Which Are the Two Colleges ప్రతి మండలంలో రెండు కళాశాలలు ఏవీ?
ABN , Publish Date - Apr 27 , 2025 | 12:00 AM
Which Are the Two Colleges in Each Mandal? గత మూడేళ్లుగా పదో తరగతి ఉత్తీర్ణతలో జిల్లా సత్తా చాటుతోంది. రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలుస్తోంది. ఏటా టెన్త్ పాసైన విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. అయితే ఆ స్థాయిలో జిల్లాలో ఇంటర్ కళాశాలలు పెరగడం లేదు. గురుకుల కళాశాలల్లో సీట్లు కూడా పెంచడం లేదు. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు.
బాలురు, బాలికలకు వేర్వేరుగా జూనియర్ కాలేజీలంటూ ప్రకటన
ప్రతిపాదనలు పంపినా చర్యలు శూన్యం
కేజీబీవీల అప్‌గ్రేడేషన్.. హైస్కూళ్ల ప్లస్‌తోనే సరి
గురుకులాల్లోనూ పెంచని సీట్లు
ఏటా విద్యార్థులకు తప్పని ఇబ్బందులు
ఇంటర్ విద్యకు అవస్థలు
రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని విన్నపం
పార్వతీపురం, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): గత మూడేళ్లుగా పదో తరగతి ఉత్తీర్ణతలో జిల్లా సత్తా చాటుతోంది. రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలుస్తోంది. ఏటా టెన్త్ పాసైన విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. అయితే ఆ స్థాయిలో జిల్లాలో ఇంటర్ కళాశాలలు పెరగడం లేదు. గురుకుల కళాశాలల్లో సీట్లు కూడా పెంచడం లేదు. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతి మండలంలో రెండు జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తామని గత వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. బాలురు, బాలికలకు వేర్వేరు కాలేజీలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు 2023లో జిల్లా నుంచి అధికారులు ప్రతిపాదనలు పంపినప్పటికీ కొత్తగా ఒక్క జూనియర్ కళాశాలను కూడా ఏర్పాటు చేయలేదు. కేజీబీవీలను మాత్రమే అప్‌గ్రేడ్ చేసింది. రెండు హైస్కూళ్లను ప్లస్‌గా మార్చి చేతులు దులుపుకుంది. దీంతో కొన్ని మండలాల్లో విద్యార్థులు వేరే మండలాలకు వెళ్లి ఇంటర్ చదువుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని జిల్లావాసులు కోరుతున్నారు.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో 14 ప్రభుత్వ జూనియర్ కాలేజీలున్నాయి. కేజీబీబీలు 14, ఏపీఎస్‌డబ్ల్యూఆర్ కాలేజీలు 5, మోడల్ స్కూళ్లు 4, ఏపీటీబ్ల్యూఆర్ కాలేజీలు 9, హైస్కూల్ ప్లస్‌లు 2 ఉన్నాయి. ప్రైవేట్ జూనియర్ కళాశాలలు 34 వరకూ ఉన్నాయి. కాగా ఈ ఏడాది 9,659 మంది విద్యార్థులు పాసయ్యారు. వారిలో 8,639 మంది అత్యధిక మార్కులు పొందారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలతో పాటు మధ్యాహ్న భోజనం కూడా అందిస్తోంది. కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తోంది. ఈనేపథ్యంలో అత్యధిక విద్యార్థులు ఈ ఏడాది ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనే చేరే అవకాశం ఉంది.
రెసిడెన్షియల్ కళాశాలలు లేక..
ఆశ్రమ పాఠశాలల్లో టెన్త్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఎక్కువగా రెసిడెన్షియల్ కళాశాలల వైపే చూస్తుంటారు. అయితే జిల్లాలో రెసిడెన్షియల్ కళాశాలలు లేకపోవడం వల్ల చాలామంది ఇంటర్ చదువుకు దూరమవుతున్నారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ప్రైవేట్ కళాశాలల్లో చేరలేక.. దూరభారం తదితర కారణాలతో ఉన్నత విద్యను కొనసాగించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆశ్రమ పాఠశాలలనే రెసిడెన్షియల్ కశాలలుగా అప్ గ్రేడ్ చేస్తే గిరిజన విద్యార్థుల ఇక్కట్లు తప్పుతాయి. ఇంటర్, డిగ్రీ చదివే అవకాశం దక్కుతుంది. ఏజెన్సీలో మరింతగా విద్యాభివృద్ధి జరుగుతుంది. ఈ ఏడాది పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిధిలో 2,218 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాయగా 2,150 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 2,021 అత్యధిక మార్కులు సంపాదించారు. ఇటువంటి పరిస్థితుల్లో వారు చదువుకున్న ఆశ్రమ పాఠశాలలోనే ఇంటర్ చదువుకొనే అవకాశం కల్పించాలని గిరిజన సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
అదనపు సీట్లు ఎంతో అవసరం...
గురుకుల కళాశాలల్లో అదనపు సీట్లు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని గురుకులాల్లో 600 సీట్లు, సీతంపేట ఐటీడీఏలో 310 సీట్లు మాత్రమే ఉన్నాయి. గురుకుల పాఠశాలల్లో పదో తరగతి పాసైన విద్యార్థులకే ఈ సీట్లు చాలవు. మరి ఆశ్రమ పాఠశాల ‘పది’ పాసైన విద్యార్థుల పరిస్థితేమిటో అధికారులే చెప్పాల్సి ఉంది.