Share News

మొక్కజొన్న కొనేదెవరు?

ABN , Publish Date - Oct 14 , 2025 | 11:57 PM

మండలంలో ప్రధాన పంట వరి. రెండో ప్రాధాన్యతగా పత్తిని రైతులు సాగు చేస్తుంటారు.

మొక్కజొన్న కొనేదెవరు?
ఎండబెట్టిన మొక్కజొన్న గింజలు

- భామినిలో విస్తారంగా సాగు

- చేతికందిన పంట

- కొనుగోలుదారులు లేక రైతుల దిగాలు

భామిని, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): మండలంలో ప్రధాన పంట వరి. రెండో ప్రాధాన్యతగా పత్తిని రైతులు సాగు చేస్తుంటారు. అయితే, ఈ ఏడాది ఖరీఫ్‌లో రైతులు పత్తికి బదులు మొక్కజొన్న సాగుకు మొగ్గుచూపారు. ఘనసర, సతివాడ, చిన్నదిమిలి, బాలేరు, దిమ్మిడిజోల, భామిని, పసుకుడి, సింగిడి, బిల్లుమడ తదితర గ్రామాల్లో సుమారు 1500 ఎకరాల్లో మొక్కజొన్న సాగులో ఉంది. వాతావరణం అనుకూలంగా లేకపోయినా ఎలాగో నెట్టుకొచ్చారు. ఇటీవల భారీ వర్షాలకు పంట నేలమట్టమైంది. దీంతో గింజలకు మొలకలు వస్తాయనే భయంతో రైతులు ఆదరాబాదరాగా పంటను సేకరించారు. యంత్రాల ద్వారా పిక్కలు సేకరించి వీధులు, రోడ్లపై ఆరబెడుతున్నారు. అయితే, ఇప్పటికీ పంట అమ్ముడుకాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలుదారులు ఎవరూ ముందుకు రావడం లేదని వారు దిగులు చెందుతున్నారు. ప్రస్తుతం వాతావరణంలో మార్పులతో మబ్బులు వేస్తున్నాయని, ఏ క్షణంలోనైనా వర్షం వచ్చి గింజలు తడిచిపోతాయేమోనని ఆందోళనగా ఉందని రైతులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మద్దతు ధరతో మొక్కజొన్నను కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Updated Date - Oct 14 , 2025 | 11:58 PM