Share News

టీడీపీ జిల్లా రథసారథి ఎవరో?

ABN , Publish Date - Aug 24 , 2025 | 12:33 AM

టీడీపీ జిల్లా రథసారథి ఎవరు.?. ప్రస్తుతం ఉన్న కిమిడి నాగార్జునకే మళ్లీ అవకాశం ఉంటుందా?.. లేక కొత్తవారికి చాన్స్‌ దక్కుతుందా? అన్నది త్వరలో అధిష్ఠానం నిర్ణయించనుంది.

టీడీపీ జిల్లా రథసారథి ఎవరో?

- 26న త్రీమెన్‌ కమిటీ రాక

- అదే రోజు ఎంపీ, ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులతో సమావేశం

- పార్టీ అధ్యక్షుడి ఎంపికపై తెలుసుకోనున్న అభిప్రాయాలు

- అధిష్ఠానానికి ఇవ్వనున్న ఆశావహుల జాబితా

విజయనగరం, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): టీడీపీ జిల్లా రథసారథి ఎవరు.?. ప్రస్తుతం ఉన్న కిమిడి నాగార్జునకే మళ్లీ అవకాశం ఉంటుందా?.. లేక కొత్తవారికి చాన్స్‌ దక్కుతుందా? అన్నది త్వరలో అధిష్ఠానం నిర్ణయించనుంది. దీనిపై జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు అధిష్ఠానం నియమించిన త్రీమెన్‌ కమిటీ ఈ నెల 26న జిల్లాకు రానుంది. పోటీలో ఉన్న ఆశావహుల జాబితాను అధిష్ఠానానికి సమర్పించనుంది.

కార్యవర్గాల ఎంపికపై దిశా నిర్దేశం

తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. గ్రామ, వార్డు, డివిజనల్‌, మండల, పట్టణ, నగర కమిటీలు, అనుబంధ కమిటీల ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఇక పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు, కార్యవర్గం, అనుబంధ సంఘాల కమిటీల ఎంపిక ప్రక్రియ ఈ నెలఖరులోగా ముగియనుంది. ఎంపికైన కమిటీలకు అధిష్ఠానం ఆమోదముద్ర వేసి, సెప్టెంబరు నెల 3న రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, ఇతర కార్యవర్గాలను అధికారికంగా ప్రకటించనుంది. జిల్లా స్థాయి కమిటీ అధ్యక్షుడు, ఇతర కార్యవర్గ సభ్యుల ఎంపిక, పార్టీ పరిస్థితులపై అంచనా వేసేందుకు ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ముగ్గురితో కూడిన (త్రీమెన్‌) కమిటీలను రాష్ట్ర టీడీపీ నియమించింది. ఈ త్రీమెన్‌ కమిటీలతో శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్‌, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ సమావేశమై కార్యవర్గాల ఎంపికపై దిశా నిర్దేశం చేశారు.

- విజయనగరం పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించి నియమించిన త్రీమెన్‌ కమిటీలో టీడీపీ సీనియర్‌ నాయకుడు మహ్మద్‌ అహ్మద్‌ షరీఫ్‌, పీజీవీఆర్‌ నాయుడు (గణబాబు), వాసంశెట్టి సుభాష్‌ ఉన్నారు. ఈ కమిటీ ఈ నెల 26న విజయనగరం రానుంది. టీడీపీ జిల్లా అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకోనుంది. ఆశావహుల జాబితాను పార్టీ రాష్ట్ర కమిటీకి నివేదించనుంది. ఈ మేరకు పార్టీ ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు నాగార్జున, ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజుతో పాటు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులకు రాష్ట్ర పార్టీ సమాచారం అందజేసింది.

ఎవరికి అవకాశం దక్కుతుందో?

టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుతం కిమిడి నాగార్జున ఉన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉంటూ, జిల్లాలో పార్టీని విజయతీరాలకు చేర్చడంలో ఆయన పాత్ర ప్రశంసనీయం. అయితే, జిల్లా అధ్యక్షుడిగా మళ్లీ ఆయనకే అధిష్ఠానం అవకాశం కల్పిస్తుందా? లేక కొత్తవారికి అవకాశం ఇస్తుందా? అన్నది వేచి చూడాలి. ఇక సుదీర్ఘకాలంగా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఐవీపీ రాజు, తిరిగి ప్రధాన కార్యదర్శిగా తననే కొనసాగించాలని కోరుతున్నారు. అయితే సుదీర్ఘకాలం పాటు ఆయన ఆ పదవిలో ఉండడంతో మరొకరికి అవకాశం కల్పించాలా? లేక అతన్నే కొనసాగించాలా?అన్నది విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఐవీపీ రాజు విజయనగరానికి చెందిన వారు కావడంతో ఎమ్మెల్యే అదితి నిర్ణయాన్ని అధిష్టానం పరిగణనలోకి తీసుకోనుంది. ఈ నెల 26న త్రీమెన్‌ కమిటీ ఆశావహుల జాబితాను తీసుకుని అధిష్టానానికి నివేదించనుంది. సెప్టెంబరు 3న అధిష్టానం అధికారికంగా ప్రకటించనుంది. ఆ తరువాత వారం రోజుల్లోగా కొత్త కమిటీలు బాధ్యతలు చేపట్టనున్నాయి.

Updated Date - Aug 24 , 2025 | 12:33 AM