Share News

who is not Beneficiaries అనర్హులెవరో!

ABN , Publish Date - Oct 11 , 2025 | 11:22 PM

who is not Beneficiaries జిల్లాలో మరోసారి దివ్యాంగ పింఛన్లపై తనిఖీలు జరుగుతున్నాయి. బోగస్‌ లబ్ధిదారులను మరింత స్పష్టంగా గుర్తించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఇప్పటికే 6,963 మందికి నోటీసులు ఇచ్చింది. వారు తమకు సూచించిన ఆస్పత్రికి వెళ్లి వైకల్య నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. వారంలో మూడురోజుల పాటు ఇందుకోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తోంది. ఈ ప్రక్రియ ఈ నెల 8న ప్రారంభమైంది. పరీక్షలు ముగిశాక దివ్యాంగ పింఛన్లలో అనర్హులెందరో తేలిపోనుంది.

 who is not  Beneficiaries అనర్హులెవరో!
జిల్లా కేంద్ర ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు(ఫైల్‌)

అనర్హులెవరో!

దివ్యాంగ పింఛనుదారులకు మరోసారి నిర్ధారణ పరీక్షలు

జూలైలో 6,963 మందికిపైగా నోటీసులు

వైకల్య నిర్ధారణ చేసుకోవాలని సూచన

వారంలో మూడురోజుల పాటు వైద్య శిబిరాలు

జిల్లాలో మరోసారి దివ్యాంగ పింఛన్లపై తనిఖీలు జరుగుతున్నాయి. బోగస్‌ లబ్ధిదారులను మరింత స్పష్టంగా గుర్తించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఇప్పటికే 6,963 మందికి నోటీసులు ఇచ్చింది. వారు తమకు సూచించిన ఆస్పత్రికి వెళ్లి వైకల్య నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. వారంలో మూడురోజుల పాటు ఇందుకోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తోంది. ఈ ప్రక్రియ ఈ నెల 8న ప్రారంభమైంది. పరీక్షలు ముగిశాక దివ్యాంగ పింఛన్లలో అనర్హులెందరో తేలిపోనుంది.

విజయనగరం, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి):

అర్హత లేకుండా దివ్యాంగ పింఛన్లు అందుకుంటున్న వారికి జూలైలో ప్రభుత్వం నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరికి పింఛన్లు నిలిపివేస్తారని వార్తలు వచ్చాయి కానీ ప్రభుత్వం నోటీసులు అందుకున్న వారికి మరోసారి వైకల్యం నిర్ధారించి అనర్హులని తేలిన తరువాతే పింఛన్లు నిలిపివేయాలని నిర్ణయించింది. జిల్లాలో 6,963 మంది వరకూ నోటీసులు అందుకున్న వారి జాబితాలో ఉన్నారు. వారందరికీ ఈ నెల 8 నుంచి తనిఖీలు ప్రారంభమయ్యాయి. ప్రతి బుధ, గురు, శుక్రవారాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఈసారి తక్కువగా వైకల్య నిర్ధారణ జరిగితే నిబంధనలను అనుసరించి పింఛన్లు నిలిపివేస్తారు.

కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్‌ మొత్తాన్ని పెంచిన సంగతి తెలిసిందే. దివ్యాంగులకు రూ.6 వేలు.. కండరాల బలహీనత, పక్షవాతం తదితర రుగ్మతలతో బాధపడుతున్నవారికి రూ.10 వేలు, దీర్ఘకాలిక వ్యాధులకు గురై మంచం పట్టిన వారికి రూ.15 వేలకు పెంచుతూ ప్రభుత్వం అందిస్తోంది. జిల్లాలో మంచానికే పరిమితమైనవారు 342 మంది ఉన్నారు. వీరిలో చాలామంది అనర్హులు ఉన్నట్టు ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలోనే వీరికి తనిఖీలు చేశారు. వైకల్య నిర్ధారణ పరీక్షల్లో తక్కువ శాతం వచ్చిన వారికి నోటీసులిచ్చారు. జూలై నెలలో వీరి పింఛన్లు నిలిచిపోతాయని అంతా భావించారు. అయితే వారిలో అర్హులూ ఉన్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతో మరోసారి తనిఖీలు చేసి నిర్ధారించాకే పింఛను ఆపాలని నిర్ణయించింది. ప్రస్తుతం వారంలో మూడురోజులు నిర్థారణ పరీక్షలు జరుగుతున్నాయి.

అర్హులకు దక్కాలనే..

జిల్లాలో రూ.6 వేలు పింఛన్‌ మొత్తాన్ని అందుకున్న లబ్ధిదారుల సంఖ్య 36,974 మంది. ఆర్థో కేటగిరిలో 17,212, చూపు లోపంతో 7,038, వినికిడిలోపంతో 5,270, ఎంఆర్‌లో 4,495, ఎంఐలో 803, మల్టీపుల్‌ కేటగిరిలో 2,156 మంది పింఛన్‌ లబ్ధిదారులు ఉన్నారు. వీరందరిలో అనర్హులు ఉన్నట్టు ఆరోపణలున్నాయి. ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలు డ్రైవింగ్‌ చేస్తున్న వారు సైతం దివ్యాంగ పింఛన్లు పొందుతున్నారన్న ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. ఈ నేపథ్యంలో జనవరి నుంచి మార్చి వరకూ వీరికి పరీక్షలు నిర్వహించారు. ప్రతి ఒక్కరికీ ఇందుకు నిర్దిష్ట సమయం ఇచ్చారు. అయితే చాలా మంది అనుమానంతో ఈ పరీక్షలకు హాజరుకాలేదు. అటువంటి వారి పింఛన్లను హోల్డ్‌లో పెట్టారు. అలాగే నిర్థారణ పరీక్షలకు అప్పట్లో హాజరై తక్కువ శాతం వైకల్యం నమోదైన వారికి మరోసారి అప్పీల్‌ చేసుకునే అవకాశమిచ్చారు. అటువంటి వారికి ఇప్పడు నిర్థారణ పరీక్షలు జరుగుతున్నాయి.

పక్కాగా తనిఖీ..

దివ్యాంగ పింఛన్ల తనిఖీని పక్కాగా చేపట్టాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేశాం. ప్రత్యేక వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. అర్హులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు. లబ్ధిదారులు తమ వివరాలను అందించాలి. బోగస్‌ పింఛన్లు లేకుండా చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వం ఈ విషయంలో చిత్తశుద్ధితో ముందుకెళుతోంది. లబ్ధిదారులు సహకరించాలి.

కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి

వైద్య పరీక్షలు ప్రారంభం

ఐదు ఆసుపత్రుల్లో డిసెంబరు వరకు తనిఖీలు

విజయనగరం కలెక్టరేట్‌, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): నోటీసులు అందుకున్న దివ్యాంగుల పింఛన్‌దారులకు జిల్లాలోని ఐదు ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. అప్పీల్‌ చేసుకున్నవారంతా షెడ్యూల్‌ ప్రకారం వారికి కేటాయించిన ఆసుపత్రులకు వెళ్లాలి. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో శుక్రవారం జరిగిన ప్రక్రియను డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌రావు పర్యవేక్షించారు. వారంలో బుధవారం నుంచి శుక్రవారం వరకూ మూడు రోజులు పాటు ఆయా ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 1536 మంది, ఎస్‌.కోట ఏరియా ఆసుపత్రిలో 562 మంది, రాజాం ఏరియా ఆసుపత్రిలో 1311, గజపతినగరం ఆసుపత్రిలో 1187, చీపురుపల్లి ఆసుపత్రిలో 648 మందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. రోజుకు 200 మంది చొప్పున పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ డిసెంబరు వరకూ కొనసాగనుంది. పరీక్షల అనంతరం సెర్ప్‌ కార్యాలయానికి నివేదిక చేరుతుంది. తరువాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - Oct 11 , 2025 | 11:22 PM