Share News

స్నానానికి దిగి.. రబ్బర్‌ డ్యాంలో గల్లంతై

ABN , Publish Date - Nov 23 , 2025 | 10:57 PM

వారంతా స్నేహితులు. ముందురోజు జరిగిన తన మిత్రుడి వివాహంలో అంతా కలిసి సందడి చేశారు.

స్నానానికి దిగి.. రబ్బర్‌ డ్యాంలో గల్లంతై
గల్లంతై గోవిందనాయుడు ,శరత్‌కుమార్‌ , ప్రదీప్‌

- నీటిలో కొట్టుకుపోయిన ముగ్గురు యువకులు

- గాలిస్తున్న పోలీసు, అగ్నిమాపక సిబ్బంది

- సివిని గ్రామంలో విషాదఛాయలు

కొమరాడ, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): వారంతా స్నేహితులు. ముందురోజు జరిగిన తన మిత్రుడి వివాహంలో అంతా కలిసి సందడి చేశారు. మరుసటి రోజు సరదాగా స్నానం చేసి వద్దామని గ్రామానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న జంఝావతి రబ్బర్‌ డ్యాం వద్దకు వెళ్లారు. ముందుగా నీటిలోకి దిగిన ఓ యువకుడు వరద ప్రవాహానికి కొట్టుకుపోతుండగా, మరో ఇద్దరు కాపాడే ప్రయత్నం చేశారు. అయితే, మొత్తం ముగ్గురు కూడా గల్లంతయ్యారు. ఈ ఘటన ఆదివారం కొమరాడ మండలం రాజలక్ష్మీపురం వద్దనున్న జంఝావతి రబ్బరు డ్యాం వద్ద చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. కొమరాడ మండలం సివిని గ్రామానికి చెందిన అధికారి గోవిందనాయుడు (38), అరసాడ ప్రదీప్‌ (29), రాయగడ శరత్‌కుమార్‌ (17)తో పాటు మరో ఐదుగురు స్నేహితులు ఆదివారం మధ్యాహ్నం రబ్బర్‌ డ్యాంను చూసేందుకు వెళ్లారు. సరాదాగా స్నానం చేసేందుకు ముందుగా శరత్‌ నీటిలో దిగగా వరద ఉధృతికి కొట్టుకుపోతుండడాన్ని గోవిందనాయుడు, ప్రదీప్‌ చూసి కాపాడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ముగ్గురు కూడా గల్లంతవడంతో మిగిలిన స్నేహితులు ఏమిచేయాలో తెలియక ఆర్తనాదాలు పెట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గల్లంతైన వారి కోసం వెతికినా ఎలాంటి ఆచూకీ లభ్యంకాలేదు. వరద ఉధృతి అధికంగా ఉండడంతో ఇరిగేషన్‌ సిబ్బంది నీటిని వ్యవసాయ పొలాలకు వెళ్లే ప్రధాన కాలువ గుండా మళ్లించి గాలింపు చర్యలు చేపడుతున్నారు.

గ్రామంలో విషాదం..

ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు గల్లంతుకావడంతో గ్రామస్థులంతా విషాదంలో మునిగిపోయారు. వీరి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గోవిందనాయుడు తన గ్రామంలో వెల్డింగ్‌షాప్‌ పెట్టుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తండ్రి చనిపోగా, తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలు రెండో తరగతి, మూడో తరగతి చదువుతున్నారు. శరత్‌కుమార్‌ పార్వతీపురం పట్టణంలోని ఆర్కే జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నాడు. తండ్రి ట్రాక్టర్‌ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అన్నయ్య తుశాంత్‌ ఉన్నాడు. ఇద్దరూ ఒకే కళాశాలలో ఒకే తరగతి చదువుతున్నారు. ప్రదీప్‌ మచిలీపట్నంలో రొయ్యల చెరువులో పనిచేస్తున్నాడు. తండ్రి వ్యవసాయ కూలి కాగా, అన్నయ్య విశాఖపట్నంలో ప్రైవేటు ఉద్యోగం, చెల్లి ఊరిలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. స్నేహితుని వివాహం కోసం ప్రదీప్‌ స్వగ్రామానికి వచ్చి గల్లంతుకావడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.

మంత్రుల ఆరా

పార్వతీపురం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): కొమరాడ మండలంలో రబ్బరు డ్యాం వద్ద ముగ్గురు యువకులు గల్లంతు కావడంపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డితో మంత్రులు మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.

Updated Date - Nov 23 , 2025 | 10:57 PM