మా భూములు తీసుకుంటే ఎక్కడకు పోవాలి
ABN , Publish Date - Aug 13 , 2025 | 12:17 AM
అభివృద్ధి పేరుతో తమ భూములను తీసేసుకుంటే తాము ఎక్కడకు పోవాలని మండలంలోని సంతపాలెం, దెందేరు, గులివిందాడ, చీపురువలస, చీడివలస, సుందరయ్యపేట, గొల్లలపాలెం, వియ్యంపేట, దేవాడ, నరపాం, వీరభద్రపురం గ్రామాల రైతులు హెచ్‌పీసీఎల్ అధికారులను నిలదీశారు.
హెచ్‌పీసీఎల్ అధికారులను నిలదీసిన వివిధ గ్రామాల రైతులు
కొత్తవలస, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి పేరుతో తమ భూములను తీసేసుకుంటే తాము ఎక్కడకు పోవాలని మండలంలోని సంతపాలెం, దెందేరు, గులివిందాడ, చీపురువలస, చీడివలస, సుందరయ్యపేట, గొల్లలపాలెం, వియ్యంపేట, దేవాడ, నరపాం, వీరభద్రపురం గ్రామాల రైతులు హెచ్‌పీసీఎల్ అధికారులను నిలదీశారు. మండలంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న హెచ్‌పీసీఎల్ పైప్‌లైన్‌కు సంబంధించి భూసేకరణకు నిర్వహిస్తున్న సర్వే పనులపై ఈ గ్రామాలకు చెందిన రైతులు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ సుధాసాగర్ ఆధ్వర్యంలో రైతులతో సమావేశం నిర్వహించారు. హెచ్‌పీసీఎల్ పైప్‌లైన్ కోసం తమ భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేమని రైతులు తేల్చి చెప్పారు. ఇప్పటికే పోలవరం కాలువ నిర్మాణానికి, ఐవోసీ పైప్‌లైన్ కోసం, గ్రీన్‌ఫీల్డ్ హైవే కోసమని, విశాఖ నుంచి అరుకు వరకు వేస్తున్న 516బీ హైవే కోసమని భూములను సేకరించుకుంటూ పోతే తమకు ఏం భూములు ఉంటాయని రైతులు అధికారులను నిలదీశారు. సేకరించిన భూములకు సరైన ధర ప్రకారం నష్ట పరిహారం ఇవ్వడం లేదన్నారు. పైప్‌లైన్ల కోసం సేకరిస్తున్న భూములకు మరీ దారుణంగా నష్టపరిహారం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూములు కోల్పోయిన వారికి ఉపాధి అవకాశాలను కల్పించాలని కోరారు. హైవే పక్క నుంచి పైపులైన్ వేసుకుంటే ఎవరికీ నష్టం ఉండదని రైతులు ప్రతిపాదన చేయగా, అందుకు అధికారులు తిరష్కరించారు.
113 గ్రామాల్లో భూసేకరణ
హెచ్‌పీసీఎల్‌కు చెందిన చీఫ్ ఇంజనీర్ జి.కిషోర్ మాట్లాడుతూ ఈ పైప్‌లైన్ మూడు రాష్ట్రాల మీదుగా రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు సంబంధించి 30 మండలాలోని 113 గ్రామాలలో భూసేకరణ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 164 కిలో మీటర్ల మేర ఈ పైప్‌లైన్ ఉంటుందన్నారు. ప్రోజెక్టు కోసం 12 మీటర్లు వెడల్పు గల భూమిని సేకరిస్తామని చెప్పారు. ఏడున్నర అడుగుల లోతులో 14 ఇంచీల వెడల్పుతో స్టీల్ పైప్ వేస్తారని చెప్పారు. అభివృద్ధిని అడ్డుకోకుండా రైతులు సహకరించాలని కోరారు. పైప్‌లైన్ వేసిన తర్వాత ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా, పెద్ద పెద్ద వృక్షాలు పెంచకుండా వ్యవసాయాన్ని చేసుకోవచ్చునని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్‌పీసీఎల్ సలహాదారు జి.అప్పలనాయుడు, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి డేగల అప్పలరాజు పాల్గొన్నారు.