Share News

Where is 'welfare'? ‘సంక్షేమం’ ఏదీ?

ABN , Publish Date - Aug 06 , 2025 | 12:21 AM

Where is 'welfare'? సంక్షేమ వసతిగృహాలు ఇంకా గాడిన పడలేదు. చాలాచోట్ల శిథిల భవనాల్లోనే విద్యార్థులు ఉంటున్నారు. చాలీచాలని గదుల్లో సర్దుకుపోతున్నారు. మరుగుదొడ్లు సరిపోక అవస్థలు పడుతున్నారు. వైసీసీ ప్రభుత్వం వీటిని పూర్తిగా గాలికి వదిలేసింది.

Where is 'welfare'? ‘సంక్షేమం’ ఏదీ?
రేకుల షెడ్‌లో ఎస్‌.కోట బీసీ వెల్ఫేర్‌ కళాశాల బాలుర వసతిగృహం

‘సంక్షేమం’ ఏదీ?

ఇంకా గాడిలో పడని వసతి గృహాల నిర్వహణ

గాలికి వదిలేసిన వైసీపీ ప్రభుత్వం

శిథిలావస్థకు చేరిన భవనాలు

ప్రహరీలు కరువు.. చాలని మరుగుదొడ్లు

మెరుగుపడాలన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం

- శృంగవరపుకోట గిరిజన కళాశాల వసతిగృహంలో 270 మందికి పైగా విద్యార్థులుంటున్నారు. వసతి, మరుగుదొడ్లు చాలడం లేదు. భవనాలు పాడయ్యాయి. అయినా చేసేది లేక వారు సర్దుకుపోతున్నారు.

- ఎస్‌.కోట గిరిజన బాలిక వసతిగృహానికి ప్రహరీ లేదు. 200 మందిపైగా విద్యార్థినులు ఉంటున్నారు. 2023లో వారు ఆందోళనకు దిగడంతో ప్రహరీ పనులు చేపట్టారు. సగం కూడా నిర్మించకుండానే వదిలేశారు. ఎవరుపడితే వారు లోపలకు వస్తున్నారని పలుమార్లు బాలికలు ఫిర్యాదు చేశారు. అయినా చర్యలు లేవు.

- నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ రైట్స్‌(ఎన్‌సీపీసీఆర్‌) మార్గదర్శకాల ప్రకారం విద్యార్థులకు శుభ్రమైన తాగునీరు, పౌష్టికాహారం, బెడ్లు, బెడ్‌సీట్లు, మరుగుదొడ్లు, బాత్‌ రూంలు, ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. వసతిగృహాలను మెరుగుపరిచే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఆయా శాఖల ముఖ్యకార్యదర్శులు బాధ్యులు కాక తప్పదు. జిల్లా స్థాయిలో సీనియర్‌ అధికారులు క్రమం తప్పకుండా వసతి గృహాలను తనిఖీ చేయాలి.

- వసతిగృహాల దుస్థితిని పరిశీలించిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం జూలై నెలలో ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)విజయానంద్‌కు చేసిన సూచనిది.

శృంగవరపుకోట, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి):

సంక్షేమ వసతిగృహాలు ఇంకా గాడిన పడలేదు. చాలాచోట్ల శిథిల భవనాల్లోనే విద్యార్థులు ఉంటున్నారు. చాలీచాలని గదుల్లో సర్దుకుపోతున్నారు. మరుగుదొడ్లు సరిపోక అవస్థలు పడుతున్నారు. వైసీసీ ప్రభుత్వం వీటిని పూర్తిగా గాలికి వదిలేసింది. ఆ ఐదేళ్లలో మౌలిక వసతులు కూడా పట్టించుకోలేదు. విద్యార్థులు ఆందోళన చేసిన సమయంలో మొక్కబడిగా పనులు మొద లెట్టడం, మధ్యలో వదిలేయడం చేశారు. దీంతో చాలా చోట్ల భవనాలు పాడయ్యాయి. కళాశాల వసతిగృహాలకు శాశ్వత భవనాలు కూడా నిర్మించలేదు. చాలీచాలని అద్దెభవనాల్లో నడిపేశారు. కొన్ని ప్రాంతాల్లో హాస్టళ్లు రేకుల షెడ్లలో నడుస్తున్నాయి. సొంత భవనాలతో పాటు అద్దెభవ నాల్లోనూ సరైన వసతులు లేక విద్యార్థులు అసంతృప్తితో ఉంటున్నారు.

జిల్లాలో వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ (బీసీ)కు చెందిన 29 ప్రీమెట్రిక్‌ బాలుర వసతి గృహాల్లో 1251 మంది విద్యార్థులు చదువుతున్నారు. 36 పోస్ట్‌మెట్రిక్‌ వసతి గృహాల్లో 1473 మంది విద్యార్థులు ఉంటున్నారు. సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన 12ప్రీమెట్రిక్‌ బాలుర వసతి గృహల్లో 654మంది, 2 బాలికల వసతిగృహాల్లో 115 మంది ఉండగా ఇవన్నీ ప్రభుత్వ భవనాల్లోనే నడుస్తున్నాయి. ఆరు గిరిజన సంక్షేమ శాఖ బాలుర ఆశ్రమ పాఠశాలల్లో 920 మంది, 2బాలికల ఆశ్రమ పాఠశాలల్లో 730 మంది చదువుతున్నారు. అయితే వీటన్నింటికీ ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. సౌకర్యాలు మాత్రం అంతంతే. దీంతో అవస్థలు పడుతూనే పేదలు కావడంతో సర్దుకుపోతున్నారు.

శృంగవరపుకోట పట్టణంలోని గిరిజన సంక్షేమ శాఖకు చెందిన పోస్ట్‌ మెట్రిక్‌ బాలికల, బాలుర వసతి గృహాలు ప్రభుత్వ భవనాల్లోనే నడుస్తున్నాయి. వీటిల్లో కనీస వసతులు లేవు, ప్రహరీ లేకపోవడంతో రాత్రి సమయంలో విద్యార్థులు భయపడుతున్నారు. సరిపడా భవనాలు లేక చదువుకు ఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్లు అరకొరగానే నిర్మించారు. ఈ రెండు వసతి గృహాలను మండల న్యాయ సేవాధికార సంస్థ అధికారి నెల రోజుల క్రితం పరిశీలించారు. పలు సమస్యలను గుర్తించారు. ఇక సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖకు చెందిన వసతి గృహాలు అద్దెభవనాల్లో ఉన్నాయి. రేకుల రూములు, ఇరుకు గదులతో నడుస్తున్నాయి. ఇలా జిల్లా అంతటా ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. చాలా భవనాలు శిథిలావస్థకు చేరాయి. ప్రమాదకరంగా మారాయి. కనీస మరమ్మతులు లేక గదుల్లో గచ్చులు, గోడలు పెచ్చులు ఊడిపోతున్నాయి. కొన్నిచోట్ల విద్యార్థులు నేలపై పడుకుంటున్నారు. రక్షత నీటి సరఫరా లేని వసతిగృహాలకు కొదవ లేదు. వంట గదులు అధ్వానంగా కనిపిస్తున్నాయి. ఇలా సంక్షేమ వసతి గృహాలన్నీ సమస్యల వలయంలో ఉన్నాయి.

ఆ ప్రభుత్వం పట్టించుకోకే..

గత ప్రభుత్వం ఐదేళ్ల పాటు వీటిపై కన్నెత్తి చూడలేదు. భవనాల మరమ్మతులకు దమ్మిడి కూడా విదల్చలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్కోచోట పనులు జరుగుతున్నాయి. గత వ్రభుత్వ వైఫల్యాన్ని పూర్తిస్థాయిలో సరిదిద్దేందుకు నిధుల కొరత అడ్డంకిగా మారింది. పూర్తిస్థాయిలో సమస్యలకు పరిష్కారం చూపలేకపోతోంది.

హైకోర్టు సూచనతో కదలిక

వసతిగృహాల్లో మౌలిక వసతుల కల్పనలో జరిగిన నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ 2023లో హైకోర్టులో పిల్‌ దాఖలైంది. దీంతో న్యాయస్థానం వసతి గృహాలను తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థల అధికారులను ఆదేశించింది. దీంతో వసతి గృహాల్లోని డోల్లతనం బయటపడింది. అత్యున్నత న్యాయస్థానం అధికారుల తీరును తప్పుబట్టింది. దీంతో కదిలిన యంత్రాంగం వసతిగృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించే పనిలో పడింది. 30 సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహాల్లోని 23 భవనాల మరమ్మతులకు రూ.4.67 కోట్లు కేటాయించారు. వీటితో పనులు మొదలయ్యాయి.

Updated Date - Aug 06 , 2025 | 12:21 AM