Who are the millionaires? ఎవరు కోటీశ్వరులు?
ABN , Publish Date - Oct 11 , 2025 | 11:26 PM
Who are the millionaires? గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు సంకల్పించాయి. ఇందుకోసం స్వచ్ఛత అవార్డుల పేరిట నజరానా ప్రకటించాయి. తొమ్మిది అంశాలలో పురోగతి సాధించిన పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం రూ.కోటి ఇవ్వనుంది. పంచాయతీలలో ఏయే అంశాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలో ఇప్పటికే ప్రకటించింది. ఈ భారీ ప్రోత్సాహకాన్ని పంచాయతీలు పొందేందుకు వీలుగా సర్పంచిలు, ఎంపీటీసీ సభ్యులకు ప్రభుత్వం శిక్షణ కూడా ఇవ్వనుంది.
ఎవరు కోటీశ్వరులు?
ప్రత్యేకత చాటితే రూ.కోటి పొందవచ్చు
అభివృద్ధి పంచాయతీలకు కేంద్రం నజరానా
తొమ్మిది అంశాలలో పరిశీలన
రాజాం రూరల్, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు సంకల్పించాయి. ఇందుకోసం స్వచ్ఛత అవార్డుల పేరిట నజరానా ప్రకటించాయి. తొమ్మిది అంశాలలో పురోగతి సాధించిన పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం రూ.కోటి ఇవ్వనుంది. పంచాయతీలలో ఏయే అంశాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలో ఇప్పటికే ప్రకటించింది. ఈ భారీ ప్రోత్సాహకాన్ని పంచాయతీలు పొందేందుకు వీలుగా సర్పంచిలు, ఎంపీటీసీ సభ్యులకు ప్రభుత్వం శిక్షణ కూడా ఇవ్వనుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన నిర్దేశకాల మేరకు ప్రగతి సాధించిన పంచాయతీలు తమ పంచాయతీలో చేపట్టిన అభివృద్ధిని డాక్యుమెంటరీ రూపంలో చిత్రీకరించి జిల్లా పంచాయతీ అధికారికి అందజేయాల్సి ఉంటుంది. వీటిని పరిశీలించిన డీపీవో కార్యాలయ అధికారులు కొన్నింటిని ఎంపిక చేసి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు నివేదిస్తారు. కేంద్ర, రాష్టస్థాయిల్లో అధికార యంత్రాంగం సంతృప్తి చెందితే ఎంపికైన గ్రామాలకు కేంద్రప్రభుత్వం రూ.కోటి అందజేస్తుంది.
జిల్లాలో 777 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖలు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేశాయి. స్థానిక అవసరాలు, భౌగోళిక అంశాలకు తగ్గట్టుగా ప్రత్యేకతను చాటుకోవడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన తొమ్మిది అంశాలను పరిగణనలోకి తీసుకుని పంచాయతీలకు పురస్కారాలు ప్రకటించనున్నారు. కేంద్రం అందించే ఈ నజరానాను అంది పుచ్చుకునేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులను సమాయత్తం చేస్తున్నారు. జిల్లా పంచాయతీ అధికారులు సైతం మండలాల్లోని ఈఓపీఆర్‌డిలకు ఆదేశాలిస్తూ అమలుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఆ తొమ్మిది అంశాలివిగో....
- గ్రామ పంచాయతీలో పేదరికం లేని జీవనోపాధి పెంపొందించడం
- ప్రజా ఆరోగ్యం, శ్రేయస్సును మెరుగుపరిచే కార్యక్రమాలు నిర్వహించడం
- పిల్లల సంరక్షణ, అభివృద్ధికి అనుకూలమైన వాతావరణం సృష్టించడం
- ప్రజలకు స్వచ్ఛమైన నీటిని పుస్కలంగా అందుబాటులోకి తేవడం
- గ్రామాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంగా ఉంచడం
- మౌలిక సదుపాయాల అభివృద్ధి
- గ్రామంలో సామాజిక న్యాయాన్ని సురక్షిత వాతావరణంలో నెలకొల్పడం
- శాంతియుతమైన, న్యాయమైన, బలమైన సంస్థలతో సుపరిపాలన
- పంచాయతీలో అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం తదితర అంశాలు
పంచాయతీల అభివృద్ధికి ప్రోత్సాహకం
డీవీ మల్లిఖార్జునరావు, జిల్లా పంచాయతీ అధికారి
గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయడంతో పాటు ఆరోగ్యవంతమైన, ఆహ్లాదరకరమైన వాతావరణం నెలకొల్పేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛత అవార్డులు ప్రకటించాయి. తొమ్మిది అంశాలను ప్రాతిపదికగా తీసుకుని పంచాయతీలను ఎంపికచేస్తారు. నిర్దేశించిన అంశాలవారీగా అభివృద్ధి జరిగిన పంచాయతీలు డాక్కుమెంటరీ తీసి తమ కార్యాలయానికి పంపించాలి. వాటిని పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా ఉన్న డాక్యుమెంటరీలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తాం.
-----------------------------