Share News

Where is this change going! ఈ మార్పు ఎటువైపో!

ABN , Publish Date - Nov 17 , 2025 | 11:51 PM

Where is this change going! శృంగవరపుకోట మండల పరిధిలోని బొడ్డవర వయా తాటిపూడి రోడ్డులో ఉన్న జెఎస్‌డబ్ల్యూ అల్యూమినియం లిమిటెడ్‌ కార్యాలయం బోర్డుపై జెఎస్‌ డబ్ల్యూ ఇండస్త్రీయల్‌ పార్కుగా పేరు మారింది. శనివారం కంటైనర్‌ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు.

Where is this change going! ఈ మార్పు ఎటువైపో!
జెఎస్‌ డబ్ల్యూ ఇండస్ట్రీయల్‌గా మార్చిన బోర్డు

ఈ మార్పు ఎటువైపో!

ఇదివరకు జిందాల్‌ అల్యూమినియం లిమిటెడ్‌ పేరు

ఇప్పుడు ఇండస్త్రీయల్‌ పార్కుగా మార్పు

ఎంఎస్‌ఎంఈల శంకుస్థాపనకు ఏర్పాట్లు

సీఎం రాకకోసం సిద్ధమవుతున్న హెలిపాడ్‌

నిర్వాసితుల ఆందోళనలతో భూమి పూజ వాయిదా పడుతున్నట్లు ప్రచారం

శృంగవరపుకోట, నవంబరు 17(ఆంధ్రజ్యోతి):

శృంగవరపుకోట మండల పరిధిలోని బొడ్డవర వయా తాటిపూడి రోడ్డులో ఉన్న జెఎస్‌డబ్ల్యూ అల్యూమినియం లిమిటెడ్‌ కార్యాలయం బోర్డుపై జెఎస్‌ డబ్ల్యూ ఇండస్త్రీయల్‌ పార్కుగా పేరు మారింది. శనివారం కంటైనర్‌ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. ఇక్కడ ఎంఎస్‌ఎంఈ పార్కుల నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు సీఎం నారాచంద్రబాబు నాయుడు డిసెంబరులో వస్తారని ప్రచారం జరిగింది. ఇందుకోసం ప్రత్యేకంగా హెలిపాడ్‌ను సిద్ధం చేస్తున్నారు. అయితే భూనిర్వాసితుల ఆందోళనలు కొనసాగుతుండడంతో ఎంఎస్‌ఎంఈ పార్కుల నిర్మాణానికి భూమి పూజ వాయిదా పడుతుందని చెప్పుకుంటున్నారు.

శృంగవరపుకోట మండలం చీడిపాలెం, చినఖండేపల్లి, కిల్తంపాలెం, మూలబొడ్డవర, ముషిడిపల్లి గ్రామాల పరిధిలో జేఎస్‌డబ్ల్యూ (జిందాల్‌ సౌత్‌ వెస్ట్‌) అల్యూమినియం లిమిటెడ్‌ నిర్మాణానికి 2007 జూన్‌లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం 834.66 ఎకరాల అసైన్డ్‌ భూమి, 151.04 ప్రభుత్వ భూమిని కేటాయించిన సంగతి తెలసిందే. దీంతో పాటు ఈ పరిశ్రమ యాజమాన్యం మరో 180.73 ఎకరాలను (జిరాయితీ భూములను)రైతుల నుంచి కొనుగోలు చేసింది. మొత్తం 1166.43 ఎకరాలలో అల్యూమినియం శుద్ధి కర్మాగారం (రిఫైనరీ విద్యుత్‌ పవర్‌ ప్లాంట్‌) నిర్మిస్తామని యాజమాన్యం చెప్పింది. దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తవుతోంది. ఎటువంటి పరిశ్రమ నిర్మాణం జరగలేదు. కాగా 2023 నవంబర్‌లో ఇండస్ట్రీయల్‌ కామర్స్‌ డిపార్ట్‌మెంటు వారు ఇక్కడ ఎంఎస్‌ఎంఈ పార్కు, ఇతర పరిశ్రమల ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలోనే ఈ తంతు జరిగినప్పటికీ ఈ భూముల్లో ఎంఎస్‌ఎఈ పార్కులు, ఇతర పరిశ్రమల నిర్మాణం చేపట్టలేకపోయింది. పారిశ్రామికీకరణకు కట్టుబడిని కూటమి ప్రభుత్వం జిందాల్‌ భూముల్లో ఇండస్టీయల్‌ పార్కుల ఏర్పాటుకు సుముఖంగా ఉంది. ఇందుకు అనుగుణంగా గత నెలలో మంత్రిమండలి తీర్మానం చేసింది.

ఆరు నెలలుగా ఉద్యమ బాట

అప్పట్లో జిందాల్‌కు భూములు ఇచ్చిన రైతులు తిరిగి తమ భూములను ఇచ్చేయాలన్న డిమాండ్‌తో ఆరు నెలలుగా ఉద్యమిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్‌లకు ఫిర్యాదు చేశారు. హైకోర్టులోనూ కేసులు వేశారు. భూములను తీసుకున్న యాజమాన్యం ఇంతవరకు పరిశ్రమను నిర్మించకుండా అన్యాయం చేయడంతో పాటు ప్రతిపాదిత పరిశ్రమ కాకుండ ఎంఎస్‌ఎంఈ పార్కు, ఇతర పరిశ్రమల నిర్మాణానికి భూములను అమ్మకం పెట్టిందని ఆరోపిస్తున్నారు. దీన్ని జిందాల్‌ యాజమాన్యం పట్టించుకోవడం లేదు. నిర్వాసితుల్లో అసహనం పెరుగుతుండడంతో ఆందోళనలను విరమించడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీయల్‌ పార్కుల నిర్మాణాల భూమి పూజకు జాప్యం జరుగుతోంది. భూనిర్వాసితుల సమస్యకు పరిష్కారం చూపడంతో పాటు త్వరితగతిన ఇండస్ట్రీయల్‌ పార్కుల నిర్మాణానికి చొరవ చూపాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Nov 17 , 2025 | 11:51 PM