుడు సింహాచలంకు జియ్యమ్మవలస మండలం అంకవరం గ్రామానికి భవానితో ఈ ఏడాది అక్టోబరు 22న పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. సింహాచలం హైదరాబాద్‌లోని ఓ రసాయన పరిశ్రమలో పని చేస్తున్నాడు. పెళ్లయిన తరువాత హైదరాబాద్ సమీప జగద్గిరిగుట్టలోని గాంధీనగర్‌లో భార్య భవానితో కలిసి నివసిస్తున్నాడు. అయితే, విజయవాడలోని తమ బంధువుల ఇంటికి వెళ్లేందుకు భార్యాభర్తలు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ రైలులో గురువారం రాత్రి బయలుదేరారు. రైలు తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి రైల్వే స్టేషన్ దాటిన తరువాత బోగి తలుపుల వద్ద ఉన్న సమయంలో ఇద్దరూ ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందారు. శుక్రవారం ఉదయం వీరి మృతదేహాలను రైల్వే పోలీస్ సిబ్బంది గుర్తించారు. వారివద్ద లభ్యమైన ఆధారాలను బట్టి సింహాచలం తల్లిదండ్రులు మచ్చెయ్య, గౌరమ్మకు సమాచారం అందించారు. నవదంపతుల మృతదేహాలు శనివారం సాయంత్రానికి రావుపల్లికి చేరుకున్నాయి. మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. సింహాచలం, భవాని మృతితో రావుపల్లి, అంకవరం గ్రామాల్లో విషాదచాయలు అలముకున్నాయి.
దంపతులిద్దరూ రైలులో ఘర్షణ పడినట్లు వీడియో వైరల్
దంపతులిద్దరూ సికింద్రాబాద్ నుంచి రైలులో బయలుదేరినప్పటినుంచి గొడవ పడుతుండటంతో రైల్లో ఉన్న మరో ప్రయాణికుడు వీడియో తీశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఓ న్యూస్ చానల్‌లో ప్రసారమవడంతో దంపతుల మృతిపై సందేహాలు తలెత్తుతున్నాయి. నవ దంపతులు ప్రమాదవశాత్తున జారిపడ్డారా? లేక ఇద్దరు గొడవపడి ఒకరి తర్వాత ఒకరు దూకి ఆత్మహత్య చేసుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.